- గిరిజన పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు
- మోదీపై మాట్లాడాల్సింది బొత్స కాదు, జగన్
- జీవో నెం.3తో గిరిజనులకు ఉద్యోగాలు కల్పిస్తా
- అరకు కాఫీ బ్రాండ్‌తో మరింత విస్తరిద్దాం
- ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే బాధ్యత నాది
- కురుపాం, చీపురుపల్లి ప్రజాగళంలో చంద్రబాబు
కురుపాం, చీపురుపల్లి (చైతన్యరథం): ఓటు వేసిన గిరిజనులనే జగన్మోహన్‌రెడ్డి కాటేశాడని తెలుగుదేశం జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. తాము బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొస్తే వాటిని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ అన్నారు. మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గురువారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ‘జగన్ దళిత, గిరిజనుల ద్రోహి. ఐదేళ్లలో ఆయా వర్గాల అభ్యున్నతికి జగన్ ఏం చేశాడు’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గమైన గిరిజనుల కోసం టీడీపీ 16 పథకాలు తీసుకొస్తే, వాటినీ రద్దు చేసిన దుర్మార్గుడని దుయ్యబట్టారు. ‘ఉత్తరాంధ్ర తేదేపాకు కంచుకోట. వంద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ టీడీపీ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తాం. రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలి. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు మార్చే ఆయుధం ఓటు. కూటమి అభ్యర్థులను గెలిపించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
గిరిజన సంక్షేమం ఘనత టీడీపీదే…
టీడీపీ హయాంలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన బిడ్డలందరినీ ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి కావాలంటే అక్కడకు పంపించి చదివించాం. గిరిజనుల కోసం బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. 60 శాతం సబ్సిడీతో ట్రైకార్ రుణాలిచ్చాం. అత్యంత పేదల కోసం ‘గిరి గోరుముద్ద’ పథకం కింద బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాం. కేంద్రం మంజూరు చేసిన ‘ఏకలవ్య మోడల్ స్కూల్స్’ని ఏర్పాటు చేశాం. ‘జగజ్జీవన్ రావ్ జ్యోతి’ పథకం పెట్టి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చాం. గిరిజనుల ఆరోగ్యం కోసం మొబైల్ అంబులెన్సులు, ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేశాం. ‘గిరి నెట్’ తెచ్చాను. అల్లూరి సీతారామరాజు మ్యూజియం, రూ.500 కోట్లతో సెవెన్ డే టెక్నాలజీ తెచ్చాను. గిరిజనుల కోసం ఇన్ని తెస్తే.. గిరిజన వ్యతిరేకి జగన్ వీటన్నిటినీ రద్దు చేసి అన్యాయం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ పధకాలన్నీ పునరుద్ధరిస్తామని, జీవో నెం.3 కోసం పోరాటం చేసి స్థానిక ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకూ జగన్ అన్యాయం చేశాడని, మన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, లకు 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
కూటమి ప్రభుత్వంలో అందరికీ సంక్షేమం….
కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ సిసలైన సంక్షేమం అందుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం ప్రకటించిన మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, అందరి జీవితాల్లో వెలుగులు పూస్తాయన్నారు. సూపర్ సిక్స్ పథకాల ప్రాధాన్యతను వివరిస్తూ.. మహళలు, యువత, రైతాంగం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్ర యువతను జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశాడని, అన్ని విధాలుగా మహిళలను దగా చేశాడన్నారు. అన్ని వర్గాలను, వ్యవస్థలను నాశనం చేసి రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌రెడ్డి పార్టీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మీ భూములమీద జగన్ అనుమతులు కావాలా?
సాగు చేసుకున్న భూములపై గిరిజనులకు హక్కు కల్పించాం. పండిరచే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేశా. కానీ, జగన్ మీ భూమి పత్రాలపై ఫొటో వేసుకుని ‘జగనన్న భూహక్కు పథకం’ అంటున్నాడు. ఈరోజు మీ భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఉంది. మళ్లీ జగన్ వస్తే అదీ ఉండదు. మీ వారసత్వ భూములను ఏం చేయాలన్నా జగన్ అనుమతి తీసుకోవాల్సిన చట్టం తెస్తున్నారు. ఇది మీకు సమ్మతమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రమాదకరమైన చట్టాలతో భూములు కొట్టేయడానికి ప్రణాళిక వేస్తున్న జగన్‌ను ఇంటికి తరమాలన్నారు. కూటమి అధికారంలోకి రాగానే.. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డిపస్సీపైనా, మలి సంతకం భూహక్కు చట్టం రద్దు దస్త్రంపైనే పెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
మోదీపై మాట్లాడాల్సింది జగన్….
ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స సత్యనారాయణ తాకట్టు పెట్టారని, పదవులన్నీ ఆయన కుటుంబానికేనని చంద్రబాబు విమర్శించారు. మోదీ గురించి బొత్స కాదు.. దమ్ముంటే జగన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నెలలోగా నీరిచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బకాయిలతో కలిపి జులైలో రూ.7వేలు పించను ఇస్తామని ప్రకటించారు. వైకాపాను ఓడిస్తే తప్ప ప్రజల భూములకు భద్రత ఉండదు. సంక్షేమ కార్యక్రమాలు ఏమీ నిలిచిపోవు. మరింత పెంచుతాం. వచ్చే ఐదేళ్లు అద్భుతంగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటా. చీపురుపల్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎప్పుడూ రైతు సంక్షేమాన్ని పట్టించుకునే పార్టీ మాది. సంపద సృష్టించి పేదలకు పంచడం నా పని అని చంద్రబాబు పేర్కొన్నారు.
కురుపాం నియోజకవర్గానికి చంద్రబాబు వరాలు….
ఏనుగుల వల్ల పంటలు నాశనమవుతున్నాయి. దానికి పరిష్కారం చూపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాల్వకు మిగులు జలాలను లిఫ్ట్ ద్వారా అందిస్తానన్నారు. కోమరాడ, గరుకుపల్లి మండలాలకు నీరిస్తామని, పూర్ణపాడు-లాబేసు మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాలకు సాగునీరు అందించడానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని ప్రకటించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో జీడి పరిశ్రమ ఏర్పాటుచేసి రైతులకు గిట్టుబాటు ఇప్పిస్తామన్నారు. తోటపల్లి దగ్గర కొత్త వంతెన కట్టిస్తానని, డ్రిప్ ఇరిగేషన్ పెడతా, పోలీసులకు శని, ఆదివారాలు సెలవులు ఇప్పిస్తానని, పామాయిలు రైతును ఆదుకుంటానని చంద్రబాబు వరాలు కురిపించారు. ఎంపీ గీతకు కమలం పువ్వు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.