- కోవిడ్ -19 తర్వాత భారీగా పెరిగిన కొనుగోలు
- ఆసుపత్రుల్లో అక్సిజన్ సరఫరా, వినియోగంపై అధ్యయనం, సిఫారసులకు కమిటీ
- పలు కారణాలతో రూ.105 కోట్లతో నిర్మితమై, నిరుపయోగంగా 161 పీఎసఏ ప్లాంట్లు
- మరమ్మతులు, నిర్వహణకు భారీ వ్యయం
- పీఎసఏ ప్లాంట్ల కొనసాగింపుపైనా నివేదిక ఇవ్వాలి
- సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
అమరావతి (చైతన్యరథం): కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు రూ.105 కోట్లతో నిర్మితమై నిరుపయోగంగా మారిన పీఎసఏ ( ప్రెషర్ స్వింగ్ అడ్సార్పషన్ ) ప్లాంట్లు, అధిక మోతాదులో ఎలఎంఓ (లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) కొనుగోళ్ల విషయాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో రెండు గంటలపాటు లోతుగా సమీక్షించారు. ఎలఎంఓ కొనుగోళ్లకు సంబంధించి, వాస్తవ డిమాండ్, సరఫరా విషయాలపై రెండు వారాల్లో సమగ్రంగా ఆడిట్ నిర్వహించి, లోపాల గుర్తింపు, సవరణ చర్యలను చేపట్టి, ఆ మేరకు ఎనిమిది ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలపాటు అమలుపరిచి అక్టోబరు 15 లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. తద్వారా ఎలఎంఓ డిమాండ్, సరఫరాలోని వ్యత్యాసాన్ని గుర్తించి ఆక్సిజన్ కొనుగోలు ఖర్చును వీలైనంత వరకు కొవిడ్-19 పూర్వ స్థితికి తీసుకురావాలని మంత్రి స్పష్టంచేశారు.
భారీగా పెరిగిన ఆక్సిజన్ కొనుగోలు వ్యయం
కోవిడ్-19 తీవ్రంగా ఉన్న 2020-21, 2021-22 సంవత్సరాల్లో రూ.95.43 కోట్ల మేరకు బోధనాసుపత్రుల్లో ఎలఎంఓ కొనుగోలు చేశారు. కోవిడ్-19కు ముందు 2016-20 మధ్య కాలంలో (నాలుగేళ్లు) రూ.60.51 కోట్ల మేరకు వ్యయం చేశారు. కోవిడ్ అనంతరం 2022-26 మధ్య నాలుగేళ్ల కాలంలో ఎలఎంఓ కొనుగోలు వ్యయం రూ.180.82 కోట్లకు చేరిందని సమీక్షా సమావేశంలో మంత్రి గుర్తించారు. గత నాలుగేళ్లలో కొత్త బోధనాసుపత్రులు, కొత్త ఆసుపత్రులు ఉనికిలోకి రావడం, పడకలు పెరగడం పెరుగుదలకు కొంతమేరకు కారణమైనప్పటికీ అధికారులు వివరించిన ఆక్సిజన్ డిమాండ్, వాస్తవ సరఫరాకు మధ్య భారీ అంతరం కనిపిస్తోందని, దీనిపై లోతుగా పరిశీలించి కొనుగోలు వ్యయాన్ని తగ్గించే దిశగా అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ఈ పరిశీలనకు అనంతపురం బోధనాసుపత్రి (సూపర్ స్పెషాలిటీతో సహా), గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం బోధనాసుపత్రులతోపాటు రెండు జిల్లా, రెండు ఏరియా ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఆరోగ్య పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ‘పాత’ సంస్థ ఈ అధ్యయనాన్ని చేపడుతుంది.
పీఎసఏ ప్లాంట్లు ఉపయోగమా..నిర్థకమా
కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో డీఎంఈ పరిధిలో 62 ఆసుపత్రుల్లో, సెకండరీ హెల్త్ పరిధిలో 100 (మొత్తం 162 ) పీఎసఏ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. అయితే ఈ ప్లాంట్ల ద్వారా తయారయ్యే ఆక్సిజన్ ప్యూరిటీ (నాణ్యత), నిర్వహణా నియంత్రణకు సంబంధించి తగిన సాంకేతిక సిబ్బందిని నియమించకపోవడం, ఐసీయూ, సాధారణ వార్డులకు ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన నాణ్యతతో నిమిత్తం లేకుండా ఒకే పైపులైన్ వ్యవస్థ ఉండడంవంటి వివిధ కారణాలవల్ల 162 కు 161 పీఎసఏ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. ఈ ప్లాంట్ల మరమ్మతులకు డీఎంఈ పరిధిలో రూ.6.20 కోట్లు, నిర్వహణకు ఏటా రూ.2.60 కోట్లు, డీఎస్‌హెచ్ పరిధిలో మరమ్మతులకు రూ.4.76 కోట్లు, నిర్వహణ కోసం ఏటా రూ 6.7 కోట్లు అవసరమవుతుందని మంత్రికి అధికారులు వివరించారు. ఈ మేరకు నిధులు ఖర్చుచేసిన ఈ పీఎసఏ ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగించవచ్చా? ఆర్థికంగా ఈ ఖర్చు సమర్థనీయమా? కాకుంటే ఈ నిరర్థక ప్లాంట్లను ఏంచేయాలన్న విషయాలపై కూడా నివేదిక తెప్పించాలని మంత్రి ఆదేశించారు. రాజస్థాన్ రాష్ట్రంలో పీఎసఏ ప్లాంట్ల పనితీరును కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
తక్షణ చర్యలకు మంత్రి ఆదేశం
కోవిడ్-19 నేపథ్యంలో భారీగా పెరిగిన ఎలఎంఓ కొనుగోలును వీలైనంతమేర తగ్గించేందుకు బోధనాసుపత్రుల్లో తక్షణ చర్యలు చేపట్టేలా చూడాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు ఆసుపత్రుల్లో ఎలఎంఓ నిల్వ, సరఫరాల్లో ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు సమాచారం ఉన్నందున ఈ విధమైన వృథాను తగ్గించేందుకు వెంటనే పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని, ఆ మేరకు ఆసుపత్రులకు వెంటనే ఆదేశాలివ్వాలని అధికారులకు సూచించారు. వార్డుల స్థాయిలో, ఐసీయÖలో పడకల స్థాయిలో ఆక్సిజన్ సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని రికార్డు చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. ఎలఎంఓ సరఫరా, వినియోగానికి సంబంధించి అధ్యయన కమిటీ నివేదిక అందిన వెంటనే మరో సమీక్ష నిర్వహించి అక్సిజన్ కొనుగోలు వాస్తవ డిమాండ్ మేరకే జరిగేలా స్పష్టమైన ఆదేశాలను మంత్రిత్వ శాఖ జారీచేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, ఏడీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి, డీఎంఈ జాయింట్ డైరెక్టర్ గణపతిరావు, డీఎసఎచ్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సుజాత, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















