- పొగాకు రైతులను ఆదుకోలేని వ్యక్తికి ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు
- వారి కష్టాలపై నాడు జగన్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర
- నేడు అన్ని విధాలా భరోసాగా నిలిచిన కూటమి ప్రభుత్వం
- రైతులందరూ పంటల బీమా చేయించుకోవాలి
అమరావతి (చైతన్యరథం): అధికారంలో ఉండగా రైతుల సంక్షేమం విషయంలో పూర్తిగా విఫలమైన జగన్ రెడ్డి.. ఇప్పుడు రైతులపై ఎక్కడా లేని ప్రేమ చూపిస్తూ కపట నాటకాలు ఆడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఐదేళ్ల పాలనలో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా వారికి అండగా నిలవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 12.93 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుతో చేతులు దులుపుకుని రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేసిందని మండిపడ్డారు. రైతులకు శాశ్వత ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడంలో, మార్కెట్‌లో సమర్థవంతంగా జోక్యం చేసుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పొగాకు రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని కార్యాచరణ ప్రారంభించిందని మంత్రి తెలిపారు. గత ఏడాదిలోనే సుమారు 25 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకును రూ.270 కోట్ల విలువతో కొనుగోలు చేసి వేలాది మంది రైతులకు అండగా నిలిచామని చెప్పారు. అలాగే ఎఫ్‌సీవీ (వర్జీనియా) పొగాకు రైతులను ఆదుకునేందుకు లో, ఆఫ్ స్టైల్ రకాల పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్లు తెలిపారు.
సుమారు 100 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు అందించే కేంద్ర కార్యాచరణ కొనసాగుతోందన్నారు. రైతులకు మార్కెట్ భరోసాతో పాటు ఆర్థిక తోడ్పాటు కూడా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సమన్వయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తమ కృషి ఫలితంగానేû కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించేలా కేంద్ర వ్యవసాయ శాఖ, బీమా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా చర్చలు జరిపిందన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం సాధ్యమైందని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, ఇతర అనివార్య పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో పంటల బీమా కీలక రక్షణగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్క రైతు బీమా చేయించుకోవాలన్నారు. రైతులు అతి తక్కువ ప్రీమియం మొత్తం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, వ్యవసాయ అధికారులు రైతులకు పూర్తి అవగాహన కల్పించి, బీమా ప్రీమియం కట్టించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు ఆగస్టు 15లోపు పంటల బీమాలో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల కష్టసుఖాలు తెలియని జగన్.. ఇప్పుడు రైతు గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. మాటలతో కాదు… చేతలతో రైతులకు అండగా నిలవడం కూటమి ప్రభుత్వ నిబద్ధత అని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
















