- ఇంట్లో ఉన్నా రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణలేదు
- ఉన్మాదుల చర్యలకు ప్రభుత్వ అలసత్వమే కారణం
- తప్పుడు కేసులపై ఉన్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదు
- నెల్లూరు బాలిక ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండ లంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు అత్యాచారానికి ప్రయత్నించి..ఆమె ప్రతి ఘటించటంతో నోట్లో, ముఖం మీద యాసిడ్ పోసి.. ఆపై గొంతు కోసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధి నేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్నా ఏపీలో ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేదని ఇంకోసారి రుజువైంది. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలుచేస్తే ఇటు వంటి నేరాలు పునరావృతం కావు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో నేరాల రేటు పెరిగిందని జాతీయ గణాంకాలు మొన్ననే చెప్పాయి. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ నేరాల నియంత్రణకు చిత్తశుద్ధితో పని చేయక పోవడంతో నేరగాళ్ళ విచ్చలవిడితనం పెరిగిపోయింది. నేరం చేసిన వైసీపీ రౌడీలను వెనకేసుకు రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి పైనా అక్రమకేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు లేదు? బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాలికకు మెరుగైన వైద్యం అందించాలి. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి విజ్జప్తిచేశారు.