- నిత్యావసరాల ధరలపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ
- తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని
- ఆందోళన చేసిన టీడీపీ సభ్యులు
- ఒకరోజు పాటు సస్పెండ్ చేసిన స్పీకర్
అమరావతి: నిత్యావసరాల ధరలు పెరిగి, సామా న్యులు పడుతున్న ఇబ్బందులపై చర్చిద్దామని పట్టు బట్టిన టీడీపీ సభ్యులను అసెంబ్లీనుండి సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండోరోజు మం గళవారం సభ ప్రారంభమైన వెంటనే పెరిగిన నిత్యా వసర వస్తువుల ధరలపై తెలుగుదేశం సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. గంటా శ్రీనివాసరావు రాజీ నామాను ఆమోదించినట్టు స్పీకర్ వెల్లడిరచారు. తర్వాత సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.
ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం గా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని… ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే, టీడీపీ సభ్యుల ఆందోళనను స్పీకర్ పట్టించు కోలేదు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలైంది. వైసీపీ సభ్యుడు సుధాకర్‌బాబు ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.
ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టచ్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు స్పీకర్ చైర్ వద్ద బల్లలు చరిచి తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. పోడియం, స్పీకర్ స్థానం వద్ద ఉండి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభకు కొంత సేపు టీ విరామం ఇచ్చారు.
విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమవగా..మళ్ళీ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సైకో పోవాలి… సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. పప్పులు, ఉప్పులు బాదుడే బాదుడు అంటూ మళ్ళీ పోడియం వద్దకు వెళ్లి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు.
ఈలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అబ్బయ్య చౌదరి.. ఈలలు.. బయటకు వెళ్లి వేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించిన నేపథ్యంలో స్పీకర్ వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ తీర్మానం చదువుతున్న సమయంలోనూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సస్పెండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో వెంటనే వెళ్ళాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మార్షల్స్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకెళ్లారు. ఈలలు వేసుకుంటూనే టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు.
సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు
కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బెందాళం అశోక్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఆదిరెడ్డి భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, గోలా బాలవీరాంజనేయస్వామి.