- రుషికొండ దారుణంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య
- ప్రజాస్వామ్య వాదులంతా ఖండిరచాలని పిలుపు
- ప్యాలెస్ భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి
- ఋషికొండపై మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (చైతన్య రథం): ఋషికొండపై తన స్వార్ధం కోసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ప్రజా కోర్టులో చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ముఖ్యమంత్రి ఋషికొండ ప్యాలస్‌లో బ్లాక్‌ల వారిగా తిరిగి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగానే ఇలాంటివి సాధ్యమా అనిపించింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక వ్యక్తి తన విలాసవంతమైన జీవితం కోసం స్వార్ధంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసి ఇలాంటి కట్టడాలు చేస్తారా ఆశ్చర్యం కలిగిందన్నారు. గుండె చేదిరిపోయే నిజాలు ఇక్కడ కనిపించాయని అంటూ… ఇలాంటి నేరాలు చెయ్యడానికి చాలా గుండె ధైర్యం కావాలని చంద్రబాబు అన్నారు. ప్యాలస్ చూడడానికి తాను, మిత్రుడు పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులు ప్రయత్నం చేసి వెళ్లలేకపోయామన్నారు. చాలా దేశాలు తిరిగాను కానీ పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్యాలస్ కట్టడం ఎక్కడా చూడలేదని అన్నారు.
నిజాం ప్యాలెస్ ఫలక్‌నుమా చూసినపుడు కలిగిన భావోద్వేగం కంటే.. ఈ ప్యాలస్ చూస్తే ఆశ్చర్యం, ఉద్వేగం కలిగాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఉత్తరాంధ్ర ఇరిగేషన్ కోసం రూ.400 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ, రూ.430 కోట్లతో ఈ ప్యాలెస్ కట్టాడని, ఒక రాజులా, చక్రవర్తిలా భవించాడని జగన్‌ను ఎద్దేవా చేశారు. 7 బ్లాక్‌లలో 13,548 చ.మీటర్లలో కట్టడమే కాకుండా చుట్టూ ఉన్న 18 ఎకరాలను జపాన్ టెక్నాలజీతో కొండ చుట్టూ ప్రొటెక్షన్ కట్టించారన్నారు. పీఎం, ప్రెసిడెంట్ల విడిది కోసం కడుతున్నామని జగన్ సర్కారు ప్రచారం చేసుకోవడాన్ని ఎద్దేవా చేస్తూ.. రాష్ట్రపతి, ప్రధానులు సాధారణ అతిధి గృహాల్లోనే ఉన్నారు తప్ప.. ఇలాంటి పాలస్‌ను కట్టమని అడగలేదే? అని వైసీపీని దుయ్యబట్టారు.
స్నానాల టబ్‌కి రూ.36 లక్షలు, కమోడ్‌కు రూ.12 లక్షలు ఖర్చు చేశారని, 9.88 ఎకరాల్లో 7 బ్లాక్‌లతో విలాసవంతమైన ప్యాలస్‌ను పర్యావరణాన్ని విధ్వంసం చేసి నిర్మించడాన్ని ఏ ఒక్కరూ హర్షించరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాలస్ సమూహం దేనికి ఉపయోగ పడుతుందో తెలియడం లేదన్నారు. దేశంలో అత్యంత అరుదైన ప్రదేశం.. దేనికీ పనికి రాకుండా భవంతులు కట్టేశారు. ఈ ప్రాంత సరిహద్దుల్లోకి ఎవరిని రాకుండా కట్టడి చేసి, ఎన్జీటి, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాలను మభ్యపెట్టి, అధికారులను భయపెట్టి, ప్రజల్ని మోసం చేసారని చంద్రబాబు ఆగ్రహిచారు. కళింగ బ్లాక్‌లో 300 మందికి కాన్ఫరెన్స్ హాల్‌ను నిర్మించారని, అప్పట్లో ఉన్న రాజులకు కూడా ఇలాంటి ఆలోచనలు లేవన్నారు.
100% సబ్ స్టేషన్ , 200 టన్నుల సెంట్రల్ ఏసీ, ఎటు చూసినా సముద్రం కనపడే వ్యూతో నిర్మించారని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం భావ్యమా అనే అంశంపై చర్చ జరగాలన్నారు. కాపిటల్ నిర్మిస్తామని ప్రజల్ని మభ్య పెట్టి ప్రజా ధనాన్ని మంచినీళ్లు లా ఖర్చు చేసారని అన్నారు. ఆంధ్ర ఎస్కోబా… జగన్ అని, ప్రజలపై గౌరవం ఉంటే వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. తాను సిద్ధాంతపరమైన, రాజకీయపరమైన పోరాటాలు చేసానేగానీ, దొంగలతోనూ పోరాటం చేయవలసి వస్తోందని జగన్ పాలన ముగిశాకే అర్థమైందన్నారు. అలాంటి బరితెగింపు ఏ ముఖ్యమంత్రీ చేయలేదని, ఈ ఆరాచకాలన్నింటినీ ప్రజల ముందు పెడతామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి బాల వీరంజనేయ స్వామి, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ మంత్రి నారాయణ, ఎంపీలు భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, శాసన సభ్యులు వంశీ కృష్ణ యాదవ్, గంట శ్రీనివాస రావు, కోండ్రు మురళి, పల్లా శ్రీనివాస్, రామకృష్ణ బాబు, పర్యాటక శాఖ సెక్రటరీ వినయ్‌చంద్, జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.