- కాలనీల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత
- గృహ నిర్మాణ శాఖ సమీక్షలో మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ కాలనీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాలపై మంగళవారం సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలలో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రహదారులు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర సదుపాయాలను యుద్ధప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మోడల్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమయ్యే నిధులపై నివేదికలు అందచేస్తే.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రతి లబ్దిదారునికి తక్కువ వడ్డీకి ఇస్తున్న 35 వేల రూపాయలు రుణాన్ని లక్షకు పెంచేలా ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు.
లబ్దిదారుకులకు ఇళ్ల నిర్మాణాలలో ఇసుక, ఇతర సామాగ్రికి ఏవిధమైన ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, సకాలంలో గృహనిర్మాణాలు పూర్తికాకపోతే భవిష్యత్లో ఇల్లు మంజూరు కాని పరిస్థితి ఉన్నందున లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించాలని పార్ధసారథి సూచించారు. పిఎంవై-2 పథకం కింద ఇళ్లు నిర్మాణానికి కేంద్రంతో ఒప్పందం పూర్తైనందున లబ్దిదారులను ఎంపిక చేయటానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అధికారులు నిత్యం కాలనీల్లో పర్యటిస్తూ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు.
నాణ్యతకు అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలి
గృహ నిర్మాణాలలో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణాల్లో ఉపయోగించే ఇసుక, సిమెంట్, స్టీల్ తదితర సరుకులలో నాణ్యత ఉండాలని, లాబ్లలో పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. పెద్ద కాలనీలలో డ్రోన్లద్వారా నాణ్యతను పరిశిలించాలని మంత్రి సూచించారు. లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఉంచాలని, నిర్మాణ సామగ్రి దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన అన్నారు. అదేవిధంగా లబ్దిదారులకు సకాలంలో నిధులను విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజబాబు రాష్ట్రంలో నిర్మాణాల పురోగతిని మంత్రికి వివరించారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ జీవి ప్రసాద్, ఇంజనీర్లు నాగభూషణం, జయరామాచారి తదితరులు పాల్గొన్నారు.