- జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం
- క్రీడారంగమేకాక అన్ని రంగాల్లోనూ పెచ్చుమీరిన అవినీతి
- ఇన్నాళ్లూ ప్రజల జీవితాలతో ఆడుకున్నారు.. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటున్నారు
- గతంలో చంద్రబాబు ప్రోత్సాహంతో క్రీడారంగం విశ్వవ్యాప్తమైంది
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ క్రీడలకు చీడ పట్టించారని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఆడుదాం ఆంధ్ర అంటూ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర తెర వెనుక ఏదో రహస్యం దాగివుంది. ఎవర్ని ఏమార్చడానికి ఈ కొత్త ప్రయోగమో అర్థం కావడంలేదు. నాలుగున్నర సంవత్సరాలుగా గుర్తుకురాని క్రీడలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాయి. క్రీడలను ఏనాడైనా ప్రోత్సహించారా. క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ఎప్పుడైనా సహకరించారా. వాటి అభివృద్ధి అనే మాటను ఏనాడైనా కనీసం ఉచ్ఛరించారా. అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డికి ఆటలపైన ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది. క్రీడాభివృద్ధికి ఏమీ చేయకపోగా రాజకీయ మరకలు అంటించారు. రక రకాల ఆటలు ఆడటం, రకరకాల మాటలు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర’ అని వస్తే ఎవరూ నమ్మబోరని ఆలపాటి అన్నారు.
ప్రజల జీవితాలతో ఆడిన ఆటలు ముగిసి..
ఇన్నాళ్లూ ప్రజల జీవితాలతో ఆడిన ఆటలు ముగిసి.. ఆఖరున ఆటలాడడానికి ఏమీలేక ఆడుదాం ఆంధ్ర అంటున్నారు. ప్రజల జీవితాలతో ఆడిన ఆటలు చాలవా?. ఆటలను ప్రోత్సహించడానికి సమయం ఇప్పుడు దొరికిందా? సచివాలయ ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు ఎక్కడున్నాయి. ప్రతిచోట క్రీడా క్లబ్ లను పెట్టి ప్రోత్సహిస్తానని చెప్పారు ఎక్కడ? యువత, బాల బాలికలు, విద్యార్థులతో ఆటలాడుకోవాలని చూడటం మంచిదికాదు. ఏ జిల్లాలోనైనా, మండలాలలోనైనా ఏ ప్రాంతంలోనైనా క్రీడల్లో శిక్షణ కోసం కృషి చేశారా? మైదానాలను బాగు చేశారా? ఉన్న మైదానాల్లో గడ్డి పీకడానికి నిధులివ్వలేని ప్రభుత్వం ఏం ఆటలు ఆడిస్తుంది. అసలు శిక్షణ పొందిన క్రీడాకారులు ఎవరైనా ఉన్నారా. 11,162 క్రీడా క్లబ్బులకు జగన్ పేరు పెట్టుకొని రిజిస్ట్రేషన్లకి డబ్బులు లేక చేతులెత్తేశారు. రాష్ట్రంలో క్రీడా మైదానాలకు ఎక్కడా నిర్వహణ నిధులు ఇవ్వటంలేదు. ఎవర్ని ఏమార్చడానికి ఆడుదాం ఆంధ్ర అనే కొత్త ప్రయోగం. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో మరో మోసానికి తెరలేపారని ఆలపాటి విమర్శించారు.
శాప్ ను రాజకీయాలకు నిలయంగా మార్చారు
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) రకరకాల రాజకీయీలకు నిలయంగా మారింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కూడా రాజకీయమే. మద్యం కేసులో నిందితుడైన విజయసాయిరెడ్డి అల్లుడిని ఛైర్మన్ గా చేయడమేంటి? రాష్ట్ర ఒలింపిక్ కమిటీని తమ చేతుల్లో పెట్టుకొని ఆట ఆడిరచారు. క్రీడా రంగాన్ని అన్యులు కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారు. రాజకీయం కోసం ఆడుదాం ఆంధ్ర అంటున్నారని ఆలపాటి అన్నారు.
జగన్ పాలనలో అందరికీ ఇబ్బందులే. చిన్నపిల్లల అంగన్వాడీ సెంటర్లను మూసేశారు. తల్లి, పిల్లలకు పోషకాహారం అందించడంలేదు. 4,757 పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. జగన్ పుట్టినరోజునాడు పిల్లలను మోసం చేయడానికి చింతపల్లె అడవుల్లోకి వెళ్లారు. పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలా? యువతకు ఉద్యోగాలిస్తానని మోసం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ను నాశనం చేశారు. ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపేశారు. యువతను గంజాయి కి బానిసలుగా మార్చారు. జగన్ చేసినన్ని వినాశక చర్యలు ఏవరూ చేసి ఉండరు. అన్ని రకాలుగా వ్యవస్థలన్ని నిర్వీర్యం చేశారని ఆలపాటి దుయ్యబట్టారు.
టీడీపీ హయాంలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేశాం
టీడీపీ ప్రభుత్వ హయాంలో, శాప్, ఒలింపిక్ సంఘం, క్రీడా సంఘాలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బాటలు వేశాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులను తయారుచేసి, రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.
మంగళగిరిలో 24 ఎకరాల్లో 34,000 సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో 2002లో హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా జాతీయ క్రీడలు, 2003లో ఆఫ్రో ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఘనమైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ కి ఉంది.
చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉప్పల్, గచ్చిబౌలి, సరూర్ నగర్ క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ కోర్టు నిర్మాణం చేపట్టి టెన్నిస్ క్రీడకు ప్రోత్సాహం అందించారని ఆలపాటి గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రోత్సాహంతో క్రీడారంగం విశ్వవ్యాప్తమైంది
చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీ చంద్, కోనేరు హంపి, పీవీ సింధు వంటి వారు తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ పేరును విశ్వవ్యాప్తం చేశారు.
చంద్రబాబు నాయుడు పుల్లెల గోపిచంద్ అకాడమికీ హైదారాబాద్ (2003) లో 5 ఎకరాలు, అమరావతి (2017) లో 12 ఎకరాలు కేటాయించారు. కానీ నేడు జగన్ రెడ్డి క్రీడారంగాన్ని నిర్వీర్వం చేసి కేవలం ఓట్ల కోసం ఆడుదాం ఆంధ్రపేరుతో ఆడుతున్న డ్రామాను యువత గమనిస్తున్నారు. అందుకే జగన్ రెడ్డి చేతుల్లోనుంచి ఆంధ్రని కాపాడుదాం అంటూ నినదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడిరచి తగిన గుణపాఠం చెప్పేందేందుకు యువత అంతా సిద్ధంగా ఉన్నారని ఆలపాటి ఉద్ఘాటించారు.