- ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విజన్‌కు సెల్యూట్
- గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేష సేవలు
- కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉద్ఘాటన
విశాఖపట్నం (చైతన్య రథం): గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపనతో విశాఖపట్నం దిశ, దశ మారినట్టేనని కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ జోస్యం చెప్పారు. విశాఖ సమీపాన తర్లువాడవద్ద ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి వైష్టవ్ మాట్లాడుతూ.. “విజనరీ లీడర్ చంద్రబాబు హైదరాబాద్‌లో నిర్మించిన సైబర్ టవర్ ఐటీకి ఐకానిక్. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో విశాఖపట్నం ఇక ఏఐ పట్నంగా మారడం ఖాయం” అన్నారు. “ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు సెల్యూట్ చేస్తున్నాను. విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో ఏఐ విప్లవం వస్తోంది. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయని విశ్వసిస్తున్నా. ఎంఓయూ కుదుర్చుకున్న అతి తక్కువ సమయంలోనే గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరగడం చిన్న విషయమేమీ కాదు. ఏఐ డేటా సెంటర్‌ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునే రోజు దగ్గర్లోనే ఉందనడానికి ఈ వేగం ఒక సంకేతం” అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ఐటీ సేవల రంగంలో భారత్ లీడర్‌గా ఎదిగిందని, అందుకు మన దేశంలోని నాయకత్వం కీలకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేవారు. “గతంలో ఉత్పత్తిరంగంపై భారత్ ముందుకు వెళ్లలేకపోయింది. సెమీ కండక్టర్లు, చిప్, ల్యాప్ టాప్, మొబైల్ ఉత్పత్తులలాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. ప్రధాని మోదీ చొరవతో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఇప్పుడు ముందడుగు వేశాం. భారత్‌నుంచి ఇప్పుడు మొబైల్ ఫోన్ అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా అవసరమైన 50 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలను మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నాం.
మేజర్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్, డిజైన్ చేసే దేశంగా భారతదేశాన్ని గుర్తించాలి. సెమీ కండక్టర్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే వాణిజ్య పరమైన ఉత్పత్తిని ప్రారంభించాం. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిలో భారత్ ఎంతో ఎదిగింది. డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లను కూడా దేశంలోనే ఉత్పత్తి చేసేలా టెక్ కంపెనీలు కృషి చేయాలి. గూగుల్ కూడా తమ సర్వర్లను, జీపీయూ, చిప్‌లను ఇక్కడే ఉత్పత్తి చేసేలా చూడాలి. భారతదేశం చేస్తున్న ఈ సూచనను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు కూడా తెలియచేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల తక్కువ వ్యయంతోనే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేందుకు వీలుంది. విశాఖనుంచి 3 సబ్ సీ కేబుల్స్‌ను వేస్తున్నందుకు గూగుల్‌కు ధన్యవాదాలు. ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ మీదుగా యూరోప్‌కు, ఆఫ్రికా మీదుగా అమెరికాకు వెళ్లేలా ఈ సబ్ సీ కేబుల్స్ వేస్తున్నారు” అని వివరించారు. ఏపీలో రైల్వే అభివృద్ధిపై మాట్లాడుతూ. “డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ద్వారా ఏపీకి రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్‌ను కేటాయించాం. గతంలో ఉమ్మడి ఏపీకి కేవలం రూ.886 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఏపీని కనెక్ట్ చేస్తూ నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోనే తొలిసారి నవ నిర్మాణ్ ప్రాజెక్టు ద్వారా ఏపీలో 74 స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం.
832 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగాయి. 1039 కిలోమీటర్లమేర రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏపీ. 16 వందే భారత్ సర్వీసులు ఏపీలో నడుస్తున్నాయి. 22 అమృత్ భారత్ సర్వీసులు కూడా ఏపీనుంచి నడుస్తున్నాయి. రైళ్ల డిజైన్, ఉత్పత్తిలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఏపీలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లాంటి కీలకమైన విభజన హామీని కేంద్రం నెరవేర్చింది. 2026 జూన్ 1న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను అధికారికంగా నోటిఫై చేయబోతున్నాం. అమరావతి నుంచి హైదరాబాద్‌కు బులెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారం కానుంది. 70 నిమిషాల్లో అమరావతినుంచి హైదరాబాద్‌కు చేరుకునేలా ఈ ప్రాజెక్టు వస్తోంది. 112 నిముషాల్లో అమరావతినుంచి చెన్నైకు చేరుకునేలా బులెట్ ట్రైన్ నిర్మాణం చేస్తాం. అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రతీ అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయి. కోల్‌కోతానుంచి చెన్నై వరకూ ఉన్న తూర్పు కోస్తా రైల్వే డబుల్ లైన్లను ఫోర్ లైన్లుగా మారుస్తాం. కంటైనర్, ఫ్రైట్ ట్రైన్లతోపాటు 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తాం” అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్టవ్ స్పష్టం చేశారు.















