ఊహించని విలయం ఆంధ్రప్రదేశ్‌కి అపార నష్టాన్ని, కష్టాన్ని మిగిల్చింది. ఈ పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వ సత్వర ఉదార సాయమే దెబ్బతిన్న ఏపీకి సంజీవిని. ఇది కనివిని ఎరుగని అసాధారణ విపత్తు. రికార్డుస్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. కోలుకోలేని దెబ్బతీశాయి. కేంద్రం మానవీయ కోణంలో ఆలోచించి ఉదారంగా సాయం చేయాలి. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం సంభవించింది. నీట మునిగిన పంటను చూసి రైతులు కన్నీట మునిగారు. కనిపించని బాధతో ప్రజలు క్షోభ అనుభవించారు. ప్రజల కష్టాలు పెద్ద మనసుతో అర్థం చేసుకుని.. ప్రజలు తిరిగి నిలబడేలా కేంద్రం సాయమందించాలి. రెండు రోజుల్లో 50 సెంటీమీటర్ల వర్షం పడటం ఊహించనిది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పది రోజులుపాటు వరద బాధితులను ఆదుకొనేందుకు రేయింబవళ్లు యుద్ధం చేశారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చడం దగ్గర నుండి, బాధితులకు సహాయక చర్యలు చేపట్టడం వరకు ప్రభుత్వం సర్వశక్తులొడ్డి చేసింది. రోడ్లు, ఇరిగేషన్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. సర్వంకోల్పోయి కష్టాల్లోవున్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప తిరిగి కోలుకోనే పరిస్థితి లేదు.
అది జరగాలంటే.. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించి బాధితుల బతుకులకు కేంద్రం బాసటగా నిలవాలి. నిబంధనలతో ముడిపెట్టకుండా నిధులు సమకూర్చాలి. వరదలతో ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. వరదల విధ్వంస తీవ్రత మాటలకందనిది. నీటమునిగిన ఇళ్లూ పొలాలను తలచుకుంటేనే బాధితుల గుండెలవిసి పోతున్నాయి. ఏకధారగా కురిసిన వానలకు మహోగ్ర రూపం దాల్చిన బుడమేరు విజయవాడపై పడి శోకాగ్నిని రగిల్చింది. బుడమేరు వరద ప్రభావం ప్రధానంగా విజయవాడ నగరంపైనే చూపింది. పది రోజులపాటు ముంపు నీటిలోనే చాలా కాలనీలు తేలియాడాయి. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారి ఇళ్లు, భవనాలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతినడంతో పాటు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది. రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు, చిన్నాచితకా ఉద్యోగ, వ్యాపారాలతో బతుకుబండిని నెట్టుకొచ్చే మధ్యతరగతి ప్రజలు, చిన్న సన్నకారు రైతులు దారుణంగా దెబ్బతిన్నారు. ఇళ్లలో సామాగ్రి నాశనమైంది. దుస్తులనుంచి గృహాపకరణాలు వరకు నీట మునిగాయి. వంట సామాన్లు, గ్యాస్‌స్టౌవ్‌లు, పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు అన్నీ వరదపాలయ్యాయి. ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
వరదలతో చిన్న పరిశ్రమలు చికితిపోయాయి. యంత్రాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలపై చాలామంది ఆధారపడి జీవిస్తున్నారు. దీనివల్ల యజమానులకు ఆర్థికంగా నష్టంరాగా, కూలీల జీవనోపాధికి గండి పడిరది. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, ఫ్యాన్సీ షాపులు నడుపుకునే వారికీ నష్టం వాటిల్లింది. వారి దుకాణాలను వరద నీరు ముంచెత్తడంతో ఎంతో విలువైన సరుకులు నీట మునిగాయి. ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం వేగంగానే స్పందించింది. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం జనం కడగండ్లను పరిశీలించింది. మళ్లీ రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి నష్టాలను అంచనావేసి వెళ్లింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, పార్టీలు, వ్యక్తులు, మానవతావాదులు వరద ప్రాంత ప్రజలకు సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు, వేలకోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ స్థితిలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు, నివేదికల పేరిట ఆలస్యం చెయ్యకుండా సత్వరం ఆర్ధిక సాయం అందించి వరద బాధితులకు బాసటగా నిలవాలి.
రోడ్లు, మౌలిక సదుపాయాలూ దెబ్బతిన్నాయి.
పంటల నష్టం లెక్కలకు అందనిదే. తక్షణ పరిస్థితిని అంచనా వేసి కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంది. దెబ్బతిన్న మౌలిక వసతులు, బాధితుల్లో చిట్టచివరి వ్యక్తికీ సాయమందేలా చూడడం, జన జీవనం, ఉపాధి తిరిగి మామూలు పరిస్థితికి వచ్చేలా తోడ్పాటు అందించాలి. వీటన్నిటికీ కేంద్రం సత్వర్వ సాయం అందించాల్సి వుంది. విపత్తు తీవ్రత దృష్ట్యా జాతీయ విపత్తుగా ప్రకటించాలి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు ఇదే. వరద సహాయం అందించడంపై కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి. కేంద్ర మంత్రులు, బృందాలు పర్యటించి వెళ్లినా, ఇప్పటివరకు తక్షణ సాయం ప్రకటించలేదు. తక్షణ సహాయంతో పాటు వరద ముంపు నుండి శాశ్వత నివారణ చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ప్రకృతి ఉత్పాతానికి బలైన రాష్ట్రానికి తోడుగా నిలిచి కేంద్రం మానవీయంగా వ్యవహరించాలి.
కష్టాల్లో వున్న రైతులందరికీ అండగా నిలుస్తామని, అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందిస్తామని సీయం చంద్రబాబు ప్రకటించడం రైతులకు గుండెధైర్యాన్నిచ్చే మాట. కేంద్రం మెరుగైన ఆర్ధిక సాయమందిస్తే రోదిస్తున్న రైతు కుటుంబాలు తిరిగి నిలబడగలవు. ప్రతి ఏటా వ్యవసాయ రంగంపై పకృతి పగ తీర్చుకొంటూ రైతులోకాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. రైతుకు అతిపెద్ద నష్టం విపత్తుల వల్లనే. విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసేందుకు సరైన విధానాన్ని అనుసరించడంలేదు. విపత్తుల నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చే కేంద్ర బృందాలు వేస్తున్న అంచనాలు, రైతులకు అందుతున్న పరిహారం అరకొరే. విపత్తుల కారణంగా రైతులు 50 శాతం మేరకు పంటలు నష్టపోతున్నట్లు సమాచారం. రైతుపెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా నష్టం అందని పరిస్థితి. పంటల భీమా పథకం రైతు ప్రయోజనాలు కన్నా బీమా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనకరంగా మారింది. తరచూ తుఫానులకు గురవుతున్న రైతులను ఆదుకొనే విధానాలను అన్వేషించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏకబిగిన కురిసిన వర్షాలు, అన్నదాతల ఆశల పంటను సర్వనాశనం చేసింది.
ప్రభుత్వాధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారమే రాష్ట్రంలో ఏపీలో దాదాపు ఐదు లక్షల ఎకరాలలో పైర్లు పాడైనట్టు సమాచారం. ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి పంటనష్టాలను పక్కాగా నమోదు చేస్తే తప్ప రైతాంగాన్ని కన్నీట ముంచిన విపత్తు తీవ్రత ఎంతటిదో పూర్తిగా వెలుగులోకి రాదు. ఈ మధ్యనే నాట్లు వేసిన వరి పొలాల్లో కొన్ని ఐదడుగులమేర నీళ్లు నిలిచిపోగా, పూత కాత దశలోని పత్తి, ఇతర పంటలు నీళ్లలో కుళ్లుతున్నాయి. మిర్చి, మొక్కజొన్న, కందులు, పెసలతోపాటు ఉద్యానవన పంటలూ ప్రకృతి ప్రకోపానికి గురయ్యాయి. పెట్టుబడులను కోల్పోయిన రైతులకు ఉదారంగా సాయం చెయ్యడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రాంతాల రైతాంగం కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి వెళ్లారు. కేంద్ర మంత్రి వచ్చారు చూశారు వెళ్లారు తప్ప కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అనేకచోట్ల రైతులు అనేక పంటలను పూర్తిగా నష్టపోయినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నష్టం అంచనాగా రు.6,880 కోట్లని కేంద్రానికి నివేదించి సాయాన్ని కోరింది. అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకోకుండా కేంద్ర ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించాలి. నిబంధనలతో ముడిపెట్టకుండా నిధుల సత్వరం విడుదల చేస్తే ప్రకృతి వైపరీత్యాలకు తల్లడిల్లుతున్న రాష్ట్రాలు త్వరితగతిన కోలుకోగలవు. ఉదార కేంద్ర సాయమే ఆంధ్రప్రదేశ్ సంజీవిని అవుతుంది. ఏపీ తొందరగా తేరుకోడానికి కేంద్రం అలాంచి సంజీవిని అందిస్తుందని ఆశిద్దాం.
నీరుకొండ ప్రసాద్