- సైకిల్ యాత్ర తలపెట్టకుండా ముందుగానే అడ్డుకున్న పోలీసులు
- రోజంతా పలు స్టేషన్లకు తిప్పుతూ పోలీసుల వేధింపులు.. ఖండించిన అచ్చెన్న, లోకేష్
- ఇంటి వద్ద విడిచిపెడతామని రాత్రి 11 గంటలకు సమాచారం ఇచ్చిన పోలీసులు
మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం చేపట్టిన సైకిల్ యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యాత్రకు అనుమతి లేదంటూ ఉదయం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి వరకు ఆయనను వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పారు.
ఆయన ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క రవీంద్రను పోలీసులు అక్రమంగా అదుపులోని తీసుకోవటంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రవీంద్ర గురించి ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు. సైకిల్ యాత్రకు ముందు బందరుకోట గుడిలో పూజలు చేసేందుకు వచ్చిన రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. సైకిల్ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని ఉదయం నుంచి కొల్లు రవీంద్రను రోడ్లపై తిప్పుతూనే ఉన్నారు. రవీంద్రను నిడుమోలు, కూచిపూడి, నాగాయలంక స్టేషన్లకు తీసుకెళ్లారు. నాగాయలంక పోలీసు స్టేషన్‌లో రవీంద్రను పరామర్శించేందుకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వెళ్లడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీస్‌స్టేషన్‌కు తెదేపా శ్రేణులు భారీగా చేరుకొని ఆందోళనకు దిగాయి. దీంతో కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చి తిరిగి బందరు తీసుకెళ్లి వదిలేస్తామని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల మీద నమ్మకం లేదని పార్టీ నేతలు వాగ్వాదానికి దిగడంతో… ఎవరైనా ఒకరు వారితో రావొచ్చని పోలీసులు తెలిపారు. దీంతో రవీంద్రతో పాటు వెంకట్రామ్‌ను నాగాయలంక పీఎస్ నుంచి రెండు వాహనాల్లో తరలించారు. కాగా, బందరు సమీపంలోకి వెళ్లగానే పోలీసులు మరో వాహనంలోకి వెంకట్రామ్‌ను ఎక్కించి ఉంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అయితే, కొల్లు రవీంద్రను బందరు తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తరలించారనే విషయం మాత్రం తెలియరాలేదు. దీంతో కొల్లు రవీంద్ర ఆచూకీ తెలపాలంటూ ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు జిల్లా కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఆ దశలో రాత్రి 11 గంటల ప్రాంతంలో రవీంద్రను మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద విడిచిపెడతామని పోలీసులు సమాచారం ఇవ్వటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల తీరు దుర్మార్గం: అచ్చెన్న
మాజీ మంత్రి కొల్లు రవీందర్ ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటివరకు తిప్పుతూ ఇంతవరకు ఎక్కడున్నారో కనీసం కుటుంబ సబ్యులకు సమాచారం ఇవ్వరా? ఎవరికి చెప్పకుండా రహస్య ప్రాంతాల్లో తిప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన చేసిన తప్పేంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారు?టిడిపి నేతలు ఉంటే జగన్ రెడ్డికి ఎందుకంత భయం? కొల్లు రవీంద్రను పోలీసులు వెంటనే విడుదల చేయాలి. చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడే పోలీసుల్ని కోర్టు బోనులో నిలబెడతాం.
రవీంద్ర ఆచూకీపై ఆరా తీసిన లోకేశ్…
కొల్లు రవీంద్ర ఆచూకీపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు. సైకిల్ యాత్ర చేస్తున్న మాజీ మంత్రిని ఇంత వేధిస్తారా? తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు తప్ప పాలన కనిపించడం లేదని మండిపడ్డారు. వెంటనే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.