తిరుపతి: తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పులతో సమాధానం చెప్తామని తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వ్యక్తిగతంగా, అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత చెంగల వెంకటరావు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దళిత మహిళపై బురద జల్లే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మూడేళ్లలో వైసీపీ నేతలు బూతులు మాట్లాడటంలో పీహెచ్డీ చేశారన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పుష్పవది, తిరుపతి నగర మహిళ అధ్యక్షురాలు బ్యాంక్ శాంతమ్మ, అనిత, విజయలక్ష్మి, లతమ్మ, లక్ష్మీ, రేవతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.