- పవర్’ స్టార్ అంటూ అభిమానుల కేరింతలు
అమరావతి (చైతన్య రథం): జగన్.. గుర్తుపెట్టుకో. నిన్ను అథ:పాతాళానికి తొక్కకపోతే నాపేరు పవన్ కళ్యాణ్ కాదు. నా పార్టీ జనసేన కాదు. ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్ కడుపుమండి చెప్పిన రియలిస్టిక్ డైలాగ్ ఇది. చేసిన సవాల్ నిలబెట్టుకున్నాడు. జగన్ పార్టీ వైసీపీని చంద్రబాబు, నరేంద్రమోదీ సాయంతో అథ:పాతాళానికి తొక్కేశాడు. పవన్ ఓ పొలిటికల్ బ్రోకర్, పొలిటికల్ జోకర్ అంటూ సెటైర్లు వేసిన వైసీపీ మూకల నోళ్లు మూయించాడు. వంగా గీతకు ఆయువుపట్టులాంటి పిఠాపురం సెగ్మెంట్ నుంచి పవన్ గెలిచే అవకాశమే లేదంటూ పిచ్చికూతలు కూసినవాళ్ల పళ్లు రాలేలా.. 65వేల పైచిలుకు భారీ మెజార్టీతో పవన్ కల్యాణ్ విజయం సాధించి వర్తమాన ఎన్నికలకు హీరోగా నిలిచాడు.
పొలిటికల్ ‘పవర్ స్టార్..
‘‘కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో గానీ, రావడం మాత్రం పక్కా’’ పవన్ కల్యాణ్ పలికిన సంభాషణే ఇది. ఆయన రాజకీయాల్లో త్వరగానే వచ్చారు. కానీ, అధ్యక్షా అని పిలవడానికి పదేళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యమేంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు.. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ప్రతిఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ, పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగు పెట్టిన పవన్.. ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేయబోతున్నారు. పదేళ్లు పదవి, అధికారంవంటివి లేకుండా ‘అజ్ఞాతవాసం’లాంటి జీవితం సాగించిన పవన్ ఇప్పుడు.. అధ్యక్షా అంటూ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.
విలాస జీవితం వదిలి…
సూట్ కేసులతో డబ్బులు పట్టుకొని ఇంటిముందు నిలబడే నిర్మాతలు.. విలాసవంతమైన జీవితం.. ఫారిన్ ట్రిప్పులు.. ఇవేవీ పవన్‌కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్లినా, ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన. ‘తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి’. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడమంటే పులి మీద స్వారీ. దాన్ని చాలా దగ్గరినుంచి చూశాడు. తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏ జరుగుతుందో కూడా తెలుసు. అందుకే అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశకు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతో తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపాడు. ఎన్డీయేతో మైత్రీని కొనసాగించారు.
పదేళ్లు మొక్కవోని దీక్షతో..
సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడికైనా ఒకవిధమైన నిర్లిప్తత ఆవరిస్తుంది. కానీ, జనసైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ సన్నద్ధం చేశారు. ప్రజాభీష్టం మేరకు భారీ మెజార్టీతో గెలిచిన వైకాపాపై వెంటనే దుమ్మెత్తిపోయడం సరికాదన్న రాజకీయ విజ్ఞతను ప్రదర్శిస్తూ దాదాపు ఏడాది పాటు పెద్దగా విమర్శల జోలికి పోలేదు. నెమ్మదిగా అధికారం మత్తు తలకెక్కిన వైకాపా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. ప్రశ్నించిన జన సైనికులపై దాడులకు తెగబడిరది. దీంతో జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైకాపా ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలుపెట్టారు. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ చేశారు. ఆయన సినిమాలకు ఏపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీఇన్నీ కావు. వాటిని కాచుకుని నిలబడ్డారు. సామాన్యుల్లో అసామాన్యుడిగా దూసుకెళ్లారు. ‘సీఎం.. సీఎం’ అని అభిమానులంటే ‘ముందు నన్ను గెలిపించండి..’ అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కల్యాణ్. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే.. తన పార్టీ ఫండుతో ఆ కుటుంబాలకు ఆర్థికసాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో.. రెండుచోట్ల పోటీ చేస్తే రెండూ ఓడిపోయాడు పవన్ కల్యాణ్. గెలిచిన ఒకే ఒక్క సీటూ వైసీపీ పక్షాన చేరింది. ఇక జనసేన ఖేల్ ఖతం అన్నారంతా. పవన్‌ని ఎద్దేవా చేయని వైసీపీ నాయకుడు లేడు. జగన్ అయితే పవన్ కల్యాణ్ పేరుని ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదు. ఒక్కసీటు కూడా లేకుండా, కనీసం అధినేత గెలవకుండా ఐదేళ్లపాటు రాజకీయాల్ని నడిపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2024 ఎన్నికల వరకూ ఈ పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అనే అనుమానాల మధ్య ఐదేళ్ల పాటు నిలబెట్టాడు. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. జగన్విముక్త రాష్ట్రం నెలకొల్పాలన్న కసితో.. జగన్ వ్యతిరేక రాజకీయ పక్షాలను ఒకతాటిపైకి తెచ్చ సారథ్యం వహించాడు. మైత్రికి చంద్రబాబును ఒప్పించి.. బీజేపీని కిందికి దించిన జనసేనాని.. పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాలు కైవసం చేసుకున్నాడు. వైసీపీని మట్టికరిపించాడు. రియల్ గేమ్ ఛేంజర్ అవతారమెత్తిన జనసేన పార్టీ ప్రస్థానం.. అనిర్వచనీయం, అనితర సాధ్యం. ‘గుర్తు పెట్టుకో జగన్.. నిన్నూ నీ పార్టీనీ భూస్థాపితం చేయకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు’ అని తొడగొట్టినప్పుడు పవన్‌లో ఆవేశం మాత్రమే కనిపించింది. ఓ నికార్సయిన హీరోలానే ప్రగల్భాలు పలుకుతున్నాడే అనుకొన్నారంతా. కానీ పవన్ చేసి చూపించాడు. ఇప్పుడు వైసీపీ నామరూపాలు లేకుండా పోయిందంటే, ఆ క్రెడిట్‌లో మేజర్ షేర్ పవన్ కల్యాణ్‌దే. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌నుంచి ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ క్షణం.. ‘పొత్తు’ రాజకీయాలతో టీడీపీకి బేషరతుగా మద్దతు పలికాడు పవన్.
ఈరోజు నుంచే గాలులన్నీ కూటమి వైపు మళ్లాయి. ఫలితం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో గెలవడమే కాదు. ఏకంగా 20 స్థానాల్లో తన అభ్యర్థుల్ని గెలిపించాడు. టీడీపీ విజయంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా తన పాత్ర పోషించాడు. భాజాపాని పొత్తులోకి లాక్కురావడం, భాజాపా కోసం కొన్ని సీట్లు త్యాగం చేయడం ఇవన్నీ పవన్ నిష్పక్షపాత రాజకీయాలకు అద్దంపట్టాయి. కేవలం 21 సీట్లేనా అది ఎద్దేవా చేసినవాళ్లకు పవన్ ఇప్పుడు సమాధానం చెప్పాడు. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేశామా? లేదా? అనేదే ముఖ్యం అని చెప్పిన పవన్.. ఇప్పుడు తన త్యాగాలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి పవన్ చేసిన త్యాగాలు ఇప్పుడు సత్ఫలితాలిచ్చాయి. తాను గెలవడమే కాదు. టీడీపీనీ, బీజేపీని గెలిపించడానికి పవన్ తీసుకొన్న నిర్ణయాలు ఇతోధికంగా సాయం చేశాయి. వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంలో పవన్ తీసుకొన్న నిర్ణయాలు బలంగా పనిచేశాయి. ఇప్పుడు అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ పవన్‌వే. ఇవి చాలవూ.. పవన్‌ని గేమ్ ఛేంజర్ అని చెప్పడానికి.పవన్‌ని అభిమానులంతా ‘పవర్ స్టార్’ అని పిలుస్తారు. ఆ పిలుపు పవన్‌కు నచ్చదు. పవర్‌లోకి వచ్చినప్పుడు అలా పిలవండి అని తరచూ చెప్పేవాడు పవన్. ఇప్పుడు పవన్ అనే పేరు ముందు ‘పవర్ స్టార్’ అనే అక్షరాలు చేరిపోవడానికి ముచ్చటపడతాయి. ఆ బిరుదుకు పవన్ అక్షరాలా అర్హుడు.