అమరావతి: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికపై సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు విమర్శించారు. వైకాపా నాలుగున్నరేళ్ల పాలనలో దళితులుపై 6 వేలకు పైగా దాడులు జరిగాయని రాజు అన్నారు. దాదాపు 150 మందికి పైగా దళితులు హత్యకు గురయ్యారు. దళిత దీనజనోద్ధారకుడిలా ఊదరగొట్టే జగన్ పాలనలో వారానికి నలుగురు దళితులు హత్యలకు గురవుతున్నారు. 6 గురు దళితులపై హత్యాయత్నాలు జరుగుతున్నాయి. రోజుకు ఇద్దరిపై దాడులు జరుగుతుండగా, వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దళితులపై దాడుల్లో ఏపీ దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో 7వ స్థానంలో ఉంది. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం.. 2022లో దళితులపై దాడులు, నేరాలు కర్ణాటకలో 1,977, తెలంగాణలో 1787, తమిళనాడులో 1761, కేరళలో -1050, ఏపీలో 2315 జరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం దళితులపై 2020 లో 1950, 2021 లో 2014, 2022 లో 2315 నేరాలకు పాల్పడ్డారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో 4 శాతం ఏపీలోనే చోటుచేసుకుంటు న్నాయి. కేంద్ర నేరగణాంక సంస్థ తెలిపిన ఈ వాస్తవాలను దాచిపెట్టి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే దళిత, గిరిజనులకు రక్షణ అంటూ సాక్షి తప్పుడు కథనాలు రాస్తోంది. కేంద్ర సంస్థల నివేదికలను సైతం వక్రీకరించేలా సాక్షి తప్పుడు రాతలు మానుకోవాలి. రాష్ట్రంలో వైకాపా పాలనలో దళితులు, గిరిజను లపై దమనకాండ కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దళితుల పక్షాన పోరాటం చేస్తోంది. దళితులపై దాడు లకు సంబంధించి కేంద్ర నేరగణాంక సంస్థ తెలిపిన వివరాలుపై, తెదేపా చెబుతున్న లెక్కలపై సాక్షికి అనుమానం ఉంటే బహిరంగ చర్చకు రావాలి. దళిత-గిరిజనులపై వైకాపాకు, సాక్షి యాజ మాన్యంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీనిపై స్పందించాలని బుధవారం ఒక ప్రకటనలో ఎంఎస్ రాజు సవాల్ చేశారు.