అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాల కోసం కలిసి చర్చించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి రేవంత్ చేస్తున్న కృషిని, ఆయన అంకిత భావాన్ని చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిందని చెబుతూ, తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని ఈ సందర్భంగా కోరారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల పరస్పర సహకారం.. తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని లేఖలో తెలిపారు. ఈనెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వెల్లడిరచారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం, ఇరు రాష్ట్రాల పురోగతి, రాష్ట్రాల మధ్య సహకారం అంశాలపై రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తుంటానంటూ చంద్రబాబు పేర్కొన్నారు.