- బ్యాంకులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
- వ్యవసాయ అనుబంధ రంగాలకు తోడ్పాటు ఇవ్వాలి
- ఎంఎస్‌ఎంఇ రంగాన్ని ప్రోత్సహించాలి
- ఐదేళ్ళలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యం
- వరదల్లో బ్యాంకుల తోడ్పాటుకు ప్రభుత్వం తరపున అభినందనలు
- ఎస్‌ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించేందుకు బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి మాత్యులు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 228వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) అమలులో 2024 ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించి జూన్ నెలాఖరు వరకు సాధించిన ప్రగతిని సమీక్షించేందుకు జరిగిన ఈ సమావేశంలో అజెండాలోని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 65 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ రంగాల్లో బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలని విజ్ణ్తప్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కౌలు రైతులకు 9 లక్షల సీసీఆర్సీ కార్డులు (సాగు హక్కుదారుల కార్డులు) ఇవ్వగా ఇప్పటి వరకూ 2లక్షల మందికి మాత్రమే బ్యాంకులు రుణాలు అందిచాయన్నారు. కౌలు రైతులకు రుణాలు అందించడంలో మానవతా దృక్పథంతో బ్యాంకులు ముందుకు రావాలని ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్ధం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడిరచారు. ప్రభుత్వం ఆరు రంగాల్లో విధాన నిర్ణయాలను ప్రకటించిందని వాటిలో ఎంఎస్‌ఎంఇ రంగం ప్రధానమైన రంగమని దీనిని ప్రోత్సహించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ముందుకు రావాలని విజ్ణప్తి చేశారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంతో పాటు అపారమైన సహజ వనరులతో పాటు, పెద్దసంఖ్యలో యువత ఉందన్నారు. వివిధ రంగాల్లో యువతకు చేయూతను అందించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ముందుకు రావాలని మంత్రి విజ్ణప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ముద్రా యోజన, పీఎం విశ్వకర్మ, తదితర పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశిస్తోందని, అయితే క్షేత్ర స్థాయిలో ఆయా పథకాలపై ప్రజలకు తగిన అవగాహన లేకపోవడంతో అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. వాటిపై ప్రజలకు తగిన అవగాహన కల్పించి విజయవంతానికి కృషి చేయాలని మంత్రి విజ్ణప్తి చేశారు.
గత ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయించిన నిధులను వేరే అవసరాలకు మళ్ళించి ఆయా రంగాలన్నిటినీ నిర్వీర్యం చేసి అభివృద్ధిని నిలిపి వేసిందన్నారు. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా తిరిగి గాడిలో పెట్టేందుకు గత నాలుగు నెలలుగా ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సాంకేతికతను జోడిరచి వాటిని ముందుకుకు తీసుకువెళ్ళేందుకు బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని విజ్ణప్తి చేశారు. ఇటీవల వరదల్లో బాధితులను ఆదుకునేందుకు బ్యాంకులు కూడా ఎంతో తోడ్పాటును అందించాయని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.
బ్యాంకుల తరఫున పూర్తి సహకారం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ ఎ.మణిమేఖలై మాట్లాడుతూ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వర్ణాంధ్ర ` 2047, వికసిత్ ఏపీ లక్ష్యంగా రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలు, పథకాలను అమలు చేయడం పట్ల ముందుగా బ్యాంకుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా సాంకేతికత సహాయంతో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గవర్నైస్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. అదే విధంగా పి-4 విధానం(పబ్లిక్,ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్ షిప్)తో వివిధ రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. డిజిటల్ ఇనిషియేటివ్స్, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నానికి బ్యాంకుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఇటీవల వరదల్లో బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని మణిమేఖలై ప్రత్యేకంగా అభినందించారు.
బ్యాంకుల పనితీరు గురించి ఆమె మాట్లాడుతూ 2024-25 వార్షిక రుణ ప్రణాళిక అమలుకు సంబంధించి ప్రాధాన్య రంగం కింద 3 లక్షల 75వేల కోట్ల రూపాయల మేర రుణాలు అందించాల్సి ఉండగా, మొదటి త్రైమాసికంలో, జూన్ 30 నాటికి లక్షా 36వేల 657 కోట్లు.. 36 శాతం మేర రుణాలు అందించామని తెలిపారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 2లక్షల 64వేల కోట్లు రూపాయల రుణాలు అందించాల్సి ఉండగా 89 వేల 438 కోట్ల రూపాయలు అందించి 34 శాతం, ఎంఎస్‌ఎంఇ రంగం కింద 87వేల కోట్లు రుణ సహాయం చేయాల్సి ఉండగా 44వేల 150 కోట్ల రూపాయలు అందించి 51 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు.అలాగే ప్రాధాన్యేతర రంగం కింద లక్షా 65వేల కోట్లు అందించాల్సి ఉండగా 87వేల 731 కోట్ల రూపాయల మేర రుణాలందించి 53 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు.
ఏసీపీలో మెరుగైన వృద్ధి
ఫైనాన్సియల్ సర్వీసెస్ శాఖ కార్యదర్శిగా ఢల్లీిలో రాష్ట్రం తరపున పనిచేస్తున్న నాగరాజు మద్దిరాల మాట్లాడుతూ వ్యవసాయ, ఎంఎస్‌ఎంఇ రంగాల్లో రుణ వితరణ బాగుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎం జన్‌ధన్ యోజన, పీఎం జీవన్ జ్యోతి యోజన, పీఎం అటల్ పెన్షన్ యోజన, పీఎం ముద్ర యోజన వంటి పథóకాలకు సకాలంలో తగిన రుణాలు అందించాలని సూచించారు. వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) అమలులో మెరుగైన వృద్ధి సాధించారన్నారు. విద్యా రుణాల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన రీతిలో రుణాలు విడుదల కావడం లేదని, దీనిని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయేతర రంగాలైన మత్స్య, పౌల్ట్రీ, డెయిరీ వంటి రంగాల్లో మరింత పెద్ద ఎత్తున రుణాలందించాలని సూచించారు. ఏపీలో ప్రకృతి సేద్యం ప్రగతి బాగుందని, దీనిలో మరింత తోడ్పాటు అందిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుచేసే రైతుల్లో 90 శాతం వరకు కౌలురైతులు ఉన్నారని వారికి సక్రమంగా రుణాలు అందడం లేదని, సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పకుండా రుణాలు అందించి ఆదుకోవాలని బ్యాంకరులకు విజ్ణప్తి చేశారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ మాట్లాడుతూ 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాయన్నారు.
అంతకు ముందు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సీవీఎన్ భాస్కరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా వివరాలను తెలియజేస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక కింద జూన్ 30 నాటికి మొదటి త్రైమాసికంలో సాధించిన ప్రగతిని వివరించారు. అలాగే బ్యాంకింగ్ కీ ఇండికేటర్ల కింద వివిధ అడ్వాన్సులు, వడ్డీలేని రుణాలు, ఎంఎస్‌ఎంఇ రంగాలు సహా వివిధ ప్రాయోజిత పథకాల్లో సాధించిన ప్రగతి, తదితర అంశాలపై రంగాల వారీగా సాధించిన ప్రగతిని వివరించారు.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఏపీ రీజియన్ రీజనల్ డైరెక్టర్ ఏఓ బషీర్, నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్.రావత్, సిడ్బీ సీఎండీ మనోజ్ మిట్టల్, తదితరులు మాట్లాడారు. ఈ సమావేశానికి తొలుత యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏజీఎం, ఎస్‌ఎల్బీసీ కోఆర్డినేటర్ రాజబాబు స్వాగతం పలికి అజెండా అంశాలను వివరించారు. చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్, ఆర్థికశాఖ కార్యదర్శి జానకి, అదనపు కార్యదర్శి జె.నివాస్, తదితర అధికారులు, వివిధ బ్యాంకుల డీజీఎంలు, ఏజీఎంలు, ఎల్డ్డీఎంలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫైనాన్షియల్ లిటరసీపై రిజర్వు బ్యాంకు ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.