- సరైన ప్రతిపాదనలతో వస్తే వెనువెంటనే అనుమతులు, ప్రోత్సాహకాలు
- అమెరికన్ సంస్థలకు మంత్రి నారా లోకేష్ పిలుపు
- బోసన్ మోటార్స్ ఇంటిలిజెంట్ లైట్ ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఆవిష్కరించిన మంత్రి
శాన్ఫ్రాన్సిస్కో (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల, మెరుగైన పరిస్థితులు ఉన్నాయని, అమెరికాలోని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రం అన్ని విధాల అనువైనదని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలోకి పెట్టుబడుల ఆకర్షణ నిమిత్తం ఆమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్.. ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను శాన్‌జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు. శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని ఆ సంస్థ కార్యాలయ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో జెండా ఊపి నూతన వాహనాన్ని అమెరికా మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం బోసన్ సంస్థ కార్యాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి లోకేష్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆన్ వ్యూ సొల్యూషన్స్ ప్రతినిధి జోయల్.. మంత్రి లోకేష్‌కు వివరించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌కు సంబంధించి రూపొందించిన డెమోను ప్రదర్శించారు. తర్వాత ఫాల్కన్ ఎక్స్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సంస్థ సిరిస్ ఏ స్టార్టప్‌లతో వివిధ రంగాల్లో ఆవిర్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోలను వివరించారు. అనంతరం డిజిసెర్ట్ సీఈఓ అమిత్ సిన్హా .. మంత్రి లోకేష్‌ను కలిసి తమ సంస్థ కార్యకలాపాల గురించి తెలియజేశారు. డిజిటల్ సర్టిఫికేషన్, భద్రతలకు సంబంధించి డిజిసెర్ట్ సురక్షితమైన ఆన్ లైన్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆయా సంస్థల అనుబంధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు. ఏపీ సీఎం, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వాన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని లోకేష్ వివరించారు.