- రూ.7 వేల కోట్లకు పైగా పంట నష్టం జరిగిందని అంచనా
- ఇంతవరకు సాయం ప్రకటించని జగన్ ప్రభుత్వం
- ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలన ఎప్పుడు?
- నిబంధనలు సడలించి సాయం పెంచాలంటున్న తెదేపా
అమరావతి: పొలాలను ముంచెత్తిన వాననీటిలో తేలుతున్న వరి ఓదెలు.. కోతకు వచ్చిన వరిపైరు నేలవాలి నీటమునగడంతో గల్లంతైన ఆశలు.. కుప్పలు పోసినా లోపలికి చెమ్మచేరి దెబ్బతింటున్న దాన్యం.. ఆరుగాలం కష్టపడి పండిరచిన పంట కళ్లెదుటే చేజారిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు.. కోస్తా జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు. మిచౌంగ్ పెను తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో సాధారణ, వాణిజ్య, ఉద్యాన పంటలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రూ. 7 వేల కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష తెదేపా కూడా ఇదే అంచనాతో ఉంది. ఇంత భారీ నష్టం జరిగినట్లు తెలుస్తున్నా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాత్రం ఇంత వరకు సాయం విషయమై నోరు మెదపక పోవటం విమర్శలకు తావిస్తోంది. కనీసం అవకాశమున్నమేరకైనా క్షేత్రస్థాయిలో పంటనష్టాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి తాడేపల్లిప్యాలెస్ దాటి బయటకురాలేదు.
గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో తిత్లీ, హుదూద్ తుఫాన్ల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. విపత్తు సంభవించిన వెంటనే నేనున్నానంటూ చంద్రబాబు స్పందించిన తీరును ఇప్పటికీ జనం మరిచిపోలేదు. అదే విధంగా పంట నష్టం సాయానికి అప్పుడున్న నిబంధనలు సడలించి మరీ రైతులకు ఎక్కువ మొత్తంలో సాయం అందించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు ఇచ్చిన సాయంలో కోత వేసింది. వరి పంట నష్టానికి చంద్రబాబు హెక్టారుకు రూ 20 వేలు సాయం అందిస్తే జగన్ దానిని రూ. 15 వేలకు తగ్గించాడు. ఈ సారి రైతులు పూర్తిగా నష్టపోయినందున మానవతా దృక్పథంతో వరికి హెక్టార్‌కు రూ. 30 వేలు సాయం ఇవ్వాలని, మిగిలిన పంటలకు కూడా సాయం ఇతోధికంగా పెంచి అందించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. మరి జగన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
గుంటూరు జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో వరి పంటకు తుపానుతో కోలుకోలేని దెబ్బ తగిలింది. బాపట్ల జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట మొత్తం వర్షార్పణమైంది. 3,125 ఎకరాల్లో కోసి కుప్పలు వేసిన ధాన్యంలోకి నీరు చేరి దెబ్బతింది. మరో వారం రోజుల్లో పంట కోతకు వచ్చి రూ.కోట్ల విలువైన దిగుబడులు చేతికందే తరుణంలో ముంచెత్తిన మింగ్‌చౌ తుఫాన్.. పంటతో పాటు రైతు ఆశల్నీ ఊడ్చేసింది. బాపట్ల జిల్లాలో వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో కోత కోసి పొలాల్లో వేసిన ఓదెలు వాన నీటిలో తేలియాడుతున్నాయి. వర్షం నుంచి రక్షించుకునేందుకు పట్టలు కప్పినా పైన నీరు నిలిచి ధాన్యం తడిసిపోతోంది. ధాన్యం నిల్వకు గోదాముల్లేక రైతులు కష్టాలు పడుతున్నారు.
కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి పంట వర్షానికి దెబ్బతింది. ఎకరాకు సగటున 35 బస్తాల చొప్పున దిగుబడి వస్తోంది. 76 కిలోల బస్తా ధాన్యం రూ.1,650కు కొంటున్నారు. ఈ లెక్కన పంట పూర్తిగా కోల్పోతే రెండు జిల్లాల పరిధిలో రైతులకు రూ.1732 కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నూర్పిడి చేయాల్సిన మినుము 3 వేల ఎకరాల్లో దెబ్బతింది. లేత దశలో ఉన్న శనగ పంట 10 వేల ఎకరాల్లో నీట మునిగి కుళ్లిపోతోంది. మిర్చి పంట 30,295 ఎకరాల్లో దెబ్బతింది. బాపట్ల జిల్లాలో మిర్చి 8,820, శనగ 8,000, పొగాకు 5,000, అపరాలు 2,000, అరటి 1,415, వేరుసెనగ 1,820 హెక్టార్లలో దెబ్బతిన్నాయి.
అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అరటి, బొప్పాయి తోటలన్నీ నేలవాలాయి. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేలు, కమలాపురం మండలాల్లో వరి పంట నేల వాలడంతో గింజలు మొలకెత్తాయి. అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో వరి, 12 వేల ఎకరాల్లో అరటి పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.. అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో మంగళవారం 14 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో గెడ్డలు, వాగులు పొంగి పొర్లాయి. వరి పంటంతా నేలమట్టమైంది. కోసిన పనలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. జిల్లా మొత్తంగా 4 వేల ఎకరాల్లో వరి పైరు నేలకొరిగి నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇది మరింత ఎక్కువగానే ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
కృష్ణాలో లక్షన్నర ఎకరాల్లో దెబ్బతిన్న వరి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 55 వేల టన్నుల ధాన్యం రాశులు తడిసిపోయాయి. కొన్ని మొలకలొస్తున్నాయి. లక్షన్నర ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలి నీటమునిగాయి. దాదాపు 20 వేల ఎకరాల్లో పత్తి పంట వాననీటికి నల్లబడిరది. దిగుబడి భారీగా తగ్గుతుందని రైతులు వాపోతున్నారు..
ప్రకాశంలో పొగాకు, శనగకు దెబ్బ
భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో పొగాకు, మిర్చి, వరి, శనగ పంటలు నీట మునిగాయి. అరటి తోటలు నేలకొరిగాయి. పొగాకు, పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. కోతలకు వచ్చిన వరి, మిర్చి తోటలు నేలకొరిగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం 26,430 ఎకరాల్లో పంట దెబ్బతింది.