- పేదలకు న్యాయం చేయాలన్నదే సీఎం చంద్రబాబు తపన
- 22ఏ, ఫ్రీహోల్డ్ భూములపై ప్రత్యేక డ్రైవ్
- జిల్లాల్లో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ కమిటీల ఏర్పాటు
- భూ సమస్యలపైన కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి
- కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ప్రైవేటు భూములేవీ కూడా 22 ఏ లో ఉండకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజలకు భూమి అనేది సెంటిమెంటుతో కూడుకున్న వ్యవహారమని, పేదలకైతే అది ఒక భరోసా అని, క్షేత్రస్థాయిలో ప్రజలు తమ భూములకు సంబంధించి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల భూ వివాదాల పరిష్కారానికి జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. సచివాలయంలో మంగళవారం ప్రారంభమైన 3వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి అనగాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు మేలు చేయాలనే దృఢసంకల్పంతో పనిచేస్తున్నారని, జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లో మూడు సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సామన్యులకు, పేదలకు ఎటువంటి నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో భూ సంబంధ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారని, క్షేత్రస్థాయిలో పేదలకు వారి భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల కాలంలో రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేపట్టామన్నారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు, ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టాన్ని, ఆర్‌ఓఆర్ చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు. ఆర్‌ఓఆర్ చట్టాన్ని సవరించి అప్పీల్ అధికారాన్ని డీఆర్వోల నుండి ఆర్డీవోలకు మార్చాం.. దీంతో భూ యజమానులకు త్వరగా వారి అప్పీళ్లు పరిష్కరామవుతాయని తెలిపారు. ప్రైవేటు భూములు ఎట్టి పరిస్థితిలోనూ 22ఏ వివాదాల్లో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. చాలా మందికి తమ భూమి ఎందుకు 22ఏ వివాదంలో ఉందో కూడా తెలీదన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా జిల్లాల్లో భూ వివాదాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నాన్నారు. రెవెన్యూ శాఖలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, అర్జీలను అన్నింటినీ పరిష్కరిస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను కూడా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.700 కోట్లు దుర్వినియోగం చేసి సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకుంటే ఇప్పుడు వాటిని తొలగిస్తున్నామన్న్నారు. రైతులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టాదారు పాసుపుస్తకాలను అత్యంత పారదర్శక విధానంతో అందిస్తున్నామని మంత్రి అనగాని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్
రాష్ట్రంలో అభ్యంతరాలు లేని స్థలాల్లో ఉంటున్న పేదలకు ఆ భూమిని క్రమబద్దీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని, 22ఏ భూముల వివాదాల పరిష్కారంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటి కోసం ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామని, దీనికి జిల్లా కలెక్టర్లు సహకారం అందివ్వాలని కోరారు. గత ప్రభుత్వం నిర్వహించిన రీ సర్వే తప్పుల తడకగా సాగింది. రీ సర్వేపైన గ్రామ సభలు పెట్టాం. ఆ తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. వీటితోపాటు పీజీఆర్‌ఎస్ లోనూ గ్రీవెన్స్ వస్తున్నాయి. వీటిల్లో 90 శాతం పరిష్కరించామని, వీటిని క్వాలిటీ డిస్పోజల్ చేయాలని ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతుంటారు. కలెక్టర్లు ఆ దిశగా పని చేయాలన్నారు. రీ సర్వేను కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేస్తోంది. రోజుకు 20 ఎకరాల్లోనే చేస్తున్నాం. కొత్తగా పాసుపుస్తకం జారీ చేయడంతో పాటు, దానికి జియోట్యాగింగ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో పలు చోట్ల భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయని, ఇలాంటి కేసులు కూడా త్వరితగతిన పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ప్లీడర్లతో సమావేశమై ఆ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.
ప్రజలు తమ భూముల సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారుల వద్దకు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని, ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పగలిగేలా ఒక స్పీకింగ్ నోట్ ఇచ్చే పరిస్థితికి చేరుకోవాలని సూచించారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సిటిజన్ ఫ్రెండ్లీగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారని, అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఫ్రీ హోల్డ్ భూములు, ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకోవాలన్నారు. వివాదాలుంటే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదముంటుందన్నారు. దీనికోసం జిల్లాల్లో ప్రత్యేకించి ఒక రియల్ ఎస్టేట్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా, రెవెన్యూ, మున్సిపాల్టీ, పంచాయతీ, పట్టణాభివృద్ధి సంస్థలు, బ్యాంకర్లు అందరూ ఈ కమిటీలో సభ్యులుగా ఉండేలా చూడాలన్నారు. ఈ కమిటీ ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒకసారి సమావేశమై ఆయా జిల్లాల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి ఉన్న వివాదాలు పరిష్కరించాలని కోరారు.