- నిర్వీర్యమైన ప్రాజెక్టును గాడిన పెడుతున్న సర్కారు
- వీధి దీపాల నిర్వహణకు రూ.150 కోట్లు..
- నిధుల విడుదలకు ఆర్థిఖ శాఖకు సీఎం ఆదేశం
- 55వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టౌలు
- వంటగ్యాస్ వినియోగాన్ని నియంత్రించే యత్నం
- సమర్థ విద్యుత్ వినియోగ అధ్యయనానికి త్రిసభ్య కమిటీ
- ఎనర్జీ ఎఫిషియన్సీపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.50 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంధన వాడాకాన్ని తగ్గించేందుకు నూరుశాతం ఎల్ఈడి దీపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతోపాటు వీధి దీపాల నిర్వహణకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదన్నారు. సాంకేతికతను వినియోగించి వీధిదీపాల నిర్వహణను మానిటరింగ్చేసి విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఈడీ దీపాలు వినియోగించడం ద్వారా విద్యుత్ మిగులను 30నుండి 60 శాతం వరకూ పెంచవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన బెస్ట్ పాలసీలను మళ్లీ అమల్లోకి తెచ్చి ఇంధన సామర్థ్యంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్నారు. రాష్ట్రంలోని 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో వంటగ్యాస్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌలను వినియోగించాలని, అందుకోసం ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వీధి దీపాల నిర్వహణతో పాటు సమర్ధ విద్యుత్ వినియోగానికి సంబంధించి నివేదిక ఇచ్చేందుకు ఆర్ధికశాఖ, ఇంధనశాఖతో పాటు ఈఈఎస్ఎల్ ప్రతినిధులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సిఇఓ విశాల్‌కపూర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎనర్జీ ఎఫిషియెన్సీ అంశాలకు సంబంధించి వివిధ అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.
ఈఈఎస్ఎల్ తో ప్రభుత్వం అవగాహనా ఒప్పందం
రాష్ట్రంలో 1.5 లక్షల గృహాలకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఉపకరణాలతో విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇఇఎస్ఎల్ సంస్థతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇఇఎస్ఎల్, హౌసింగ్ కార్పొరేషన్ సమన్వయంతో అదనంగా మరో 9 లక్షల ఇళ్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి నారాయణ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి జానకి, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఎండి జెన్కో చక్రధర్ బాబు, ఏపీ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ సిఇఓ విశాల్ కపూర్, ఇతర ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.