- విజయవాడ నగరంలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
- వైద్యశిబిరాల్లో 24 గంటలు అందుబాటులో డాక్టర్లు
- వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు
అమరావతి(చైతన్యరథం): తుఫాన్, భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 75 వేల అత్యవసర మందుల కిట్ల పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఫుడ్ ప్యాకెట్ల తో పాటు 10 వేల అత్యవసర మెడికల్ కిట్లను హెలికాప్టర్ ద్వారా అధికారులు పంపించిన ట్టు చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన 14 మెడికల్ రిలీఫ్ క్యాంపులకు అత్యవసర మందుల కిట్లను అధికారులు చేరవేసినట్టు వివరించారు. అలాగే మరికొన్ని కిట్లను 10 మొబైల్ మెడికల్ వాహనాల(ఎంఎంయూలు) ద్వారా పంపించినట్టు తెలిపారు.
ఏపీఎంఎస్ ఐడీసీ నుంచి 50 వేల కిట్లు, డ్రగ్ కంట్రోల్ విభాగం నుంచి 25 వేల కిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. మెడికల్ రిలీఫ్ క్యాంపుల్లో 24 గంటలు వైద్య సేవలందించేందుకు డాక్టర్లు, సిబ్బందితో పాటు సరిపడా మందులను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. అత్యవసర మందుల కిట్లో ఆరు రకాల మందులతో పాటు ఎలా వాడాలన్న వివరాలతో కరపత్రాలు కూడా ఉంచామన్నారు. పారిశుధ్యం, నీటి కాలుష్యం వల్ల సంభవించే జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలకు ఏయే మందులు ఎలా వేసుకోవాలో వాటిల్లో వివరించామని చెప్పారు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలి చ్చామని తెలిపారు. బోట్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లతో పాటు బాధితులకు అత్యవసర మందుల కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్, ఏపీఎంఎస్ ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్/డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ జి.లక్ష్మీషా, సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి అత్యవసర మందుల పంపిణీని పర్యవేక్షించారు.