- వైసీపీ కుట్ర రాజకీయాలను మానుకోవాలి
- కట్టుకథల ప్రచురణ సాక్షి విజ్ఞతకే వదిలేస్తున్నాం
- మీ షెల్ కంపెనీల బాగోతం ప్రపంచం మొత్తానికి తెలుసు
- స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు ఆగ్రహం
- హెరిటేజ్ అంటే.. ప్రజల నమ్మకానికి నిలువుటద్దమని వ్యాఖ్య
మంగళగిరి (చైతన్య రథం): హెరిటేజ్ ఫుడ్స్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి కుటుంబరావు ఖండించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా ఫిక్షన్ రైటింగ్ తప్ప వాస్తవాలు లేవన్నారు. ప్రజలు చదివేది నిజమా కాదా అన్న కనీస బాధ్యత లేకుండా వార్తలు వండివార్చడం బాధాకరమన్నారు. “హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వానికీ, ఏ దేవాలయానికీ లేదా ఏ ఇతర కంపెనీకి నెయ్యిని సరఫరా చేయలేదు. హెరిటేజ్ కేవలం తన సొంత బ్రాండ్‌తో నేరుగా మార్కెట్లో వినియోగదారులకు మాత్రమే నెయ్యిని అమ్ముతుంది.
లేని సరఫరాని ఉన్నట్టుగా చూపించడం సాక్షి పత్రిక విజ్ఞతకే వదిలేస్తున్నాం. హెరిటేజ్ వెబ్‌సైట్ నుంచి ఒక ఫోటోను తీసుకుని, అందులో ఒక కాలమ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించి సాక్షి కుట్ర కథనాన్ని ప్రచురించింది. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థకు కేవలం ఒక ‘కో-మాన్యుఫ్యాక్చరింగ’ లొకేషన్ మాత్రమే. అక్కడ కేవలం స్కిమ్డ్ మిల్క్ పౌడర్, చీజ్, పన్నీర్‌వంటివి మాత్రమే తయారవుతాయి. అక్కడ నెయ్యి తయారీ అసలు జరగదు. ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హెరిటేజ్‌కు 22 యూనిట్లు ఉన్నాయని సాక్షి రాసింది. కానీ వాస్తవానికి ఉన్నవి 15 సొంత యూనిట్లు మాత్రమే. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడులో విస్తరించి ఉన్నాయి. వీటి వివరాలన్నీ సంస్థ వెబ్‌సైట్‌లో అత్యంత పారదర్శకంగా ఉన్నాయి. ఇందాపూర్ డైరీ (సోనాయ) అనేది దేశంలోనే అతిపెద్ద డైరీలలో ఒకటి. ఆసియాలోనే అతిపెద్ద స్ప్రే డ్రయర్ ప్లాంట్ వీరి సొంతం. బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, పతంజలివంటి అంతర్జాతీయ కంపెనీలే వీరి కస్టమర్లు. ఇలాంటి దిగ్గజ సంస్థను తక్కువ చేసి చూపుతూ సిండికేట్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం” అన్నారు.
నెయ్యి ధరల విశ్లేషణ
“ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా నెయ్యి ధరలు పెరిగాయనే కనీస జ్ఞానం సాక్షి పత్రికకు లేదు. 2014-19 మధ్య మార్కెట్ ధర రూ260 – రూ.400 లోపు ఉంది. 2020-22 మధ్య ధర రూ.600 `రూ.650కి పెరిగింది. 2026 (ప్రస్తుతం) రూ.600 నుండి రూ.750 వరకూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే ధరలు పెరుగుతుంటే, అప్పట్లో తక్కువ ధరకు ఇచ్చిన పాత రేట్లను ఇప్పుడు ఎక్కువ ధరకు కోట్ చేస్తున్నారని చెప్పడం కేవలం రాజకీయ కుట్ర. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020-22 మధ్య కాలంలో దేశంలో నెయ్యి ధర రూ.600 నుండి రూ.650 మధ్య ఉంది. కానీ కొన్ని సంస్థలు (ఏఆర్ డైరీ వంటివి) కేవలం రూ.360కే టీటీడీకి సరఫరా చేశాయంటే, అది ఎంత నాణ్యత లేని ‘సింతటిక్ నెయ్యి’ అయి ఉంటుందో ప్రజలే ఆలోచించాలి. తక్కువ ధరకే ఇస్తున్నారంటే అది గొప్పతనం కాదు.
భక్తుల నమ్మకంతో ఆడుకోవడమే. 10 ఏళ్ల క్రితం రూ.300 ఉన్న వస్తువు ఈరోజు కూడా అదే ధరకు ఎలా వస్తుంది? పదేళ్లలో టూత్ బ్రష్‌నుంచి వాడే సబ్బు వరకు అన్నిటి ధరలు పెరిగాయి. నెయ్యి ధర కూడా 2026 నాటికి రూ.750కి చేరింది. ఇందాపూర్ డైరీ అప్పట్లో రూ.300కి ఇచ్చి, ఇప్పుడు రూ.658 కోట్ చేసిందంటే అది పెరిగిన ఉత్పత్తి ఖర్చుల వల్లే. దీనిని దోపిడీగా చిత్రీకరించడం అజ్ఞానమే” అని వైసీపీ కుట్ర కథనాలపై కుటుంబరావు దుమ్మెత్తిపోశారు. “సాక్షి యజమాని జగన్ మోహన్‌రెడ్డి సొంత సంస్థ భారతీ సిమెంట్ 2014లో బస్తా రూ.250కి అమ్మితే, ఈరోజు రూ.430కి ఎందుకు అమ్ముతున్నారు? మీ ఖర్చులు పెరిగినప్పుడు రేటు పెంచడం తప్పు కానప్పుడు, డైరీ రంగంలో రేట్లు పెరగడం తప్పు ఎలా అవుతుంది? హెరిటేజ్ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అలవాటే లేదు. అలాంటప్పుడు సిండికేట్ ఎందుకు ఫామ్ చేస్తుంది? నిజానికి 2019-24 మధ్య సిమెంట్ ధరలను కార్టెల్‌గా మార్చి దోచుకున్నది ఎవరో అందరికీ తెలుసు. నష్టాల్లో ఉన్న సాక్షి పత్రికకు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ప్రజా ధనాన్ని మళ్లించి రూ.600 కోట్లకుపైగా ఎలా దోచుకున్నారో బ్యాలెన్స్ షీట్లు చూస్తే అర్థమవుతుంది.
దేశంలో సాక్షికంటే 5 రెట్లు పెద్దవైన దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్ వంటి పత్రికల మార్కెట్ క్యాప్ రూ.1500 కోట్లే ఉంటే, 2008లోనే సాక్షికి రూ.3500 కోట్ల వాల్యుయేషన్ ఎలా వచ్చింది? ఇది క్విడ్ ప్రో కో కాదా? మనీ లాండరింగ్, షెల్ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేసేవారికి, నిజాయితీగా వ్యాపారం చేసే హెరిటేజ్ వంటి లిస్టెడ్ కంపెనీల విలువ తెలియదు. సాక్షి ఓనర్ పార్టీలోనే డైరీ వ్యాపారం చేసే నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు వంటివారున్నారు. గతంలో తిరుమల డైరీని మల్టీనేషనల్ కంపెనీకి అమ్మేసి, ఇప్పుడు ‘వల్లభ’ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు మార్కెట్‌లో తిరుమల, వల్లభ నెయ్యి ధరలు లీటరుకు రూ.600 నుండి రూ.675 వరకు ఉన్నాయి. మీ నాయకుల కంపెనీలే ఈ రేట్లకు అమ్ముతుంటే, హెరిటేజ్‌పై అవాస్తవాలు ప్రచురించడం మీ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా?” అని కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“హెరిటేజ్ అంటే కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు. అది నమ్మకానికి నిలువుటద్దం. ఇటీవల భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి ‘గోల్డెన్ పీకాక’ అవార్డు లభించింది. ఒక దక్షిణ భారత పారిశ్రామికవేత్తకు ఇలాంటి అత్యున్నత పురస్కారం రావడం గర్వకారణం. ఇది ఒక లిస్టెడ్ కంపెనీ. ప్రభుత్వానికి సకాలంలో పన్నులు కట్టడంలోనూ, బ్యాంకుల అప్పులు తీర్చడంలోనూ ఈ సంస్థకు క్లీన్ రికార్డ్ ఉంది. పాలుపోసే వేలాదిమంది రైతులకు ఒక్క రూపాయి కూడా బాకీ పడకుండా ‘జీరో డ్యూస’ మెయింటైన్ చేస్తున్న ఏకైక సంస్థ హెరిటేజ్. గత 20 ఏళ్లుగా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదికి సగటున 20-25శాతం లాభం అందించిన చరిత్ర దీనిది. 2008లో కేవలం రూ.500 కోట్ల విలువలేని కంపెనీకి రూ.3500 కోట్ల వాల్యుయేషన్ కట్టి క్విడ్ ప్రో కో ద్వారా నిధులు రాబట్టింది నిజం కాదా? గత ఐదేళ్లలో వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనల ద్వారా సాక్షిని ఎలా పోషించారో అందరికీ తెలుసు.
అధికారం పోగానే మీ బ్యాలెన్స్ షీట్లలో కోట్ల నష్టాలు ఎలా వస్తున్నాయి? మనీ లాండరింగ్, షెల్ కంపెనీల ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు.. నీతిగా వ్యాపారం చేసేవారిని విమర్శించడం హాస్యాస్పదం. అవాస్తవాలు రాస్తూ ఇప్పటికే పరువు నష్టం కేసుల్లో ఇరుక్కున్న సాక్షి యాజమాన్యానికి ఇదే హెచ్చరిక. మీ అలమారాలో ఉన్న అస్థిపంజరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జైలు గడపకు మీరు ఎంతో దూరంలో లేరు” అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అబద్ధపు రాతలు రాసే పత్రికలను నమ్మొద్దని, వాస్తవాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఇలాంటి దిగజారుడు కథనాలను పూర్తిగా విస్మరించాలని కుటుంబరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.













