ఎన్నికలలో రాజకీయ పార్టీల గెలుపోటములు సహజం. అయితే రానున్న ఎన్నికలలో అధికార పార్టీ ఓటమితో పాటు ఆ పార్టీ పునాదులే కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రబలినప్పుడు మార్పు రావటం సహజం. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ప్రజలలో వచ్చింది మార్పు కాదు, తిరుగుబాటు అన్న విషయం స్పష్టమవుతోంది. మార్పు అనేది కొన్ని వర్గాలకే పరిమితం అవుతుంది. ఎన్నికల వ్యూహాలతో మార్పు ను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. అయితే నిర్బంధాలు, అణచివేతలు వంటి విధానాలు తిరుగుబాటు కు కారణమవుతాయి. ఈ తిరుగుబాటు కులాలు, మతాలు, వర్గాలు, అసంతృప్తులు, అసమ్మతులు, అన్నింటికీ అతీతంగా వుంటుంది. ప్రభుత్వాన్ని గద్దె దింపటం ఒక్కటే తిరుగుబాటు లక్ష్యంగా వుంటుంది. మార్పు సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తిరిగి అధికార పార్టీ కే లబ్దిపొందే అవకాశాలుంటాయి. కానీ తిరుగుబాటు లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది పార్టీలకు అతీతంగా ఏకీకృతం అవుతుంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఈ విధమైన తిరుగుబాటు సంకేతాలు గోచరిస్తున్నాయి. లక్షల కోట్లు అప్పుల భారం మోపుతున్నప్పటికి, మచ్చుకి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం లేకపోవటం, అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, విద్యుత్, బస్ చార్జీలు, పెట్రోలు, ధరలు వంటివి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం జీవనాన్ని దుర్భరం చేశాయి. దీనికి తోడు సంక్షేమ పథకాల డొల్లతనం ఇప్పుడిప్పుడే ప్రజలకు అవగతం అవుతోంది. బిసి,ఎస్సీ,ఎస్టీ వర్గాలకు టిడిపి హయాంలో వివిధ కార్పొరేషన్ ల ద్వారా అందిన ఆర్థిక చేయూతకు, వైసీపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. నిధులు, విధులు లేని కార్పొరేషన్ ల పేరుతో ప్రభుత్వం తమను మభ్య పెడుతున్నదన్న వాస్తవాన్ని వివిధ వర్గాల ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన లేకపోవటంతో పాటు గంజాయి వంటి మాదకద్రవ్యాలు కు యువత బానిసలు అవుతుండటం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. వారి భవిష్యత్ అంధకారం అయిందని వారంతా లోలోన మధనపడుతున్నారు.
దేశంలో ఎక్కడా. లేని విధంగా రైతులపై తలసరి అప్పుల భారంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. వీటన్నింటికీ తోడు ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ నాయకుల అరాచకాలతో సామాన్య ప్రజానీకం నిత్యనరకం అనుభవిస్తోంది. ప్రశ్నించే వారిపై కేసుకు, దాడులు, దౌర్జన్యాలు వంటి ఘటనలు అధికార పార్టీ నియంతృత్వ, నిరంకుశ వైఖరికి దర్పణం పడుతున్నాయి. ఈ విధమైన పరిణామాల నేపథ్యంలోనే ప్రజల్లో రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా తిరుగుబాటు తత్వం తలెత్తింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న కసి, పట్టుదల అన్నివర్గాల ప్రజలలో కానవస్తోంది.
అదే సమయంలో అధికార పార్టీలోనూ అసమ్మతి కుంపట్లు రాజుకున్నాయి. నాలుగేళ్ల పాటు ఓర్పు, సహనంతో అన్నింటినీ భరించిన కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడిప్పుడే గళం విప్పసాగారు. ప్రజలలో వచ్చిన తిరుగుబాటు కు అనుగుణంగా పలువురు వైసీపీ సభ్యులు సొంత పార్టీపైనే ధ్వజమెత్తసాగారు. వైసీపీ కి పెట్టని కోటలా వున్న నెల్లూరు జిల్లాలోనే ఆ పార్టీ పునాదులు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ జిల్లాలో ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యే లు సొంతపార్టీ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారంతా అధికార పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వారే కావటం విశేషం. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మరో దళిత మహిళా ఎమ్మెల్యే వైసీపీ పై రోజుకొక అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యే లను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యే లు ఎవరూ సస్పెన్షన్ ను ఖాతరు చేస్తున్న సూచనలు కానరావడం లేదు.మరికొంత ఎమ్మెల్యే లు వారి బాటనే పయనించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఒకపక్క ప్రజల్లో, మరోపక్క సొంత పార్టీ ఎమ్మెల్యే లలో తిరుగుబాటు తత్వం ప్రబలుతుండటం అధికార పార్టీని ఆత్మరక్షణలో పడవేసింది. ఈ పరిస్థితి మొత్తం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా మారుతుంది. అంతేగాక టిడిపి అధికారంలోకి రావలసిన అనివార్య స్థితిని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా తటస్థ వర్గాలు గుర్తించాయి. రాష్ట్ర, భావితరాల భవిష్యత్ పరిరక్షణకు చంద్రబాబు నాయకత్వం అవసరమన్న భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. టిడిపి అధినేత చంద్రబాబు నిర్విరామ పర్యటనల తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర లు టిడిపి విజయయాత్రకు సంకేతాలుగా నిలిచాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మరోవైపు సానుకూల ఓటు ఏకకాలం లో పెరుగుతుండటం తెలుగుదేశం పార్టీకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.అధికార పార్టీని గద్దె దింపాలన్న కసి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న పట్టుదల ఒకేసారి రాష్ట్ర ప్రజల్లో కానవస్తొంది. రానున్న ఎన్నికలలో 1983 ఎన్నికల నాటి పరిస్థితులు పునరావృతం కాగలవని అంచనా వేస్తున్నారు.