- ప్రజల మెడకు ఉరితాళ్లుగా గత ఐదేళ్ల పాపాలు
- జగన్ హయాంలోనే వసూలుకు అనుమతి కోరిన డిస్కంలు
- వాయిదాలు వేస్తూ తాజాగా ఈఆర్సీ నిర్ణయం
అమరావతి: గత ఐదేళ్లలో విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారాయని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. ప్రజల సొమ్మును జగన్ రెడ్డి అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం గత టీడీపీ ప్రభుత్వంలో చేసుకున్న పీపీఏలను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేశారని విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తికి మారుపేరయిన ఏపీ జెన్కోని నిర్వీర్యం చేసి.. ప్రజావసరాల కోసం అనే పేరుతో యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో జరిపిన విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని మంత్రి గొట్టిపాటి తప్పుబట్టారు. విద్యుత్ కొనుగోళ్లను క్విడ్ ప్రో కో విధానం ద్వారా జరిపి, వచ్చిన సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్ తరలించారని ఆరోపించారు. కేవలం విద్యుత్ కొనుగోళ్లు మాత్రమే కాకుండా బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం అంతా కూడా జగన్ రెడ్డి, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రహస్యంగానే నడిపించారని స్పష్టం చేశారు. వీరు అనుసరించిన విద్యుత్ విధానాల పాపమే నేడు ప్రజల మెడలకు సర్దుబాటు చార్జీల ద్వారా చుట్టుకుందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.
జగన్ దోపిడీ భారం ప్రజలపై..
జగన్ మోహన్ రెడ్డి బరితెగింపు దోపిడీ కారణంగా గడిచిన ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచినట్లు మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. అంతేగాకుండా జగన్ రెడ్డి చేసిన పాపాల కారణంగా ప్రస్తుతం ఏపీ ప్రజల మీద 2023-24 సంవత్సరానికి గాను మరో రూ.11,826.42 కోట్ల భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఈ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేస్తామని ఈఆర్సీని డిస్కంలుకోరినా వాయిదా వేస్తూ వచ్చారని చెప్పారు. చివరగా 2024 మార్చి నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాల్సి వస్తే… ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వాయిదాల పర్వం కొనసాగినట్లు స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి గద్దె దిగిపోతూ కూడా తాను చేసిన దోపిడీని ప్రజల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీని కోరిన విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మంత్రి గొట్టిపాటి కోరారు.
పాపాలు చేసింది కాక నేడు సాక్షిలో విషప్రచారం
గత ప్రభుత్వ హయాంలోనే ప్రజల నుంచి వసూలు చేయాల్సి ఉండగా, నిర్ణయాన్ని వాయిదా వేస్తూ.. చివరికి ఈఆర్సీ కాల పరిమితి ముగుస్తుందనగా సర్దుబాటు ఛార్జీల వసూలుపై ఈ నెలలో నిర్ణయం తీసుకుందని మంత్రి గొట్టిపాటి తప్పుబట్టారు. ఈ కారణంగా జగన్ రెడ్డి చేసిన అక్రమ వసూళ్లు చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సి వస్తోందని గుర్తు చేశారు. జగన్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే ప్రజలపై విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం పడిరదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక సాక్షి పత్రిక తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని మండిపడ్డారు. పాపాలన్నీ జగన్ అండ్ కో చేసి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాలకు పరాకాష్ట అయిన సాక్షి పత్రికను అడ్డంపెట్టుకుని తప్పుడు కథనాలను ప్రచురించడం మంచిది కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.