- ఈ నెల 15 నుంచి ‘పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ’
- 2047 లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడికీ భాగస్వామ్యం
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
అమరావతి (చైతన్యరథం): నేషన్ బిల్డింగ్‌లో ప్రతి పౌరుడినీ భాగస్వామిగా చేసేలా ‘పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ’ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంలో… 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ నిర్ణయించుకునేలా ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలు రూపొందించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘పంద్రాగస్టు రోజన స్వాతంత్య్ర వేడుకల నిర్వహణతో పాటు… నేషన్ బిల్డింగ్ దిశగా ప్రజల్లో చైతన్యం రగిలించేలా కార్యక్రమాలు రూపొందించాలి. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలి. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికీ చేరాలి. 2047 లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసేలా ప్రొత్సహించాలి. రాష్ట్ర, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించేలా కార్యక్రమాలను డిజైన్ చేయాలి. గ్రామ స్థాయి నుంచి వివిధ రంగాల్లో లీడర్‌షిప్ ఎదిగేందుకు వేదికలను సృష్టించాలి. గ్రామాల్లో ఒకప్పుడు ఉన్న స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పునరుద్ధరించాలి. దీనికి నేషన్ బిల్డింగ్ ఇన్ పార్టనర్స్ కార్యక్రమం వేదిక కావాలి. యువతలో ఉన్న ఆలోచనలను, ఎనర్జీలను నేషన్ బిల్డింగ్ కోసం ఉపయోగించుకోవాలి. ప్రజలు కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా.. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనలో స్టేక్ హోల్డర్లుగా మారాలి. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని మాస్ మూవ్‌మెంట్‌గా తీర్చిదిద్దాలి’ అని సూచించారు. సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనిత, సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.











