- పాత్ హోల్ ఫ్రీ ప్రాజెక్టు పూర్తికి నిర్ణయం
- రూ.861 కోట్లతో శరవేగంగా పనులు
- పీపీపీ విధానంలో 18 ఎస్హెచ్ నిర్మాణ పనులు
- నరేగా నిధులతో గ్రామాల్లో అంతర్గత రోడ్లు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో రూ.861 కోట్లతో చేపట్టిన ‘గుంతలు లేని రోడ్లు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్షించారు. నవంబర్ 2న అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పనులు సంక్రాంతి నాటికి పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. మొక్కుబడిగా పనులు చేస్తే సహించేది లేదని…. పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని సీఎం ఆదేశించారు. నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ప్రైవేటు సంస్థల ద్వారా రోడ్ల నాణ్యతపై నివేదికలు తెప్పించాలని సూచించారు. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా రోడ్ల మరమ్మతులు సమగ్రంగా జరగాలని సీఎం అన్నారు. 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చి బాగు చేసే పనులు జరుగుతున్నాయి. సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో ఈ పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం 45,378 కి.మీ ఆర్ అండ్ బి రోడ్ నెట్ వర్క్ ఉండగా, అందులో 22,299 వేల కి.మీమేర మరమ్మతులు చేయాల్సి ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.861 కోట్లతో ముమ్మరంగా మరమ్మతులు చేస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 1,991 కి.మీ మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్టు అధికారులు వివరించారు. మరోవైపు 1,447 కి.మీ మేర రోడ్లు రిపేర్ చేయలేని స్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిస్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు నిర్మించాల్సి ఉందని.. వీటికి రూ.581 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. అవసరం మేరకు నిధులు రానున్న రోజుల్లో మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 23,521 కి.మీమేర జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉందని…. వీటికి రూ.33 కోట్లు ఖర్చవుతుందని… ఈ పనులు కూడా రానున్న రోజుల్లో చేపడతామని అధికారులు తెలిపారు.
పీపీపీ పద్ధతిలో స్టేట్ హైవేలు
రాష్ట్రంలో మొత్తం 12,653 కిలోమీటర్ల మేర రాష్ట్ర హైవే ఉన్నాయని… వీటిలో 10,200 కి.మీ మేర పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టవచ్చని అంచనాకు వచ్చినట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్ల అధికారులు వివరించారు. రాష్ట్రంలో మొదటి ఫేజ్ కింద 18 రోడ్లును 1,307 కి.మీ మేర పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయించారు. వీటికి డీపీఆర్లు తయారు చేసి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. పీపీపీ మోడల్లో డీబీఎఫ్వోటీ (డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్), బీవోటీ (బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్), హెచ్ఏఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్), టీవోటీ (టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్), ఓఎంటీ (ఆపరేట్ మెయిన్టెన్ అండ్ ట్రాన్స్ఫర్) వంటి విధానాల ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఆ విధానంలో చిలకలపాలెం- రామభద్రపురం- రాయగడ, విజయనగరం -పాలకొండ, కళింగపట్నం- శ్రీకాకుళం- పార్వతీపురం, భీమునిపట్నం -నర్సీపట్నం, కాకినాడ- జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్, ఏలూరు- మేడిశెట్టివారిపాలెం, నర్సాపురం- అశ్వారావుపేట, ఏలూరు- జంగారెడ్డిగూడెం, గుంటూరు-పర్చూరు, గుంటూరు- బాపట్ల, మంగళగిరి- తెనాలి -నారా కోడూరు, బేస్తవారిపేట- ఒంగోలు, రాజంపేట -గూడూరు, ప్యాపిలి-బనగానపల్లి, దామాజీపల్లి- తాడిపత్రి, జమ్మలమడుగు -కొలిమిగుండ్ల, సోమందేపల్లి- హిందూపురం- తూముకుంట మధ్య మొత్తం 1,307 కి.మీ మేర పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించనున్నారు.
నేషనల్ హైవేలలో ఎలా అయితే పీపీపీ పద్ధతికి ప్రజలు ఆమోదం తెలిపారో…. మంచి రోడ్లు అందుబాటులోకి తెస్తే స్టేట్ హైవేల విషయంలో కూడా అటువంటి స్పందనే వస్తుందని సీఎం అన్నారు. అయితే ఈ రోడ్లపై టోల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లతోపాటు ఇంకా ఎవరికి మినహాయింపు ఇవ్వాలనేది కూడా చర్చించాలని చెప్పారు. కేవలం భారీ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రమే రుసుము వసూలు చేసే విధానంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రజలపై భారం వేయకుండా….. రోడ్ల నిర్మాణ సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండిరగ్ ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం అన్నారు. మంచి రోడ్లు, ప్రజలకు రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు.
ఎన్డిబి పనులు వేగవంతం
రాష్ట్రంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన ఫేజ్ 1 పనుల్లో 666 కి.మీ మాత్రమే పూర్తియ్యాయని, ఇవి మొత్తం పనుల్లో 26 శాతం మాత్రమేనని అధికారులు వివరించారు. మొదటి ఫేజ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చెయ్యాలని సీఎం అధికారులకు సూచించారు. ఇకపోతే రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్ల పరిస్థితిపైనా సీఎం ఆరా తీశారు. గ్రామాల్లో మొత్తం 68 వేల కి.మీ ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయని… వీటిలో 55 వేల కి.మీ సీసీ రోడ్లు ఉన్నాయని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 25 వేల కి.మీ మేర సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని… వైసీపీ ప్రభుత్వంలో కేవలం 6 వేల కి.మీ మేర మాత్రమే పనులు జరిగాయన్నారు. మిగిలిన సీసీ రోడ్ల పనులను కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులు, నరేగా పనుల్లో భాగంగా పూర్తి చెయ్యాలని సీఎం సూచించారు. కేంద్రం తాజాగా మరో రూ.275 కోట్లు పంచాయతీలకు విడుదల చేసిందని.. వాటి ద్వారా కూడా పనులు చేపట్టాలని సీఎం సూచించారు. నాబార్డు నిధుల ద్వారా పంచాయతీ రోడ్లు నిర్మించాలని సీఎం సూచించారు. గ్రామాల నుంచి స్టేట్ హైవేలకు, నేషనల్ హైవేలకు కనెక్టవిటీ పెంచే అంశంపైనా దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.