- మత్తుపై క్షేత్రస్థాయిలో ఇక యుద్ధం
- టెక్నాలజీ సాయంతో గంజాయి నియంత్రణ
- విక్రేతలకు ప్రభుత్వ సంక్షేమం కట్
- పోలీసులూ.. మీ ప్రతాపం చూపండి
- ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదేశం
- జిల్లాకొక నార్కోటిక్ కంట్రోల్ సెల్, ఠాణా
- మత్తు రవాణా మార్గాలపై జేటీఎఫ్ డేగ కన్ను
- గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం
- సబ్ కమిటీ భేటీలో హోంమంత్రి అనిత వెల్లడి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పూర్తిస్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలని, ఇకపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం సచివాలయంలో జరిగింది. భేటీకి హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్)గా మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు.
టెక్నాలజీతో గంజాయి కట్టడి
రాష్ట్రంలో గంజాయి కట్టడికి పంటసాగును గుర్తించేలా అధునాతన టెక్నాలజీ వినియోగించాలని, పంట ధ్వంసానికి డ్రోన్లు వినియోగించాలని మంత్రి లోకేష్ సూచించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణతోపాటు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 10మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ జరగాలని, మహిళా సంఘాలు, ఆశా వర్కర్లనూ భాగస్వామ్యం చేయాలని సూచించారు. డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపొందించి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారి ఫోటోలను ప్రత్యేక వెబ్సైట్లో, పోలీస్‌స్టేషన్‌లో పొందుపర్చాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
విక్రేతలకు ప్రభుత్వ సంక్షేమం కట్
గంజాయి, డ్రగ్స్వలన యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోందని, మాదకద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని సమావేశం చర్చించింది. ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదని సబ్ కమిటీ అభిప్రాయపడిరది. గంజాయి, డ్రగ్స్ విక్రేతల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమం కట్ చేసే ఆలోచనను మంత్రుల ఉపసంఘం సమావేశంలో చర్చించింది. దీనివలన గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టే అవకాశం మెరుగుపడుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యడానికి సాధ్యాసాధ్యాలు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు అధ్యయనం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
దుష్పరిణామాలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశా
పాదయాత్ర సమయంలో గంజాయి బాధిత కుటుంబాల వేదనను ప్రత్యక్షంగా చూశానని మంత్రి లోకేష్ ప్రస్తావించారు. ‘అనేక కుటుంబాలు నన్ను కలిశాయి. గంజాయికి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలని మహిళలంతా కోరారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. సమాజంలో అలాంటి పరిస్థితిని రూపుమాపడానికి పోలీసులు క్షేత్రస్థాయికి అగ్రెసివ్‌గా వెళ్లాలని లోకేష్ సూచించారు. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. పంజాబ్‌లో డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలని, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో అవగాహన కల్పించాలన్నారు. ఈగల్ టీమ్‌కు న్యాయపరమైన శిక్షణ కోసం సెమినార్ నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మెగా ర్యాలీ నిర్వహణపైనా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఈగల్ టోల్‌ఫ్రీ నెంబర్ 1972ను సీఎం చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈగల్ లోగోను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు చేపట్టబోయే కార్యక్రమాలను పోలీసు ఉన్నతాధికార్లు వివరించారు.
జిల్లాకొక నార్కోటిక్ కంట్రోల్ సెల్: అనిత
మంత్రుల సబ్ కమిటీకి అధ్యక్షత వహించిన హోంమంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపేలా ప్రతిజిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడిరచారు. ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని స్పష్టం చేశారు. ‘మహా సంకల్పం’ పేరిట భారీ అవగాహన సదస్సుల నిర్వహణకు కసరత్తు జరుగుతోందన్నారు. స్లోగన్స్, ప్లెడ్జ్లతో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ద్వారా అవగాహన సదస్సుల నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని యువతను భాగస్వామ్యంచేసి పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడిరచారు. అవగాహన సదస్సులతోపాటు ఐ అండ్ పీఆర్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ల భాగస్వామ్యంతో ప్రచారాన్ని విస్తృతం చేసి.. మత్తురహిత రాష్ట్రాన్ని ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు.
గంజాయి, డ్రగ్స్ సమాచారం అందిన మరుక్షణం చర్యలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. గంజాయి సాగు, సరఫరాపై డేగకళ్లతో నిఘా పెట్టామని హోంమంత్రి పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ గమ్యస్థానాలను అంతమొందిస్తామన్నారు. జాయింట్ టాస్క్‌ఫోర్స్ ద్వారా మత్తు రవాణా మార్గాలను మట్టుబెడతామన్నారు.
ప్రత్యామ్నాయ పంటలకు గిరిజన సంక్షేమ శాఖ సహకారం
గంజాయి పండిరచకుండా అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రత్యామ్నాయం కూడా కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమావేశంలో చర్చించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె సమావేశంలో వివరించారు. సబ్ కమిటీ సమావేశంలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈగల్ ఆకే రవికృష్ణ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.