పేదలను పైకి తీసుకురావటం నా బాధ్యత
టిడిపి హయాంలోనే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ఆర్ధిక స్వావలంబన
సైకిల్ గుర్తులో ముందుచక్రం సంక్షేమం, వెనుక చక్రం అభివృద్ధి
అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలి
టిడిపి, వైసీపీ కి వున్న తేడా ప్రజలు గమనించాలి
దాసరి సామాజిక వర్గీయులతో చందబాబు ఆత్మీయ సమావేశం
…….
వెనుకబడ్డ కులాలు ఇది మాకు చేతకాదు అని అనుకోకుండా, ఇది మనవల్ల సాధ్యం అని మనసులో అనుకోవాలి. కులంలో పేదరికం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. ఆ కులానికి అండగా ఉంటాను. పేద కులాలకు చేదోడు వాదోడుగా ఉండి ఆదుకుంటాను.అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఎస్ కోట నియోజకవర్గంలో శుక్రవారం దాసరి సామాజిక వర్గీయులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.
పేదలను పైకి తెచ్చే బాధ్యత నాది. నాకు అందరూ సహకరించాలి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జనాభాలో 50 శాతం వెనుకబడిన వర్గాలవారు ఉన్నారు. వెనుకబడిన వర్గాలవారికి భూములు లేవు. కులవృత్తులు, చేతివృత్తులపై ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి వెనుకబడిన 134 వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ గుర్తింపునిచ్చింది. వెనుకబడిన వారికి భుజం తట్టి ప్రోత్సహించింది. వెనుకబడిన వర్గాలవారిని రాజకీయపరంగా పైకి తెచ్చాం.
రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక స్వాలంబన కల్పించాం అని వివరించారు. బీసీలలో నాయకత్వాన్ని పెంచే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో మొదట 24 శాతం రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. నేనొచ్చాక 34 శాతానికి పెంచాను. వార్డు మెంబర్ మొదలుకొని మున్సిపల్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్ వరకు లక్షలాదిమంది రాజకీయంగా ఎదిగారు. వారే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగారు. జగన్ అధికారంలోకి వచ్చి 34 శాతం రిజర్వేషన్ ని 24 శాతానికి తగ్గించాడ అని విమర్శించారు. ఆరోజుల్లో చేతివృత్తులకు, కుల వృత్తులకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 330 రకాల ఆధునిక పనిముట్లను 90 శాతం సబ్సిడీతో అందించాం. కుల వృత్తులవారి ఆదాయం పెంచడానికి దోహదం చేశామని చెప్పారు. దాసరి కులస్థులు, సంచార జాతులవారు తమని తాము తక్కువగా అంచనా వేసుకోవద్దు. దాసరి కులం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపం పెట్టే కులం దాసరి కులం అని ప్రశంసించారు.
ఒకప్పుడు సంక్షేమం గురించి ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. ఎన్టీరామారావు గమనించి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తెచ్చారు.ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీరామారావు అని చంద్రబాబు చెప్పారు. 1991 వరకు భారతదేశం పేద దేశం. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణల వల్ల ప్రజలకు సంపద వచ్చింది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. నేడు వాడుతున్న సెల్ ఫోన్లు సంస్కరణల ఫలితంగానే వచ్చాయి. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల పార్టనర్ షిప్ తో ప్రతి పేదవాడిని ధనికుణ్ణి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. పేదవాడిని ధనికుణ్ణి చేసి
చూపెడతాను అని వెల్లడించారు. నేను చూపిన చొరవ వల్ల హైదరాబాద్ మహానగరమైంది. అక్కడ అందరూ సంపన్నులయ్యారు. అభివృద్ధే తెలుగుదేశం పార్టీ విశిష్టత.
ఇక్కడ మనం తెచ్చిన ట్రైబల్ యూనివర్శిటీ పోయింది. పతంజలి పారిపోయింది. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. టీడీపీకి, వైసీపీకి ఉన్న తేడాను ప్రజలు గమనించాలి. నాయకుడికి దూరదృష్టి ఉండాలి. జగన్ కు అదిలేదు. నాయకుడనేవాడు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూడాలి అన్నారు. సమాజం కోసం జన్మభూమి పిలుస్తోందని పిలుపునిచ్చాను. ఎన్ ఆర్ ఐలు స్కూల్ బిల్డింగులు, కమ్యునిటీ బిల్డింగులు, రోడ్లు వేయడం, చెరువులు తవ్వడం చేశారు అని చెప్పారు. టీడీపీ సింబల్ సైకిల్ లోని ముందు చక్రం సంక్షేమం, వెనక చక్రం అభివృద్ధి అని చంద్రబాబు పేర్కొన్నారు.
సమాజంలోని నిరుపేదలను ప్రభుత్వం గుర్తించి వారిపై ఫోకస్ పెట్టడం ప్రభుత్వ విధి. పేదవాడికి అండగా సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండడానికి కారణం ప్రజలే. ప్రజలు లేకపోతే నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదు అని చంద్రబాబు చెప్పారు. ఎస్ కోట నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ వస్తాయి. పెందుర్తి నుంచి అరకు వరకు నాలుగు లైన్ల రోడ్డు కావాలని నేను ప్రపోజల్ పెట్టాను. కొత్తవలసలో 550 ఎకరాల భూమి ఇచ్చి ట్రైబల్ యూనివర్శిటీ ప్రారంభించాం. అది పూర్తయితే పిల్లలందరూ ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. రూ.250 కోట్లతో మొదటి విడతగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టడానికి కొందరు పారిశ్రామికవేత్తలు వచ్చారు. అది ఇంప్లిమెంట్ అయితే ఇక్కడే పంట పండించవచ్చు. భూముల ధరలు పెరుగుతాయి. శృంగవరపుకోట ఒక విహార కేంద్రంగా ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉండేదన్నారు.
ఈ ప్రాంతంలో 20 వేల కోటుంబాలు దాసరులవే ఉన్నాయి. దాసరులపై దృష్టి పెట్టి ఆర్థిక సహాయం అందిస్తే, మీ పిల్లల్ని చదివిస్తే అందరికంటే ముందు మీరుండడానికి అవకాశం ఉంది. అన్ని ఆగిపోయాయి. అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని జిందాల్ కంపెనీ కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలోని షుగర్ ఫ్యాక్టరీని కూడా జగన్ పోగొట్టాడు. ఈ ప్రాంతంలోని యువత నిరాశ, నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. 30 ఏళ్లకు ముందు ప్రారంభించిన ఒక ఇండస్ట్రీ, ఒక పోర్టును ఈ ముఖ్యమంత్రి సెటిల్ మెంట్ లో రాయించుకుంటున్నాడు అని ఆరోపించారు. శృంగవరపుకోటకు మంచిరోజులు రానున్నాయి. దాసరి కులస్థులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అని చంద్రబాబు వెల్లడించారు.