- స్థిరమైన పారిశ్రామికాభివృద్ధికి భాగస్వాములు కావాలి
- ఉద్యోగాల కల్పన, సుస్థిర వృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం
- పాలసీ క్రమబద్ధీకరణలో మీ అభిప్రాయాలు కీలకం
- శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి భరత్ పిలుపు
- నూతన పారిశ్రామిక విధానం 4.0పై సమావేశం
శ్రీసిటీ(చైతన్యరథం): నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పెట్టుబడుల కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలంటూ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి మంత్రి టి.జి.భరత్ పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీసిటీ పరిశ్రమల ప్రధాన కార్యనిర్వాహ కులు (సీఈవోలు), ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం-4.0 తీరు తెన్నుల గురించి వివరించారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాబోయే ఐదేళ్లలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా కార్యాచరణను అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ విధానంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ ఎంఈ), ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి, పర్యావరణ హరిత శక్తి, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. వేగం, సామర్థ్యం, సుస్థిరత ద్వారా ఆర్థిక పరివర్తన సాధించే ప్రాథమిక సూత్రాలతో పారిశ్రామిక పాలసీ రూపకల్పన చేయబడిరదని తెలిపిన ఆయన సుస్థిర పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించుకుం టూ ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించే ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిం చాలన్న ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. పాలసీ క్రమబద్ధీకరణలో వ్యాపారవేత్తల సూచనలు, ఆలోచనలు కీలకమని..పరిశ్రమల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు.
వేగవంతమైన వ్యాపార విధానం లక్ష్యం
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ మాట్లాడుతూ నూతన పారిశ్రామిక విధానంలో వేగవంతమైన వ్యాపార విధానం కోసం తీసుకు వస్తున్న వివిధ నిర్ణయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పరిశ్రమల కోసం మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాల గురించి వివరించారు. ప్రైవేట్ ఇండ స్ట్రియల్ పార్కుల (పీఐపీ) కోసం బహుళ-స్థాయి పెట్టుబడి ఫ్రేమ్‌వర్క్‌తో ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానం ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిరదన్నారు. ఈ విధానం సైజు (నానో నుంచి మెగా) వారీగా పార్క్‌లను వర్గీకరించడంతో పాటు వివిధ పెట్టుబడి శ్రేణులకు (సబ్‌లార్జ్, లార్జ్, మెగా) ప్రోత్సాహకాలను అందిస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగా లను సృష్టించడం, ఆర్థిక వృద్ధిని పెంచడం రాష్ట్రం లక్ష్యంలో భాగంగా వివరించారు. ప్రత్యేకంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పర్యావరణ స్నేహపూర్వక విద్యుత్, ఎల క్ట్రానిక్స్, ఆహారశుద్ధి రంగాలకు అధిక ప్రోత్సాహకాలు, 40 శాతం వరకు సబ్సిడీలు, 6 శాతం డీకార్బనైజేషన్ సబ్సిడీ, వ్యాపార నిర్వహణలో తక్కువ సమయంలో సౌల భ్యాలను కల్పించడం ఈ విధానంలో కీలకంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాక ఎగుమతుల లక్ష్యాన్ని 40 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఆటోమోటివ్, ఔషధం, అంతరిక్ష రంగాలలో ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’’ నినాదంతో రాష్ట్రంలో 175 ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక పార్కు లు, ఎంఎస్‌ఎంఈలు, ఎలక్ట్రానిక్స్ కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ కల్పన, సుస్థిర వృద్ధిని సాధించడం ప్రభుత్వ లక్ష్యంలో భాగ మన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పరిశ్రమల కోసం ఆకర్షణీయ కేంద్రంగా మారు స్తూ దీని ద్వారా స్థిరమైన పారిశ్రమాభివృద్ధిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
నూతన పారిశ్రామిక విధానానికి ప్రశంసలు
శ్రీసిటీ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, నూతన పారిశ్రామిక విధానాన్ని హర్షిస్తూ ముఖ్యంగా పనులు వేగవంతంగా సాగేలా చేసే (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) విధానానికి ప్రశంసలు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఉద్దేశించిన ప్రోత్సాహకాలను అభినందిస్తూ పెండిరగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను త్వరగా రీయింబర్స్‌మెంట్ చేయాలని అభ్యర్థించారు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అవసరాలను పరిష్కరించడానికి, ఫిర్యాదుల పరిష్కారానికి విధాన సౌలభ్యంపై వారు ప్రస్తావించారు. శ్రామికశక్తి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తి శిక్షణ కార్య క్రమాలలో పెట్టుబడిని పెంచాలని సూచించారు. శ్రీసిటీ పారిశ్రామిక వర్గానికి నూతన పారిశ్రామిక విధానం దాని ముఖ్య అంశాలను వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు మంత్రి, కార్యదర్శికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ చొరవ ప్రపంచ పెట్టుబడులకు రాష్ట్రాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చడంలో ప్రభుత్వ చురుకైన విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా మంత్రి, పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీసిటీలోని వివిధ అభివృద్ధి కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. డైకిన్ ఇండియా పరిశ్రమను సందర్శించి ఉత్పత్తి ఇతర అంశాలను ఆరాతీశారు.