ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని అంటూ లేదు… ప్రత్యేక హోదా కూడా రాలేదు.. పరిశ్రమలు లేవు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేవు. అప్పులు ఆకాశంలోకి పెరిగాయి.. ఆదాయం పాతాళంలోకి పడిపోయింది. మొత్తం మీద.. ఐదున్నర కోట్ల మంది ప్రజల చేతిలో చిప్ప మిగిలింది. కానీ.. యావత్ ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక వ్యక్తి మాత్రం.. కోట్లకు పడగలెత్తుతున్నారు. ఆకాశమే హద్దుగా తన ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 510 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి.. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచారు. ఆయన ఇంకెవరో కాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
తెల్ల చొక్కా.. క్రీమ్ కలర్ ఫ్యాంట్.. చేతికి ఓ రిస్ట్ వాచ్.. కాళ్ళకు సాదా సీదా లెదర్ చెప్పులు.. ఏపీ ముఖ్యమంత్రి డైలీ జనాలకు కనిపించే డ్రెస్సింగ్ స్టైల్ ఇది. ఓ సామాన్య ఎగువ మధ్యతరగతి మనిషిలాగా ఆయన కనిపిస్తారు. చాలా నిరాడంబరంగా.. అతి సామాన్యమైన వ్యక్తిలా జగన్ రెడ్డి డ్రెస్సింగ్ సెటప్ ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వకూడా లేని సింపుల్ పొలిటీషియన్‌లాగానే ఆయన మాటలు కొనసాగుతాయి. కానీ.. సింప్లిసిటీ వెనుక.. ధన కాంక్షతో రగలిపోయే ఓ అపరిచితుడు ఉన్నాడని.. ఆగర్భ శ్రీమంతులు సైతం అసూయపడే అపర కుబేరుడు ఉన్నాడని తెలుసుకోవటం చాలా కష్టం. కానీ..ఇది పచ్చి నిజం. సాదా సీదా మనిషిగా కలరింగ్ ఇచ్చే సీఎం జగన్ రెడ్డి.. అపార సంపద చిట్టాను “అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్” సంస్థ బయట పెట్టింది. 2019 వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఆయన సంపాదన విలువ అక్షరాలా 510 కోట్ల రూపాయలకు పైమాటే అని తేల్చింది. దేశంలోని 30 ముఖ్యమంత్రుల్లో కెల్లా అత్యంత ధనవంతుడైన సీఎంగా జగన్ రెడ్డి సరికొత్త రికార్డును సృష్టించారని వెల్లడించింది. 2019 నాటికే జగన్ రెడ్డి సంపద 510 కోట్ల మార్కును క్రాస్ చేయగా.. ఈ నాలుగేళ్ళలో ఆయన ఆదాయం ఐదారు రెట్లు పెరిగి ఉంటుందనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో వ్యక్తం అవుతోంది. అంటే.. కనుచూపు మేరలో జగన్ రెడ్డి సంపాదనను క్రాస్ చేసే స్థాయి ఏపీలోనే కాదు..యావత్ భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకునికీ ఉండదనే టాక్ వినిపస్తోంది.
ఇక.. 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎన్నిలక సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా “అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్” సంస్థ ఆయన సంపద మదింపును చేపట్టింది. దీని ప్రకారం జగన్ మోహన్ రెడ్డి సంపద… 510 కోట్ల రూపాయలతో దేశంలోని 30 రాష్ట్రాల ముఖ్యమంత్రులను వెనక్క నెట్టి అగ్రభాగాన నిలిచింది. దేశంలోని మొత్తం ముఖ్యమంత్రుల ఆదాయం కలిపినా జగన్ రెడ్డి సంపదను క్రాస్ చేయలేక పోయింది అంటే.. ఏపీ ముఖ్యమంత్రి తన సొంత లాభం చూసుకోవటానికి ఎంత ప్రయార్టీ ఇస్తారో..? అన్న విషయం ఇట్టే అర్ధం అయిపోతుంది. మోసానికి సంబంధించి 12 వరకు ఫోర్ ట్వంటీ ( 420) కేసులు.. 7 నమ్మక ద్రోహం కేసులు.. మనీ లాండరింగ్, కుట్ర వంటి ఆరోపణలకు సంబంధించి మొత్తం 38 కేసుల్లో ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయినా జగన్ రెడ్డి ఈ స్థాయిలో అపార సంపద పోగేసుకోవటాన్ని దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న జగన్ రెడ్డి అత్యంత ధనవంతునిగా గుర్తింపు పొందగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడుతోంది. జగన్ రెడ్డి విధానాల పుణ్యమా అని గత నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆయన బటన్ నొక్కుడు పథకాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం హారతి కర్పూరంలా కరిగి పోయింది. సుమారు 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన పడింది. ఇంకా అప్పులు మీద అప్పులు చేస్తున్న జగన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే వరకు తనకు నిద్ర పట్టదు అనేలా వ్యవహరిస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అత్యంత పేద రాష్ట్రానికి అత్యంత ధనవంతుడైన సీఎంగా జగన్ ఎలా అవతరించాడని..? నిలదీస్తున్నాయి. రాష్ట్రంలో యువత ఉపాధి కరువై.. భవిష్యత్‌కు భరోసా లేక విలవిల్లాడుతుంటే.. జగన్ రెడ్డి వందల కోట్ల రూపాయల సంపదను ఎలా పోగేసుకోగలుగుతున్నారని..? ప్రశ్నిస్తున్నాయి. ఆయన సంపద పెరగటానికి దోహదం చేస్తున్న ఆ “ట్రిక్” ఏంటో చెబితే.. ఏపీలోని కోట్లాది మంది యువత కూడా సంపన్నులుగా మారతారు కదా..? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తనకు తాను.. ఓ సామాన్యుడిలా.. బీదవాడిగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కడ బహిరంగ సభ పెట్టినా.. ఆయన నోటి వెంట బీద అరుపులే వస్తుంటాయి. తన దగ్గర అంగబలం.. అర్ధబలం లేదని.. ” ఆ దేవుని ఆశీర్వాదాలు.. మీ చల్లని దీవెనలే” చాలంటూ సినిమా డైలాగ్స్ వల్లె వేస్తూ ఉంటారు. ఈ మాటలు నిజమని నమ్మి.. జనం తప్పులో కాలేయటం ఏపీలో సర్వసాధారణంగా మారింది. అయితే.. అపరకుబేరుడైన సీఎం జగన్ రెడ్డి నోటి వెంట వస్తున్న ఈ బీద మాటలను ఇకపై నమ్మే పరిస్తితి లేదనే టాక్ వినిపిస్తోంది. బటన్ నొక్కుడు పథకాలతో ప్రజల్ని బిచ్చగాళ్ళలా మారుస్తున్న జగన్ రెడ్డి.. తన వ్యాపారాలు మాత్రం తాను చేసుకుంటున్నారని.. ఏటా వందల కోట్ల రూపాయల సంపద పోగేసుకుంటున్నానే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మొత్తం మీద.. అపరకుబేరుడు ఏపీ సీఎం జగన్ నిజస్వరూపాన్ని బయట పెట్టిన “అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్” రిపోర్ట్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.