- జనవరి 1 నుంచి హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్
- ఫార్మా రంగానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్
- మెడ్క్తో వైద్యపరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం
- డబులింజన్ ప్రభుత్వంతో వైద్య ఆరోగ్య రంగానికి ఊపు
- అమరావతిని సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం
- క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు అవసరం
- వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి కార్యక్రమాల
- ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- రూ.249 కోట్లతో 10 క్రిటికల్ కేర్ బ్లాకులు,
- 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీల ప్రారంభం
- పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
విజయవాడ(చైతన్యరథం): వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక తను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగు తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంజీవని అమలు చేయనున్నామని, వైద్యరంగంలో ఇది గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని చెప్పారు. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని తెలిపారు. అమరావ తిలో ఏర్పాటు చేయబోతున్న క్వాంటం బయో వ్యాలీని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. శనివారం వైద్యారోగ్య శాఖకు చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు సందర్శించి కొత్తగా నిర్మించిన బ్లాక్, ల్యాబరేటరీని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వారు వర్చువల్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు లతో రాష్ట్రంలో 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సదుపా యాలతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్యవిభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. అత్యాధునిక వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందు లను తగ్గించేలా ఈ సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో వైద్యరంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. దేశంలో మెడికల్ సీట్లను 51 వేల నుంచి రెండింతలకు పైగా పెంచారని వివరించారు. కొవిడ్ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు మందులు అందుతున్నాయని చెప్పారు. అభా కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఫార్మా రంగాని కి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉందని, మెస్టిక్ పార్కు ద్వారా వైద్యపరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వంట శాలను ఫార్మసీగా… ఆహారాన్నే ఔషధంగా భావించాలని సూచిం చారు. ఈ మేరకు ఆరోగ్య పద్ధతులను మార్చుకోవాలని చెప్పారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, యోగాభ్యాసంతో ఎనర్జీ లెవల్స్ పెరుగుతా యని పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే సాంకేతి కతను అందిపు చ్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించ వచ్చని తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి నిధులు కేటాయిస్తు న్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
హెల్తీ-వెల్తీ-హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా అభివృద్ధి
జేపీ నడ్డా నాయకత్వంలో దేశంలో ప్రతిఒక్కరి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందన్న నమ్మకం ఉందన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే ఇటువంటి అభివృద్ధి సాధ్యమ వుతోందని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంతో పాటు అన్ని రంగా ల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని అందిస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని గుర్తుచేశారు. కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలకు ప్రజలు సహకరించి భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా అమరావతి
సంప్రదాయ ఆరోగ్య విధానాలను కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే వైద్య ఆరోగ్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించగలం..సాంకేతికతను అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తే రాబోయే పదేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించగలదని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీని ఏర్పాటు చేస్తున్నా మని, దీనికి జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలోనే ప్రారంభం కానుందని తెలిపారు. అమరావతి గురించి లద్దాఫ్లోనూ చర్చించుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో అమరావతికి గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా అమరావతి గురించి చర్చించుకునే రోజు వస్తుందని చెప్పారు. ఏఐ రంగంలో నిపుణులను తీర్చిదిద్దేం దుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రజా ప్రతినిధులు కేశినేని శివనాధ్, బోండా ఉమ, సోము వీర్రాజు సహా వైద్యారోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











