- మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలిచ్చాం
- సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి
- పల్లా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం
అమరావతి (చైతన్యరథం): ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాస్‌తో సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సోమవారం పల్లా శ్రీనివాస్ యాదవ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నమ్మకంతో అతిపెద్ద బాధ్యత మీకు అప్పగించాం.. సమర్థంగా నిర్వహించాలన్నారు. అధికారంలో ఉన్నపుడు ప్రతి కార్యకర్తను దగ్గర చేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికీ తగు గౌరవం కల్పించాలి. ప్రత్యేకంగా యువతను పార్టీలోకి ఆహ్వానించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలి.
యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయి. జాతీయ అధ్యక్షుడిగా పార్టీ పరంగా, ముఖ్యమంత్రిగా ప్రభుత్వపరంగా అండగా ఉంటాను. నిత్యం కార్యకర్తలతో అనుసంధానమై పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలి. పార్టీ పరంగా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇస్తాను. సీనియర్ల సూచనలు, జూనియర్లు, యువత మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలి. వచ్చే నెల నుండి పార్టీ సభ్యత్వ నమోదు కూడా పున:ప్రారంభించాలి. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల్ని వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో నియమించి గౌరవించాలి. అదే సమయంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి నాయకుడికీ తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
సంపూర్ణ మద్దతు: లోకేష్
అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ను పల్లా శ్రీనివాస్ కలిసి, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన కంటే పెద్ద బాధ్యత మీపై ఉంచారని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రతి క్షణం కార్యకర్త నుండి నాయకుల వరకు అందరికీ తోడుగా నిలవాలి. కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు స్తబ్దుగా ఉన్నారని, వారందరినీ చురుకుగా పనిచేయించాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందన్నారు. పార్టీ కార్యాలయంలో మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని, తద్వారా ప్రతి మంత్రి కూడా నెలలో ఒక రోజు కనీసం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అధినాయకత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఏం కావాలన్నా అందించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని నారా లోకేష్ తెలిపారు.
అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: పల్లా
పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం కోసం అనునిత్యం కష్టబడతానని, సీనియర్ల సలహాలతో పార్టీకి యువరక్తం ఎక్కించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా చొరవ తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. కష్టబడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు.