అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, వివిధ శాఖల సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. సోమవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) సేవలు, వివిధ కీలక శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా సెర్ప్, దేవదాయ, ఆర్టీసీ, ఆరఅండ్‌బీ, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరు, సేవల్లో నమోదవుతున్న పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుని, దానికనుగుణంగా శాఖల సేవల ప్రమాణాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు నేరుగా ప్రజలకు చేరి, వారిలో పూర్తి సంతృప్తి కలిగినప్పుడే పాలనకు ప్రాధాన్యత దక్కుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రజా సమస్యలకు వేగంగా పరిష్కారం చూపేలా, పాలనలో జవాబుదారీతనం పెంచేలా విధాన రూపకల్పన ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఆర్టీజీఎస్ ద్వారా అందుతున్న డేటాను క్షేత్ర స్థాయి పరిశీలనకు అనుసంధానించాలని సూచించారు. సమావేశంలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.













