- 2014 మించి ఓట్లు రావాలి
- చేసిన అభివృద్ధి..తెచ్చిన మార్పు.. పడిన కష్టం ప్రజలకు వివరిద్దాం
- పనిచేసిన వారికే పదవులు..సీనియారిటీ, సిన్సియారిటీతో కూర్పు
- సమర్థుడు కాబట్టే లోకేష్‌కు పదవి
- క్యాడర్‌ను ముందుండి నడిపించారు
- 2024కు ముందు ప్రతి ఘటన..చేసిన ప్రతి పోరాటం గుర్తుంది
- తలవంచని సైన్యం టీడీపీ సొంతం
- గొడ్డలి పార్టీకి మానసిక అనారోగ్యం
- గూగులే కాదు..స్వాతంత్య్రం తెచ్చామని కూడా ప్రచారం చేసుకుంటుంది
- నేరస్తులతో పోరాడుతున్నాం..ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలి
- నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కార్యవర్గంతో ప్రమాణస్వీకారం
అమరావతి(చైతన్యరథం): ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో 2014 మించి కూటమి పార్టీలకు ఓట్లు రావాలని టీడీపీ కొత్త కార్యవర్గానికి, నేతలకు, కార్యకర్తలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ మరో మÖడేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయని ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకో వాలి. రాష్ట్రాన్ని పునర్నినిర్మాణం చేసేందుకే కూటమికి ప్రజలు ఓట్లేశారు. వచ్చే ఎన్నికల్లో 2024లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు రావాలి..అప్పుడే బాగా పని చేసినట్లు లెక్క. ఓటు బ్యాంక్ నిత్యం పెరుగుతూనే ఉండాలి. పార్టీ ప్రతిష్ట పెరిగేలా ప్రతిఒక్కరూ పనిచేయాలి. పార్టీ శాశ్వతంగా ఉండాలి.. తెలుగుదేశం బాగుం టే.. రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, ఇస్తున్న సంక్షేమం.. తెచ్చిన మార్పు.. పడిన కష్టాన్ని ప్రజలకు చెబుదాం. ప్రతిదీ నిష్టతో.. మనస్సుతో.. భవిష్యత్తు కోసం పనిచేయాలి. స్థాని క సంస్థల ఎన్నికలు వన్‌సైడ్‌గా ఉంటాయని చెప్పారు.
తలవంచని.. మీసం మేలేసే క్యాడర్ టీడీపీ సొంతం
ఎన్నో వడపోతలు, లెక్కలు, ఈక్వేషన్లతో కమిటీలను ఏర్పాటు చేశాం. సీనియర్లను గౌరవిస్తూ.. కొత్తవారికి అవకాశాలు ఇస్తూ.. కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలను ఏర్పాటు చేశాం. తెలుగు దేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మేలేస్తారు.. ఎవ్వరికీ తలవంచ రు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కార్యకర్తే అధినేత అనేది నినాదంగా కాదు.. విధానంగా మార్చుకు న్నాం. మండల పార్టీ అధ్యక్షురాలికి.. క్లస్టర్ ఇన్‌చార్జికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించాం. మహిళలకు ఎక్కువగా అవకాశాలి చ్చాం. మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతిచ్చాం. చదువుకున్న వారికి మంత్రి పదవులిచ్చి ప్రొత్సహించాం. రామ్మోహన్నాయుడు, శబరి, రాజేష్ వంటి వారిని జాతీయ ఉపాధ్యక్షులుగా చేసుకున్నాం. సినీయారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీ-ఇంజనీరింగ్ వంటి కస రత్తు చేసి కమిటీ కూర్పు చేపట్టామని వివరించారు.
సమర్థతను గుర్తించే లోకేష్‌కు బాధ్యతలు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చాలా కీలక పాత్ర పోషించా రు. క్యాడర్‌ను నిరంతరం మోటివేట్ చేశారు. అధికారంలోకి వచ్చాక పార్టీని గేరప్ చేశారు. ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహిం చారు. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామనే హామీని నెరవేర్చేం దుకు లోకేష్ కృషి చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేషే. సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాం. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదు.. అత్యున్నత బాధ్యత. అప్పగించిన పదవిని బాధ్యత తో నిర్వహించాలి. 2024కు ముందున్న పరిస్థితులన్నీ అందరికీ తెలుసు. నాకు ప్రతి ఘటన.. ప్రతిఒక్కరి పోరాటం గుర్తుంది. కార్యకర్తలు పడ్డ కష్టాలు గుర్తున్నాయని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం
“వెంటిలేటర్ మీదున్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సాయంతో గట్టె క్కిస్తున్నాం. ఒక్కొక్కడుగు వేస్తున్నాం… వ్యవస్థలను గాడిలో పెడు తున్నాం. నిలిచిన కేంద్ర పథకాలను పునరుద్ధరించాం. అప్పులను రీ-షెడ్యూల్ చేస్తున్నాం. సూపర్‌సిక్స్ హామీలు నెరవేర్చాం. సంక్షే మం అందిస్తున్నాం. సుపరిపాలనతో వాట్సాప్ సేవలు అందిస్తు న్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తున్నాం. పోలవరం, అమరావతి పను లు చేపడుతున్నాం. స్టీల్ ప్లాంట్‌ను రివైవ్ చేయగలుగుతున్నాం. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. రాష్ట్రానికి గత పాల నలో పోయిన బ్రాండ్.. నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలిగాం. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. విధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాం. ట్రూ అప్ ఛార్జీల భారం భరిస్తున్నాం. ట్రూ డౌన్ ఛార్జీల ద్వారా ప్రజలపై విద్యుత్ భారం తగ్గిస్తున్నాం. కరెంట్ ఛార్జీల పెంచకుండా పాలన చేపడుతున్నాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా చర్యలు చేపడుతున్నాం. గతేడాది 30 పైసలు తగ్గించాం.. మరో 30 పైసలు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాం. కరెంట్ ఛార్జీలు తగ్గించే ఆలోచనతో పనిచేస్తున్నాం. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, హైవేలు పూర్తి చేసుకుం టున్నాం. విశాఖను టెక్ నగరంగా మారుస్తాం. రెవెన్యూ రికార్జుల ను ప్రక్షాళన చేస్తున్నాం. నిధుల లభ్యత తక్కువగా ఉన్నా.. సమర్థ పాలనతో పనులన్నీ చేస్తున్నాం. తెలంగాణలో రాష్ట్రా ఆదాయంలో జీతాలకు 45 శాతం ఖర్చు పెడుతోంటే.. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 99 శాతం జీతాలకు ఖర్చు పెడుతున్నాం. అభివృద్ధి-సంక్షేమం ఆగకూడదని నిరంతరంగా కార్యక్రమాలు చేపడుతు న్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎంతో కష్టపడి పనిచేస్తు న్నాం. ఠంచనుగా ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తు న్నాం. దేశంలోని బెస్ట్ పాలసీలను అమలు చేస్తున్నామని వివరించారు.
గొడ్డలి పార్టీకి సీసీడీ సోకింది
మనం చేసిన మంచినే కాదు.. ప్రత్యర్థుల కుట్రలను ప్రజలకు వివరించాలి. గొడ్డలి పార్టీ చేస్తున్న చెడును అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా నాశనం చేసింది చాలక.. ఇప్పుడూ కుట్రలు చేస్తున్నారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదు.. అభివృద్ధి గిట్టదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకురావాలంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ప్రత్యర్థు లు చేస్తున్నారు. ఇంత అడ్డుకుంటున్నా పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లింది. సీసీడీ అనేది ఓ వ్యాధి… గొడ్డలి పార్టీకి ఆ వ్యాధి సోకింది. క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో గొడ్డలి పార్టీ మానసిక అనారోగ్యానికి గురైంది. వీళ్లని ఇలాగే వదిలేస్తే దేశానికి స్వాతంత్య్రం కూడా తామే తెచ్చానని చెబుతారు. ఆపరేషన్ సింధూర్‌కు అవసరమైన డ్రోన్లను కూడా తామే పంపామని చెప్పేలా ఉంది. మనకే అనుమానం వచ్చేలా ఫేక్ ప్రచారం చేయడంలో గొడ్డలి పార్టీ ముందుంటుంది. సొంత బాబాయి వివేకాను హత్య చేసి నెపం మనపై నెట్టారు. వాళ్ల కార్యకర్తను కారుతో తొక్కించి.. ఆ పాపాన్ని మనపైకే నెట్టారు. కబ్జా చేసిన ఆస్తుల కోసం కడపలో అనుచరుడినే చంపేశారు.. వాస్తవాలు బయటపడితే ఎదురు దాడి చేస్తున్నారు. నా జీవితంలో రాజకీ య నేతలతో పోరాడాను కానీ.. నేరస్తులతో పోరాడలేదు. తొలిసారిగా నేరస్తులతో పోరాడుతున్నాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనది అభివృద్ధి.. వాళ్లది అవినీతి… మనది వికాసం… వాళ్లది విధ్వంసం. మనం రిలాక్స్ అయితే.. అబ ద్ధాలు ప్రపంచమంతా తిరుగుతాయి. అందుకే ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఫ్లెక్సీల కోసం..కుర్చీల కోసం గొడవలొద్దు
తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు క్రమశిక్షణతో పనిచేయడం పార్టీ మూల సిద్ధాంతం. ప్రజలతో సౌమ్యంగా ఉండాలి.. అందుబాటులో ఉండాలి. ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. నేతలు, కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి.. నేను చాలా మనస్థా పానికి గురయ్యాను. మనం సుపరిపాలన యజ్ఞం చేస్తున్నాం.. మన వాళ్లు కూడా సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగు తుంది. నేను, పవన్‌కళ్యాణ్ చక్కగా ఉంటున్నాం. మంచి రిలేష న్ కొనసాగిస్తున్నాం. ఇదే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వ్యవహరించాలి. బీజేపీని కలుపుకుని వెళ్లాలి.. రాష్ట్రానికి-కేంద్రానికి గ్యాప్ లేదు.. రాకూడదు. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు… ఫ్లెక్సీల దగ్గర, ఫొటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామస్థాయి కార్యక ర్తలు దీన్ని గుర్తు పెట్టుకోవాలని హితవుపలికారు.
ప్రజలు గమనిస్తున్నారనే స్పృహతో ఉండాలి
నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవరిస్తే ప్రజలు హర్షించరు. గతంలో పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూశాం.. ప్రజలు ఆ పార్టీకి బుద్ది చెప్పారు. బూతులు, వివాదాలు, దాడులు, గొడ వలు, సెటిల్మెంట్లకు దూరంగా ఉందాం. మనకు ప్రజలు సహక రించారు.. నమ్మకం పెట్టుకున్నారు.. ప్రస్తుతం ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. ఎవరైనా అధికారం ఉందని ఈగోలకు పోతే.. భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. నేతలు తమ కింద వాళ్లకు కూడా సత్ప్రవర్తనను నేర్పించాలి. కీలక పదవుల్లో ఉన్న వారు తప్పు చేస్తే మీడియాలో హెడ్డింగులు వస్తాయి. అనునిత్యం పని చేయడంతో పాటు.. పార్టీ క్రమశిక్షణను కూడా కాపాడాలి. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండొద్దు.. మళ్లీ మళ్లీ ఎన్నిక కావాలి. అందరూ మనస్పర్థలు లేకుండా పనిచేయాలి. తాను లేకుండా ఎంపీ తమ ప్రాంతానికి రాకూడదని ఎమ్మెల్యేలు అనడం కరెక్ట్ కాదు. టిక్కెట్ ఇచ్చిన వారి వెంటే క్యాడర్ ఉంటారు. ఇదే టీడీపీ స్పెషాలిటీ. లీడర్లు ఈ విషయాన్ని నిత్యం గుర్తుంచుకోవాలి. పర్మిషన్లతో పదవులు ఇవ్వరు.. పనిచేసిన వారికే పదవులిస్తాం. అన్నీ తెలుసని తప్పులు చేయొద్దు.. నేర్చుకుందాం.. రాష్ట్రానికి ఉపయోగపడదామని పిలుపునిచ్చారు. ఈ ప్రమాణ స్వీకారోత్స వంలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.















