- ‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు
- జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు చీరాలలో నిధులు విడుదల చేయనున్న సీఎం
- రూ.179 కోట్లతో 71,536 కుటుంబాలకు లబ్ధి
- నేతన్నల కుటుంబాలతో ముఖాముఖి కానున్న చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛను అందిస్తూ దన్నుగా ఉంటున్న ప్రభుత్వం… తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. ‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25వేలు చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నేతన్న సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25వేలు సాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు రూ.179 కోట్లను ప్రభుత్వం అందించనుంది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో సర్కారు సాయం అందిస్తోంది.
చేనేత రంగం బలోపేతం దిశగా…
తాజాగా ప్రవేశపెడుతున్న ‘నేతన్న సేవలో’ పథకమే కాకుండా ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీంతో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కల్పిస్తోంది. దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చు కానుంది. అంతే కాకుండా ఏళ్లు నిండిన 85వేల మంది చేనేతలకు రూ.4వేలు చొప్పున ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు
చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి 10.50 గంటలకు చేరుకుంటారు. 11.05 గంటలకు ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి అవుతారు. కొత్తపేటలో 4.10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షిస్తారు. సాయంత్రం 4.45 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.















