.వర్మ కమిషన్ సిఫారసులను అమలుచేయండి
.గోరంట్ల మాధవ్ ఎంపి పదవికి అనర్హుడు
.ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయండి
.మూడేళ్లుగా ఎపిలో మహిళలకు భద్రత కరువు
.రేపిస్టులను రక్షిస్తున్న ఎపి ప్రభుత్వం
.మహిళలపట్ల వ్యవహరించాల్సిన తీరుపై.. ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వండి
.ఎన్నికల్లో పోటీపై అనర్హత వేటు వేయండి
.అఖిలపక్ష మహిళా నేతల డిమాండ్
.నేడు రాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్‌తో బేటీ
డిల్లీ : సభ్య సమాజం తలదించుకునే విధంగా నగ్నవీడియోతో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన ఎంపి మాధవ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిగ్నిటీ ఫర్ ఉమెన్ జాయింట్ యాక్షన్ కమిటీ దేశ రాజధాని డిల్లీలో గళమెత్తింది. గతమూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లలనుంచి వృద్ధులవరకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేసిన మహిళా జెఎసి నేతలు..మాధవ్‌పై చర్య తీసుకొని అత్యున్నత చట్టసభ గౌరవం కాపాడాలని కోరుతున్నారు. మహిళలకు రక్షణా నిలవాల్సిన ప్రభుత్వం రేపిస్టులకు కొమ్ముకాస్తూ కంచే చేనుమేసిన చందంగా వ్యవహరిస్తోందని జెఎసి సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. వార్డు మెంబర్ నుంచి ఎంపి వరకు మహిళలపట్ల వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణాతరగతులు నిర్వహించాలని, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని భవిష్యత్ ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటువేయాలని వారు డిమాండ్ చేశారు. మాధవ్ వ్యవహారంపై మహిళా జెఎసి ప్రతినిధులు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ, మహిళా ఎంపిలను కలవాలని నిర్ణయించారు. డిగ్నిటీ ఫర్ ఉమెన్ జెఎసికి వాసవ్య మహిళామండలి అధ్యక్షురాలు డాక్టర్ చెన్నుపాటి కీర్తి నేతృత్వం వహిస్తుండగా, కో కన్వీనర్లుగా తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎపి కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, ఐద్వా ప్రతినిధి ఎస్ పుణ్యవతి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగర జ్యోత్స్న, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి నాగ కళ్యాణి, టిడిపి గుంటూరు పార్లమెంటు తెలుగుమహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, ఎపి కురుబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ ఎస్. సవితలతో కూడిన జెఎసీ బృందం డిల్లీ చేరింది.
జస్టిస్ వర్మ కమిషన్ సిఫారసులను అమలుచేయండి
` చెన్నుపాటి కీర్తి, కన్వీనర్, డిగ్నిటీ ఫర్ ఉమెన్
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్రం వచ్చాక 75సంవత్సరాల తర్వాత కూడా డిగ్నీటీ ఆఫ్ ఉమెన్ కు భంగం కలుగుతున్న నేపథ్యంలో ఎవరో ఒకరు గళం విప్పాలి. మహిళల విషయంలో రాజకీయనేతలు పాఠించాల్సిన ప్రవర్తనా నియమావళిపై జస్టిస్ వర్మ కమిషన్ రిఫామ్స్ నివేదికలో పొందుపర్చారు. చట్టసభకు ఎన్నిక కాబడిన ఎంపి లేదా ఇతర సభ్యుడు రేప్, లైంగిక వేధింపులు, అవమానాలకు గురిచేసినట్లు నిరూపణ అయితే స్వచ్చందంగా రాజీనామా చేయాలని ఆ నివేదికలో సూచించారు. లోక్ సభ స్పీకర్ చొరవ తీసుకుని జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్టును అమలుచేయాలి. స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు మహిళలతో వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణ ఇవ్వాల్సిన తీరుపై మేం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కోరతాం. వెంటనే శిక్షణ ప్రారంభించాల్సిందిగా విజ్జప్తిచేస్తాం.
న్యూడిస్టు ఎంపిని రక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
` సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు
ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా మహిళలపై వేధింపులు అత్యాచారాలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అసెంబ్లీలో, పార్లమెంటులో మహిళలనుఅవమానించేలా వ్యవహ రిస్తున్నారు. ఎంపి మాధవ్ మహిళల పరువును వీధుల్లో పెట్టారు. మహిళా హోంమంత్రి, మంత్రులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఎంపి నగ్నవీడియో సోషల్ మీడియాలో హల్ సెల్ చేస్తుంటే అతడ్న రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత మహిళకు రక్షణ కల్పించాల్సింది పోయి ఫిర్యాదు లేదంటూ అనంతపురం ఎస్పీ, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీడియా ముందుకు వచ్చి సంబంధిత ఎంపికి వత్తాసు పలుకుతున్నారు.
కంచే చేను మేసిన చందంగా మాధవ్‌గా ప్రవర్తన
` ఎస్. పుణ్యవతి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపట్ల భారత రాజ్యాంగం హక్కులను ఏమాత్రం గుర్తిస్తున్నారో తాజా పరిణామాలు బట్టబయలు చేస్తున్నాయి. నిజంగా రాష్ట్రప్రభుత్వం స్త్రీల హక్కులను గౌరవించాలనే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎంపి మాధవ్‌పై చర్యలు తీసుకోవాలి. జస్టిస్ వర్మ కమిషన్ సిఫారసుల ప్రకారం మహిళల వేధింపులకు సంబంధించి ఒక సంఘటన వెలుగుచూసినపుడు పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలి. ఒకవేళ వారు స్పందించకపోతే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నిస్తున్నాం. పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఎంపిగా ఉన్న వ్యక్తే ఆరోపణలు ఎదుర్కోవడం కంచే చేనుమేయడం కాదా? 5 నుంచి 8 సంవత్సరాల పసిపిల్లలపై కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మేం గణాంకాలను పరిశీలిస్తే ఈ మూడేళ్లలో మహిళలపై నేరాలు 20శాతం పైగా పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో పాలకులు ఏవిధంగా తలెత్తుకు తిరుగుతారు? ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ఈ అవాంఛనీయ పరిణామాలపై విచారణ జరపాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను కోరతాం. స్త్రీల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. మహిళలపై వేధింపులకు పాల్పడే పంచాయితీ సభ్యుడి నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు ఎవరిపైనైనా అనర్హత వేటువేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఎపిలో అధికారపక్షం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై ఎపి ప్రభుత్వానికి, డీజీపీకి, గవర్నర్ కు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. అందువల్లే మేం రాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్ ను కలిసేందుకు డిల్లీ వచ్చాం. ఎపిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు కూడా గళం విప్పాలి.
కులాలమధ్య ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చిచ్చు
` ఎస్.సవిత, కురబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్
పార్లమెంటు సభ్యుడు మాధవ్ వీడియో బయటకు వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫేక్ వీడియో అని ప్రచారం చేయడం ఆ ఎంపిని రక్షించడానికే. ఈనెల 14వతేదీన ఎంపి మాధవ్ అనంతపురం వస్తే ఆయనను వైసిపి శ్రేణులు భారీ ర్యాలీతో తీసుకువచ్చారు. ఆయన ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా? హిందూపురానికి ఏమైనా నిధులు తెచ్చారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. కురుబలకు, మాధవ్ కేసుకు ఏ సంబంధమూ లేదు. ఎంపిపై చర్య తీసుకోవాలని కోరేందుకే డిల్లీ వచ్చాం. మాధవ్ లాంటి ఎంపిలు పార్లమెంటులో ఉంటే మహిళా లోకానికే అవమానకరం. పార్లమెంటు స్పీకర్ తక్షణం ఆయనను బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మహిళాలోకం సిగ్గుతో తలదించుకుంటోంది
` తిరునగరి జ్యోత్స్న, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి
ఎపిలో జరుగుతున్న పరిణామాలపై యావత్ మహిళాలోకం సిగ్గుపడుతోంది. మాధవ్ వీడియో బయటకు వచ్చి పదిరోజులైంది. సంబంధిత వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని మహిళా హోంమంత్రి వనిత, సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి రోజా వంటి వారంతా చెప్పారు. మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించడానికి ఏర్పడిన వేదికగా మేం అడుగుతున్నాం, ఆ వీడియో ఏ ల్యాబ్ కు పంపారో చెప్పాలి. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బయటకు వచ్చి ఆ వీడియోపై ఎక్లిప్స్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ఫేక్ అని అంటున్నారు. ఎక్లిప్స్ నివేదికను నిగ్గుతేల్చడంలో చూపిన చొరవ మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడంలో ఎందుకు తీసుకోవడం లేదు? జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ లు తక్షణమే స్పందించి సంబంధిత ఎంపికి సమన్లు జారీచేయాలి. ఆ పని ఎందుకు చేయలేదు? లోక్ సభ స్పీకర్ గా సోమనాథ్ చటర్జీ ఉన్న సమయంలో ఆరోపణలు వచ్చిన అయిదుగురు ఎంపిలను అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుత స్పీకర్ కూడా స్పందించి మాధవ్ ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.
మాధవ్ చర్యతో మహిళల్లో అభద్రతాభావం
` పి.రాణి, రాష్ట్ర కార్యదర్శి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు).
ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టలేక పోతోంది. మహిళల భద్రత విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎపిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అభద్రతా భావం నెలకొంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అనేకమార్లు ఆందోళనలు చేశాం.. న్యాయం జరగలేదు. అందుకే డిల్లీ దాకా వచ్చాం. రాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్ తోపాటు మహిళా ఎంపిలకు విజ్జాపన పత్రాలు అందజేస్తాం. ఎపి పోలీసులు మాధవ్ అశ్లీల వీడియోపై సుమోటోగా కేసు నమోదుచేయాలి.