- నియోజకవర్గ రూపురేఖలు మార్చి అభివృద్ధి పథం వైపు నడిపిస్తారు
- విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడు
- భవిష్యత్ తరాలు బాగుండాలంటే తిరిగి ముఖ్యమంత్రి కావాలి
- ఎన్నికల ప్రచారంలో లోకేష్ కుటుంబసభ్యులు
మంగళగిరి టౌన్(చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా మద్దతు యువనేత నారా లోకేష్‌కే ఉందని, అత్యంత భారీ మెజార్టీతో గెలుపుఖాయమని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. లోకేష్‌కు మద్దతుగా మంగళగిరి పట్టణం 16,18 వార్డుల్లో గురువారం కుటుంబసభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, మహిళలు వారికి ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ, సూపర్-6 కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. చిరువ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో నారా లోకేష్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు కూటమి విజయం ఆవశ్యకతను ప్రజలకు వివరించారు.
భవిష్యత్ కోసం బాబు: నందమూరి సుహాసిని….
ఈ సందర్భంగా నందమూరి సుహాసిని మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడును తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటు అమూల్యమైనదన్నారు. ప్రజల భవిష్యత్‌తో పాటు వారి పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కూటమి ప్రభుత్వం విజయం సాధించాలన్నారు. చంద్రబాబునాయుడు విజన్ అందరికీ తెలుసుని, సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందున్నారు. నేడు ప్రపంచపటంలో హైదరాబాద్ నిలిచిందంటే చంద్రబాబునాయుడు ముందుచూపే కారణమన్నారు. రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. అప్పుడే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ప్రజలకు మెరుగైన సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. మంగళగిరిలో కూటమి అభ్యర్థి నారా లోకేష్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపించాలని ప్రజలను సుహాసిని కోరారు.
కూటమి ప్రభుత్వంతోనే మహిళా సంక్షేమం….
రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ద్వారానే మహిళా సంక్షేమం సాధ్యమని సుహాసిని పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 అందించడంతో పాటు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినున్నట్లు వెల్లడిరచారు. చంద్రబాబునాయడు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళలను శక్తివంతంగా తయారుచేశారని, కూటమి ప్రభుత్వంలోనూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తారని సుహాసిని తెలిపారు.
భారీ మెజారిటీ ఖాయం: గారపాటి శ్రీనివాస్
ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ..మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కు మద్దతుగా కుటుంబ సభ్యులందరం మూడు రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నామన్నారు. కచ్చితంగా ప్రజల స్పందన లోకేష్ వైపే ఉందని..మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా అధికారంలో లేకపోయినా లోకేష్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని… వైద్య, విద్య, ఇతర కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చి, అభివృద్ధి పథంవైపు తీసుకెళ్లాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలు తమ రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారన్నారు.
ఈ కార్యక్రమంలో గారపాటి లోకేశ్వరి, నందమూరి మాధవి మణి, కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్, డి.కవిత ప్రసాద్, డి ప్రసాద్, గౌరినేని చంద్ర, గౌరినేని శాంతి, వల్లూరిపల్లి దుర్గాప్రసాద్, వల్లూరిపల్లి శారద, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.