- సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు
- 7,158 క్యూసెక్కులు విడుదల చేస్తున్నాం
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి పరిశీలన
అమరావతి(చైతన్యరథం): ప్రకాశం బ్యారేజ్లో గోదారమ్మ నీటి పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని తిలకించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో కొద్దిసేపు తన వాహన కాన్వాయ్ నిలిపి గోదావరి నీటితో నిండు కుండలా ఉన్న బ్యారేజ్ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని తెలిపారు. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాబావ పరి స్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని అభిప్రాయ పడ్డారు. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా ఎల్సినో పరిస్థితుల్లో సాగు నీటి ఇబ్బందులు అధిగ మించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారుల కు సూచించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలువస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలించినట్లు అధికారులు వివరిం చారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటివరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు తెలిపారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.












