- పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా సంక్షేమం… ఇదే కూటమి ప్రభుత్వ విధానం
- కొత్త పెన్షన్లకు ముందే ఫ్యామిలీ యూనిట్ మ్యాపింగ్ పూర్తవ్వాలి
- అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను పూర్తి చేయండి
- యానాటి కొండ సామాజికవర్గానికి ఎస్టీలకు కలిగే ప్రయోజనాలు
- సూపర్-6 పథకాల అమలుపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం చిన్న కుటుంబాలుగా విడగొట్టకుండా… భవిష్యత్తులో అన్ని పథకాలను ఫ్యామిలీ యూనిట్ గానే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబాల మ్యాపింగ్ చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న లబ్దిదారులను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రేషన్, పెన్షన్ల కోసం కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోవడం సరికాదన్నారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదే ప్రభుత్వ విధానమని… దానికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 8వ కలెక్టర్ల సమావేశంలో రెండో రోజైన శుక్రవారం సూపర్-6 పథకాలపై కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు.
సంక్షేమం నుంచి కుటుంబ సాధికారత విధానంతో ముందుకు
కుటుంబంలో ఎంత మంది ఉంటే… అంత మందికీ ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించేలా చూడాలని సీఎం సూచించారు. సంక్షేమ పథకాల అమలులో కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని సమగ్ర ప్రయోజనాలు అందించే విధానం రూపొందించాలన్నారు. వివిధ పథకాల్లో ఉన్న లోటుపాట్లను సరిచేసి అత్యుత్తమ విధానాలను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు. ఇందులో ఒక్క పెన్షన్లకే రూ.75వేల కోట్లు వ్యయం చేసినట్టు వెల్లడించారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలన్నారు. సంక్షేమం నుంచి కుటుంబాలను సాధికారత దిశగా తీసుకెళ్లే ‘వెల్ఫేర్ టు ఎంపవరింగ్ ఫ్యామిలీస్’ విధానంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. సెర్ఫ్, మెప్మా ద్వారా ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్ప్రైన్యూర్’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. ఐదు లక్షల మంది మహిళలను ఎంటర్ప్రైన్యూర్లుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టామని తెలిపారు. వివిధ సామాజికవర్గాలను సాధికారత దిశగా తీసుకెళ్లాలి… అందర్నీ అభివృద్ధి చేయాలన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మెరుగైన విద్య అందించాలని స్పష్టం చేశారు. పీ4 కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.
విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి చొరవ
ప్రతినెలా మొదటి తేదీని ‘పేదల సేవలో’ కార్యక్రమం ద్వారా సంక్షేమానికి కేటాయించామని సీఎం తెలిపారు. అదే విధంగా ప్రతినెలా 9న ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నాలుగో శనివారం పౌరుల ఆరోగ్య నిర్వహణ కోసం డిజిటల్ హెల్త్ రికార్డుల ‘సంజీవని’ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు మంచి ఆలోచనలు, విలువలతో కూడిన సమాజ నిర్మాణం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మహిళలు, శిశువుల్లో రక్తహీనత వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని… ఇదే విజన్-2047లో కీలక లక్ష్యమని చెప్పారు. వక్స్ ఆస్తుల ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న కాపు కార్పొరేషన్ భవనాలను పూర్తి చేయాలని సూచించారు.
బుడగజంగాల తరహాలో…
శ్రీకాకుళం జిల్లాలో యానాటి కొండ సామాజికవర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్ను కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. చాలా కాలంగా యానాటి కొండ సామాజికవర్గం వాళ్లు తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం… ఎస్టీల్లో చేర్చే అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని.. ఈలోగా ఎస్టీలకు వర్తింపచేసే ప్రయోజనాలను యానాటి కొండ సామాజికవర్గానికి అందించాలని ఆదేశించారు. బుడగ జంగాల తరహాలో యానాటి కొండ సామాజికవర్గానికి లబ్ధి చేకూర్చాలన్నారు. సమావేశంలో మంత్రులు, సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.










