ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నామంటూ గొప్పలు చెబుతున్న జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. విశాఖను ఏపీ రాజధాని చేస్తున్నామని.. అక్కడ ఐటీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామంటున్న జగన్ సర్కార్ గాలి తీసేసింది. ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున ఉన్న విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రపంచానికి చాటింది. ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 0.2 శాతం ఉందని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. 2022 లో ఏపీ నుంచి కేవలం 926 కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని కేంద్ర మంత్రి ప్రకటించారు. భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో ఇది కేవలం 0.14 శాతమని, గత ఐదేళ్ల ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.2శాతం కంటే తక్కువగానే ఉందన్నారు. దీంతో ఏపీలో ఐటీ రంగంపై జగన్ సర్కార్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలే అని తేలిపోయింది.
ఏపీలో ఐటీ రంగ అభివృద్ధిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ గాలి మాటలే అని మరోసారి రుజువైంది. తమ హయాంలో ఏపీలో ఐటీ రంగానికి అది చేస్తున్నాం..ఇది చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవటం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఏపీ అసలు రంగును బయట పెట్టారు. ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా కేవలం 0.2 శాతం ఉందని ఆయన వెల్లడించారు. 2022 లో ఏపీ నుంచి కేవలం 926 కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని.. గత ఐదేళ్ళలో భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో కూడా ఏపీ వాటా 0.14 శాతం మించలేదని వివరించారు. దీంతో.. ఐటీ అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని అర్ధం అవుతోంది.
ఇక..ప్రపంచ దేశాల్లో ఐటీ రంగంలో తెలుగువారే ఎక్కువగా రాణిస్తున్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు కొన్ని వేల ఐటీ కంపెనీలు తెలుగు వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ఉన్నవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ.. వారి సొంత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఐటీ ఇండస్ట్రీ పూర్తిగా కుంటుపడింది. విశాఖలో ఉన్న కొద్దో గొప్పో ఐటీ సంస్థలు సైతం గత కొన్నేళ్ళలో మూత పడటమో.. పొరుగునే ఉన్న తెలంగాణకు షిప్ట్ కావటమో జరిగింది. HSBC బ్యాంక్ బీపీఓ సెంటర్ సైతం మూతపడింది. ఉన్న కొద్దిపాటి ఐటీ కంపెనీలకు సైతం ప్రభుత్వ ప్రోత్సాహం అందటం లేదు. ప్రతిభా వంతులైన ఐటీ నిపుణులు సైతం ఏపీలో కొత్త కంపెనీల స్థాపనకు వెనుకడుగు వేస్తున్నారు. ఇటు హైదరాబాద్ లేదా అటు బెంగళూరు, చెన్నై నగరాల వైపే దృష్టి సారిస్తున్నారు. దీంతో.. ఏపీలో ఐటీ రంగ ఎగుమతులు దారుణంగా పడి పోయాయి.
వాస్తవానికి.. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ అభివృద్ధికి పునాదులు వేయటానికి ప్రయత్నించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీ హంగులతో రాజధాని అమరావతిని నిర్మించటంతో పాటు.. విశాఖను ఐటీ హబ్ గా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. దేశ, విదేశాల్లోని ఐటీ కంపెనీలను, పారిశ్రామిక వేత్తలను ఏపీలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్దికి విశేష కృషి చేసిన చంద్రబాబుకు.. ఆ రంగంలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. దీంతో అనేక ప్రముఖ కంపెనీలు.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. దశల వారీగా ఏపీలో పెట్టుబడులకు ప్లాన్ చేసుకున్నాయి.
ఆనాటీ సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా కొన్ని ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను సైతం ప్రారంభించాయి. టెక్ మహీంద్రా, విప్రో, మెరాకిల్ సాఫ్ట్‌వేర్ వంటి ప్రముఖ కంపెనీలు వచ్చాయి. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ళ చంద్రబాబు హయాంలో ఏపీ నుంచి ఏకంగా సుమారు 45 బిలియన్ డాలర్ల ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. మన కరెన్సీలో వాటి విలువ 4,500 కోట్ల రూపాయలు ఉంటుంది. ఓవైపు నవ్యాంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం చేస్తూనే.. చంద్రబాబు ఐటీకి ఇచ్చిన ప్రాధాన్యం వల్ల ఆ స్థాయిలో ఎగుమతులు సాధ్యమయ్యాయి. పలు కంపెనీల్లో వేలాది మంది యువతకు సైతం మంచి ఉద్యోగ అవకాశాలు లభించాయి. కానీ.. ఆ తరువాత ప్రభుత్వం మారటం.. పాలన జగన్ రెడ్డి చేతికి వెళ్ళటంతో రాష్ట్రంలో పూర్తిగా ఐటీ రంగం దెబ్బతింది.
2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా ఏపీ నుంచి 1200 కోట్ల రూపాయలకు పైగా ఐటీ ఎగుమతులు జరిగాయి. ఆ తరువాత ఆ సంఖ్య మరింత పెరగాల్సి ఉండగా.. జగన్ రెడ్డి విధానాల వల్ల ఐటీ ఎగుమతుల విలువ 926 కోట్లకు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వమే ఈ వాస్తవాలు వెల్లడించటంతో.. జగన్ రెడ్డి సర్కార్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే.. రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.