వైసీపీ ప్రభుత్వం ఎడా పెడా అప్పులు చేస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చింది మొదలు, అప్పులు తీసుకురావడానికి ఉన్న, ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏపీ అప్పులు 6.73 లక్షల కోట్లుగా తేలింది. ఇక బడ్జెట్ లెక్కల్లో చూపని అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు అన్నీ కలుపుకుంటే మొత్తం 9 లక్షల కోట్లుపైనే ఉంటుందని అంచనా. ఇప్పటికే తీసుకున్న రుణాలు చెల్లించేందుకు,లోటు భర్తీ కోసం కొత్తగా అప్పులు చేస్తున్నారని కాగ్ గుర్తించింది. బడ్జెట్లో చూపకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు కూడా లెక్కిస్తే ఏపీలో రుణ విస్పోటం జరుగుతోందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట GSDPలో 2017-18 నుంచి 2021-22 మధ్య రుణ నిష్పత్తి విపరీతంగా పెరిగిపోయింది. 2022 మార్చి 31 నాటికి GSDPలో రుణాల శాతం 31 శాతమే ఉన్నట్లు బడ్జెట్ లెక్కల్లో చూపుతున్నారని కాగ్ తేల్చింది. లెక్కల్లో చూపని రుణాలు పరిగణనలోకి తీసుకుంటే రుణాల శాతం అధికంగా ఉంటుందని కాగ్ నివేదికలో వెల్లడించింది. బడ్జెట్లో చూపని రుణాలను తీసుకుంటే GSDPలో రుణాల శాతం 42 శాతంపైనే నమోదైంది. కాగ్ పరిమితి కన్నా ఇది 6.73 శాతం ఎక్కువ. 2024 నుంచి పాత అప్పులు తీర్చేందుకు ఏటా 42362 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కాగ్ నివేదికలో తేల్చి చెప్పింది. పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పుల్లోని 65 నుంచి 83 శాతం నిధులు చెల్లించాల్సి వస్తోందని జగన్ రెడ్డి ప్రభుత్వ తీరును కాగ్ తప్పుపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మొత్తం వ్యయంలో కనీసం 14 శాతం అభివృద్ధి పనుల కోసం చేయాల్సి ఉంటుంది. ఏపీ మాత్రం మొత్తం వ్యయంలో కేవలం 9.21 శాతం మాత్రమే అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తోందని కాగ్ నివేదికలో తెలిపింది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధిపై దారుణమైన ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో చూపని రుణాలు 1.18 లక్షల కోట్లు, డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు, నీటి పారుదల పథకాల బకాయిలు మరో 17 వేల 804 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలను బడ్జెట్లో చూపడం లేదని కాగ్ తప్పు పట్టింది. జగన్ రెడ్డి ప్రభుత్వం అందించిన లెక్కల ప్రకారమే 2022, మార్చి 31 నాటికి మొత్తం 4 లక్షల 97 వేల కోట్ల అప్పు ఉన్నట్టు కాగ్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 30 కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలను కూడా కలిపితే మొత్తం అప్పు 6.27 లక్షల కోట్లకు చేరింది. ఇలాగే అప్పులు చేసుకుంటూ సీఎం జగన్ రెడ్డి బటన్లు నొక్కితే , శ్రీలంకలాంటి సంక్షోభం తలత్తే ప్రమాదం తప్పదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
FRBM నిబంధనలకు అనుగుణంగా మాత్రమే అప్పులు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోందని, నిజాలు వెల్లడించడం లేదని కూడా కాగ్ తాజా నివేదికలో కుండబద్దలు కొట్టింది. రాష్ట్ర సంచిత నిధి, పబ్లిక్ అకౌంట్ లోని బకాయిలు, ప్రభుత్వ రంగ సంస్థలు, SPVలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను బడ్జెట్లో స్పష్టంగా వెల్లడించలేదని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తమకు ఆమోదయోగ్యం కాదని కూడా కాగ్ తన నివేదికలో తీవ్రమైన కామెంట్స్ చేసింది.
ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా తెస్తున్న అప్పులపై ఆర్థికవేత్తలు మొదటి నుంచి ఆందోళన చేస్తున్నారు. టీడీపీ మొదట్నుంచి అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ.. వైసీపీ సర్కార్ మాత్రం .. పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ ప్రభుత్వం అయినా.. తాము తెచ్చిన రుణాల్లోంచి.. కొంత భాగాన్ని.. అభివృద్ధి పనుల కోసం.. మౌలిక వసతుల కల్పన కోసం కేటాయిస్తారు… కానీ జగన్ ప్రభుత్వం మాత్రం.. అటువంటి దిశగా ఆలోచించిన పాపాన పోలేదు.. కనీసం రోడ్ల మరమ్మతుల కోసం నయాపైసా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. అందుకనే ప్రతిపక్షాలు ఈ ఆర్థిక నిర్వహణ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. అప్పులు చేయడంలో.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, అందుకే ఏపీ రుణాలు 9 లక్షల కోట్లు దాటిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ఇన్ని అప్పులు తెస్తోన్న ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో ఒక్కసాగునీటి ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయలేకపోవడం దారుణం. రాబోయే సంవత్సరాల్లో పాత అప్పులు, వడ్డీలు చెల్లించడానికే కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొనే ప్రమాదముంది.