అమరావతి: తమిళ సినీ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరమని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ మరణం ఒక్క కోలివుడ్ కే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు అన్నారు. ఇనిక్కుం ఇలామై సినిమాతో కెరీర్ ప్రారంభించిన విజయ్ కాంత్ 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అభిమానులను అలరించారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు. మిత్రుడు విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ఒక ప్రకటనలో బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.