- పనులు అస్సలు ఆగలేదుగా…
- రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై
- మంత్రి నారా లోకేష్ వీడియో పోస్ట్
అమరావతి(చైతన్యరథం): ‘సారీ బ్రో’ వర్షం పడితే అమరావతి మునిగిందంటూ విషప్రచారం చేసే గొడ్డలి పార్టీకి ఈ వీడియో అంకితం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి బ్రేకులు పడే పరిస్థితి లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తు న్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్య కలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఐకానిక్ టవర్ల పనులు, అసెంబ్లీ, హైకోర్టు, రిజర్వాయర్లు, మినిస్టర్ బంగ్లాలు, రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, ఎన్జీవో టవర్లు, జీవో టవర్స్, సెక్రటరీ బంగ్లాలు, ఎల్‌పీఎస్ ప్లాట్ల పనులు, గ్రూప్ డీ టవర్స్, హ్యాపీనెక్ట్స్, జీవోడీ టవర్స్ ఏ పనులు ఆగలేదంటూ సంబంధిత ప్రాంతంలో జరుగుతున్న పనులకు సంబంధించి వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్‌లో సాగుతున్నాయని తెలిపారు.
రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదని స్పష్టం చేశారు. వర్షాలు పడితే అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేసే వారికి ఈ వీడియో ఓ సమాధానమని వ్యాఖ్యానించారు. జోరుగా వానలోనూ నిర్మాణ పనులు కొనసాగుతున్న దృశ్యాలను ప్రజలకు చూపించేందుకే ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలిపారు. ఇకనైనా అమరావతి గురించి అసత్య ప్రచారాలు, విషప్రచారం మానుకోవాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణంలో ఇకపై పాజ్ అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘స్పీడ్ పెంచిన అమరావతి.. నవ్యాంధ్ర భవిష్యత్తుకు అసలైన గ్యారంటీ’ అని మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.















