- భారతదేశంలోనే మోడల్ టౌన్‌షిప్‌గా నిర్మాణం చేపడతాం
- ఏపీలో సింగపూర్ తరహా గ్లోబల్ మైస్ ఏర్పాటుకు చర్యలు
- ఆగ్నేయ, తూర్పు ఆసియాలకు సులభతర వాణిజ్యంపై దృష్టి
- ఆర్‌టీజీఎస్‌లో సింగపూర్ అనుభవాన్ని ఉపయోగించుకుంటాం
- జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ భేటీలో మంత్రి లోకేష్
సింగపూర్ (చైతన్య రథం): సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్… ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా, భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్ షిప్‌గా నిలుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుండి అవసరమైన మద్దతు తీసుకోవడంతో పాటు విధివిధానాల ఖరారును వేగవంతంగా చేయాల్సిందిగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం… సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సింగపూర్‌లో సమావేశమైంది. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆరఎఫ్‌పి (ప్రతిపాదనల కోసం అభ్యర్థన)పై ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేశాం. అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉంది. దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుంది” అన్నారు.
“ఆంధ్రప్రదేశ్ నుంచి… సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించండి. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గ్లోబల్ వీI్పుజు గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటిది ఏర్పాటుచేసేందుకు సింగపూర్ సన్‌టెక్ సిటీని అధ్యయనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఇకముందు కూడా ఉపయోగించుకుంటాం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టిన, పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తా”మని లోకేష్ అన్నారు.
“మన రెండు ప్రభుత్వాల నడుమ ఇప్పుడు పటిష్టంగా భాగస్వామ్యం ఏర్పడింది. ఎంవోయులోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతినెలా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆరుగురు మంత్రులు రెండు వారాల క్రితం సింగపూర్ -ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ (సేజ్) కార్యక్రమంలో భాగంగా వారంరోజులపాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఏపీకిచెందిన 37మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారి అనుభవాన్ని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను మా విద్యా వ్యవస్థలో పొందుపరుస్తాం. గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలపై వర్కింగ్ గ్రూప్ విస్తృతంగా పనిచేసింది. ఇప్పుడు ఆ పటిష్టమైన పునాదిపై మరింత ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది” అని మంత్రి లోకేష్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్, అమరావతి ఎకనామిక్ రీజియన్, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్/ రియల్ టైమ్ గవర్నెన్స్‌పై గత నవంబర్‌లో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఎంవోయు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేశారు. జెఐఎస్‌సీ ఆమోదించిన పనులను ముందుకు నడిపించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వీటితోపాటు గతంలో పెండింగ్‌లో ఉన్న అంశాల పురోగతిపై తాజా సమాచారం, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై సింగపూర్‌లో తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమలు, విదేశాంగ మంత్రి గాన్ సియో హువాంగ్, సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టే లియాన్ చూ, ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ సౌత్ ఆసియా ఎకనమిక్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆడ్రీ టాన్, సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆసియా డిప్యూటీ డైరెక్టర్ లిమ్ చీ కియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జీన్ యీ, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్ సీనియర్ మేనేజర్ (మిడిల్ ఈస్ట్, నార్త్ ఆసియా) నిషా శారద, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, ఎస్.జోషి, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారులు దత్తి సురేంద్ర, అనంతశంకర్, పీయూష్‌కుమార్, కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.













