.పన్నుమీద పన్నులతో సామాన్యులపై భారం
.జగన్‌రెడ్డిని సాగనంపడమే ఏకైక మార్గం
.విషపూరిత మద్యంతో అమాయకుల బలి
.రూ.100 ఇచ్చి వంద కొట్టేస్తున్న జగన్ రెడ్డి
.బాదుడే బాదుడులో యువనేత నారా లోకేష్
.చేనేత కార్మికులకు బాసటగా నిలిచిన యువనేత
.పెరిగిన ధరలతో బతుకు భారమైంది…
.ప్రభుత్వం నుంచి సహాయం శూన్యం
.లోకేష్ ఎదుట చేనేత కార్మికుల ఆవేదన
మంగళగిరి: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తే జగరోనా వైరస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో లోకేష్ పర్యటించారు. ఆత్మకూరు గ్రామంలో… శ్రీ భద్రావతీ సమేత భావన ఋషి స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో లోకేష్ పాల్గొన్నారు. గ్రామంలో కరపత్రాలు పంచుతూ వైసిపి పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరించిన యువనేత వారు ఎదుర్కుంటున్న సమస్యల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారని అన్నారు. పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలని అన్నారు. మద్యపాన నిషేదం తర్వాతే ఓట్లు అడుగుతా అన్న జగన్ ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. విషపూరితమైన మద్యాన్ని అమ్ముతూ ప్రజల్ని బలితీసుకుంటున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలంటూ రూ.10 కుడి చేత్తో ఇచ్చి బాదుడే బాదుడు పేరుతో ఎడమ చేత్తో రూ.100 కొట్టేస్తున్నారని అన్నారు. ఉచితంగా దొరికే ఇసుకను బంగారం చేసి లక్షలాది మందికి ఉపాధి లేకుండా చేశారని తెలిపారు. ఇసుకను బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై తరలించి వందల కోట్లు దోచుకుంటున్నారు. దోచుకున్న సొమ్మంతా నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కి వెళ్తోందని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల పై ప్రజలు పడుతున్న బాధలు తలుచుకుంటేనే బాధేస్తోందన్నారు. ప్రతి ఏడాది సిఎం రివ్యూల్లో రోడ్లను బాగు చెయ్యాలనే ఉత్తర్వులు ఇవ్వడం తప్ప ఒక్క చోట కూడా కొత్తగా రోడ్డు వెయ్యడం లేదన్నారు. అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారు. కరెంట్ బిల్లు ఎక్కువచ్చిందని పెన్షన్‌తో సహా అన్ని పథకాలు కట్ చేస్తున్నారని అన్నారు. పథకాలు ఇస్తున్నామన్న సాకుతో ముక్కు పిండి జనం నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు.
చేనేతల కార్మికులకు అండగా లోకేష్
ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షేడ్‌ని నారా లోకేష్ పరిశీలించారు. చేనేత డైయింగ్ కార్మికులను వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా మాకు పనికితగ్గ ఆదాయం లేదు… మా కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువని వారు వాపోయారు. నూలుకి రంగులు అద్దె ప్రక్రియ ఎంతో కష్టంతో కూడుకున్నదని, అయినా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు, సహాయం అందడం లేదని వాపోయారు. డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నా మాకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని జీవిస్తున్నామని తెలిపారు. వర్షా కాలం పని ఎక్కువ ఆదాయం తక్కువ ఉంటుంది అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. చేనేత డైయింగ్ కార్మికులకు లోకేష్ గ్లవుజులు, సేఫ్టీ షూస్ అందజేశారు.
చేనేతల సమస్యలపై అవగాహన ఉంది
రాష్ట్రంలో చేనేత రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కుంటోంది… వారి సమస్యలపై తమకు అవగాహన ఉందని లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. చేనేత రంగాన్ని నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చెయ్యాలన్నారు. నూలుకి రంగులు అద్దె ప్రక్రియ మొదలుకొని అన్ని ప్రక్రియల్లో ఉన్న కార్మికుల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించి పరిష్కరించాలని తెలిపారు. పనిచేసుకోవడనికి మెరుగైన వసతులు కల్పించాలి…చేనేత డైయింగ్ కార్మికులను ఆదుకోవాలని లోకేష్ ప్రభుత్వానికి విజ్జప్తిచేశారు.