- ప్రోత్సాహకంగా క్రెడిట్ గ్యారెంటీ ఫండ్
- ట్రస్టునుంచి రూ.5 వేల కోట్లు రుణ సౌకర్యం
- ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి శ్రీనివాస్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించేలా త్వరలో నూతన ఎంఎస్ఎంఈ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నట్టు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ పంపవర్మెంట్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత బలోపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయంలో సమీక్ష జరిగిందన్నారు. 2014-19 మధ్యకాలంలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ పలు విధానాలు అమలు చేయడంతోపాటు, 2018లోనే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి కేంద్ర నిధులను పెద్దఎత్తున వినియోగించుకోవడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ విధానాలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయని, ఎంఎస్ఎంఈలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు.
దాదాపు రూ.1,500 కోట్లమేర ప్రోత్సహకాలను ఎంఎస్ఎంఈ చెల్లింపు చేయకుండా నిలుపుదల చేసిందన్నారు. అటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ అధిగమిస్తూ ఎంఎస్ఎంఈల్లో నూతనోత్సహాన్ని తీసుకువచ్చేలా తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎటువంటి కొలేటరల్ గ్యారెంటీ లేకుండా ఎంఎస్ఎంఈలకు దాదాపు రూ.5 వేల కోట్లమేర రుణ సౌకర్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలుపర్చే క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టుకు రూ.100 కోట్లగ్రాంట్ను సీఎం ప్రకటించారన్నారు. ర్యాంప్ కార్యక్రమం క్రింద రాష్ట్రానికి రూ.100 కోట్లమేర నిధులను కేంద్రం మంజూరు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని టీ, కిరణా షాపులు మొదలుకొని అన్ని ఎంఎస్ఎంఈలను రిజిష్టరుచేసి వాటి అభివృద్దికి అవసరమైన ఆర్థిక సాయ అందించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంపొందిస్తూ, వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
కామన్ ఫెసిలిటీస్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నిరకాల ఎంఎస్ఎంఈలను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు, వాటికి అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. జిల్లాల విభజనకు ముందు 13 ఉమ్మడి జిల్లాల్లోనే జిల్లా పరిశ్రమల కేంద్రాలున్నాయని, అవి కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయన్నారు. వాటితో పాటు నూతన జిల్లాల్లో కూడా జిల్లా పరిశ్రమల కేంద్రాలను ఏర్పాటు చేసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా కేంద్రాలను అనుసంధానించి ఎంఎస్ఎంఈలకు అవసరమైన అత్యుత్తమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీఐఐసీలో ఎంతో భూమి అందుబాటులో ఉందని, ప్రస్తుతం ఉన్న పార్కులకు అదనంగా మరో 50 పార్కులను, పిపిపి విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ట్రేడ్ ప్రొమోషన్ కార్పొరేషన్‌ను కూడా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అచ్యుతాపురంపూడిలో రూ.250 కోట్లతో టెక్నాలజీ కేంద్రాన్ని ఇప్పటికే ఏర్పాటుచేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా అమరావతిలోనూ మరో టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ రెండు కేంద్రాలను అనుసంధానిస్తూ.. హబ్ అండ్ స్పోక్ మోడల్లో మరో పది కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెద్దఎత్తున పెంచేందుకు పటిష్టమైన చర్యలను చేపడుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు.