- పక్కదారులు వెతుక్కుంటున్న నేతలు, శ్రేణులు
- అయినా.. శవరాజకీయాలవైపే అధినాయకుడు
- చెరపకురా చెడేవు సామెతను తలిపిస్తోన్న వైసీపీ
- చంద్రబాబు సహనమే.. ముసలానికి కారణమా?
అమరావతి (చైతన్య రథం): చెరపకురా చెడేవు అన్నది తెలుగు సామెత. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది. ఏపీని విధ్వంసం పాల్జేసిన వైసీపీ `వినాశనంవైపు పరుగులు తీస్తోంది. అహంతోను, అక్కసుతోను తప్పులమీద తప్పులు చేసుకుంటూ వెళ్తోన్న జగన్.. తనకు తానే శత్రువుగా మారుతున్నాడు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించినట్టే.. అనైతిక, అసంబద్ధ రాజకీయంతో పార్టీని భ్రష్టుపట్టిస్తుంటే `జగను వైఖరిని వైసీపీ నాయకులు, శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఇమడలేక, అధినాయకుడికి పరిస్థితిని చెప్పుకోలేక `తప్పుకోవడమే ఉత్తమమార్గమన్న విధానాన్ని అనుసరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీలో సంభవిస్తున్న పరిణామాలు `కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయినా.. తీరుమార్చుకోని జగన్ అబద్ధాలు, అనైతిక రాజకీయంతో ముందుకెళ్తుండటం విడ్డూరమే.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతోనే వైసీపీలో ముసలం మొదలైంది. అప్రతిహత విజయం సాధించిన కూటమి చేతిలో చావుదెబ్బ తప్పదన్న భయాందోళన వైసీపీ నేతల్లో మొదలైంది. ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు కీచకపర్వాన్ని తలపించిన నేతలంతా `కూటమి వేటక బలైపోవడం ఖాయమనే బెదిరిపోయారు. అధికారంలోవున్న వైసీపీ విపక్షాలను ఊచకోత కోసిన ఘట్టాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ‘తప్పుచేసిన వాళ్లు చట్టబద్ధంగా శిక్షార్హులే’ అంటూనే `వైసీపీ ఏలుబడిలో విధ్వంసానికి గురైన ఏపీ పునర్నిర్మాణంపైనే దృష్టిపెట్టారు. ‘రాజకీయాల్లో పగా ప్రతీకారాలకు తావుండకూడదు’ అంటూ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే చంద్రబాబు ప్రకటించారు. ప్రకటించడమే కాదు, దాన్ని చేతల్లోనూ చూపించారు. ఓటమి తరువాతా.. ఎన్టీయే సర్కారుపై విషంగక్కడానికి వైసీపీ అధినాయకుడు అనేక సందర్భాలు వెతుక్కున్న తరుణంలోనూ చంద్రబాబు చూపించిన సహనశీలతే.. ఇప్పుడు వైసీపీ పుట్టిముంచే పరిస్థితి తెచ్చింది.
జగన్ విధ్వంస రాజకీయాన్ని తిప్పికొట్టిన ప్రజలకూ.. ఓటమి తరువాత జగన్ సహజ నైజం పూర్తిగా అర్థమైంది. అటు ప్రజాక్షేత్రంలో ఎదురైన అవమానభారం.. ఇటు ప్రత్యర్థి చంద్రబాబు ప్రదర్శించే సహనం.. వైసీపీ అధినేత జగన్‌కు ఊపిరాడనివ్వలేదు. చంద్రబాబును అభాసుపాల్జేయడానికి వేసిన ఎత్తుగడలన్నీ బూమరాంగై తిరిగి తగులుతుండటంతో జగన్ బ్యాలెన్స్ తప్పినట్టే కనిపిస్తున్నాడు. ఈ పరిణామాలే వైసీపీ నేతలను మరింత భయపెడుతున్నాయి. ముఖ్యమంత్రి మౌనం.. కొందరిలో పరివర్తనకు దారితీస్తే.. మరికొందరిలో పార్టీని వీడటం మంచిదన్నంత భయాందోళనకు గురి చేసింది. ఈ పరిణామాలే `వైసీపీ ఉనికికే ముసలం తెచ్చాయని చెప్పక తప్పదు.
ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత `వైసీపీకి చిక్కుల్లో పడటానికి కారణమిదే. బహిరంగంగానే ప్రజలు ముఖంమీద ఉమ్ముతుంటే.. వైసీపీ నాయకులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రహస్య ప్రదేశాలకే పరిమితమవుతున్నారు.
శవ రాజకీయాలు చేసే మీకెందుకు రాజకీయాలంటూ ప్రజలు ప్రశ్నిస్తుంటే… అధినాయకుడి శవరాజకీయాలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఒకవైపు ఓటమి బాధ, మరోవైపు నియోజకవర్గాల్లో తలెత్తెకోలేని పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దాంతో వైసీపీనుంచి ఒక్కొక్కరిగా బయటకు క్యూగట్టడం కనిపిస్తోంది. వైసీపీలో రాష్ట్రమంతటా రాజీనామాలు మొదలయ్యాయి. పార్టీ అధికారంలో ఉన్నపుడు.. క్షేత్రస్థాయిలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోవడం కూడా ఇప్పుడు ఆ పార్టీ నాయకులకు శాపమైంది. ఇక అభివృద్ధివైపే మా పరుగులంటూ స్థానిక నేతలు వైసీపీని వీడుతున్నారు. పార్టీ పరిణామాలు జీర్ణించుకోలేక ఎన్నికలకు ముందే పలువురు కీలక వైసీపీ నేతలు కూటమి పక్షాన చేరిపోయిన ఉదంతాలు ఇక్కడ ప్రస్తావనార్హం.
పార్టీలో కష్టపడ్డవారికి, త్యాగాలు చేసినవారికి గుర్తింపు లేదంటూ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీని ఛీకొట్టి బయటకు రావడం తెలిసిందే. పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్నా తనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం లభించలేదని, పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయలేకపోయానని, ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ వీడుతున్నానంటూ పెండెం దొరబాబులు బహిరంగ ప్రకటన చేసి.. వైసీపీ చేయి వదిలేశారు. ఇప్పుడు తాజాగా వ్యక్తిగత కారణాలు చూపుతూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఏలూరు అసెంబ్లీ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీమంత్రి ఆళ్ల నాని అధినాయకుడు జగన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రులు శిద్దా రాఘవులు, రావెల కిషోర్‌బాబు, మాజీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌వంటివారు వైసీపీనుంచి బయటకు వచ్చేశారు. వైకాపా ఎంపీపీలు, కార్పొరేటర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, మేయర్లు ఆ పార్టీని వదిలి.. అధికార తెలుగుదేశం ఆశీర్వాదం అందుకుంటున్నారు. దాంతో కార్పొరేషన్లలో వైసీపీ బలం సన్నగిల్లుతుంది. వారు పోతేపోనీలే మిగిలిన వారు అండగా ఉంటారనుకున్న నేతలు సైతం వైసీపీకి గుడ్‌బై చెప్తుండటం.. ప్రమాదంలో పడిన పార్టీ ఉనికిని తేటతెల్లం చేసేదే.
కొంతమంది ముఖ్య నేతల సమావేశంలో.. ‘ఉంటే ఉంటారు, పోతే పోతారు’ అని జగన్‌రెడ్డి ఎమ్మెల్సీలపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీలూ సందిగ్ధంతో రగిలిపోతున్నారు. మండలి వైస్ చైర్మన్ సైతం వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతారని, ఇప్పటికే టీడీపీతో టచ్‌లోకి వచ్చారన్న కథనాలకు ఇది బలం చేకూరుస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రత్యర్ధిని నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా దౌర్జన్యకాండ కొనసాగించి ఏకగ్రీవాలు చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం వైసీపీని వలసల బాట వణికిస్తుంది. వైసీపీ ఎంపీలు, మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా కూటమిలో చేరుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ కార్యాలయాలవైపు చూసే నాయకులే కరవయ్యారంటే అతిశయోక్తి కాదు. దీంతో జిల్లాల్లోని పలు వైసీపీ కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయి. తాళాలు పడుతున్నాయి.
చేసిన పాపాలు వెంటాడుతుంటే.. వ్యక్తిగత పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు గడిచిన 60 రోజుల్లో ఎనిమిది సార్లు బెంగళూరు వెళ్లాల్సివచ్చింది జగన్‌కు. అధికారంలోవున్న ఐదేళ్లూ త్యాడేపల్లి ప్యాలెస్‌నుంచి బయటకు అడుగుపెట్టని, అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా నేతలను లోపలకి అడుగుపెట్టనివ్వని జగన్.. సరిదిద్దుకోలేని తప్పులు చేసి తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నాడు. ఇప్పుడు కార్యకర్తల మధ్యకొచ్చి కపట ప్రేమ చూపిస్తున్నా.. నమ్మే పరిస్థితి లేదు. పగలూ ప్రతీకారాలకు అలవాటుపడిన వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకుంటుంటే `జగన్ మాత్రం ఆ శవాలపై రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవడం కనిపిస్తోంది. జగన్ మాయనుంచి బయటపడి వాస్తవాలను ఇప్పుడిపుడే అవగతం చేసుకుంటున్న ముఖ్య నేతలైతే.. నేరస్తులను వెంటేసుకొని తిరుగుతున్న జగన్ వెంట ఎలా తిరుగుతామని తెగేసి చెప్తున్నారు. మొత్తానికి వైసీపీలో ముసలం పరాకాష్టకు చేరుతోంది. ఇదే `కాంగ్రెస్‌లోకి వైసీపీ విలీనం కాబోతోందన్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఏపీని విధ్వంసం పాల్జేసిన జగనే `తన సహజ నైజంతో వైసీపీనీ వినాశనంవేపు నడిపించాడు. ఇప్పుడు `జగన్‌కు జగనే శత్రువు!!