- యూనిట్ రూ.1.50 చొప్పున ఈ నెల నుంచే
- ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు
- బ్యారెల్‌కు రూ.50 వేల రుణం ప్రారంభించాలి
- రైతులకు ఎల్‌నినో సంక్షోభ నివారణ ప్రణాళిక
- ఆగస్టు 7 నుంచి అవగాహన కార్యక్రమాలు
- అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఎల్‌నినో ప్రభావం, ఆక్వా, పొగాకుపై సూచనలు
అమరావతి(చైతన్యరథం): నాన్ ఆక్వాజోన్‌లో ఉన్న ఆక్వా రైతులకూ ఈ నెల నుంచే రాయితీపై విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్వా జోన్ పరిధిలో ఇస్తున్నట్లే నాన్ ఆక్వా జోన్‌లో ఉన్న రైతులకూ యూనిట్ విద్యుత్‌ను రూ.1.5కే ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఇక జోన్లకు మాత్రమే పరిమితం కాకుండా ఆక్వా రైతులందరికీ రాయితీ విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ నిర్ణయంతో 12,500 మంది ఆక్వా రైతులకు లబ్ధి కలగనుంది. సచివాల యంలో మంగళవారం రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జలవనరులు తదితర అంశాలపై వ్యవసాయ శాఖతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రాష్ట్రంలోని ప్రతీ రైతు వద్దకు వెళ్లాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతులు అనుస రించాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికలు వారికి వివరించాలని సూచించారు. ఆగస్టు 7 నుంచి రైతులకు అవగాహనా కార్యక్ర మాలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ ప్రణాళికలు అనుసరించేలా చూడాలి
ఎల్‌నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అక్టోబరు మాసం వరకూ లోటు వర్ష పాతం నమోదయ్యే సూచనలున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అనుసరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేకించి పీఎండీఎస్ విధా నంలో సాగు చేసేందుకు ఉన్న అవకాశాలను రైతులకు వివరిం చేలా రైతుల వద్దకు వెళ్లాలని నిర్దేశించారు. ఎల్‌నినో లాంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్పష్టమైన విధానాన్ని రైతులకు అందించాలని స్పష్టం చేశారు. రైతు యాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వేగంగా అందించాలని స్పష్టం చేశారు. వర్షపాతం తగ్గి సాగు విస్తీర్ణం పెరుగుతోందని, క్షేత్రస్థాయిలో వస్తున్న ఈ మార్పు లకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. ఎల్‌ని నో ఎఫెక్ట్ మిటిగేషన్ యాక్షన్ ప్లాన్ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పశువుల దాణా విషయంలోనూ వీబీ జీ రామ్ జీ అనుసంధానించాలని సూచించారు.
ఆఫ్ స్టైల్ పొగాకు రైతును ఆదుకునేందుకు రూ.94 కోట్లు
ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు ధర ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచే ఇది అమల్లోకి రావాలని దిశానిర్దేశం చేశారు. 94 మిలియన్ కిలోల ఆఫ్ స్టైల్ పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీని ద్వారా 44 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, రైతులు సహా ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి సమీక్షించాలని నిర్దేశించారు. అలాగే ఎఫ్ సీవీ పొగాకు కొనుగోళ్లు ప్రస్తుతం 48.27 మిలియన్ కిలోల కొనుగోళ్లు జరిగాయని అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేలా బ్యారెల్‌కు రూ.50 వేల రుణం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ఆక్వా సంక్షోభాన్ని నివారించేలా రొయ్య మేత ధరల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల న్నారు.
రొయ్య మేత ధరలు పెరగకుండా చర్యలు
ఫిష్ మీల్ ఎగుమతులను 50 శాతానికి తగ్గించేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకూ రొయ్య మేత ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై వేగంగా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇక నుంచి ప్రతీ మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగా లపై, ఎల్‌నినో ప్రభావం నియంత్రణా చర్యలపై సమీక్ష నిర్వహి స్తానని స్పష్టం చేశారు. ఈ సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, జల వనరులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

















