అమరావతి (చైతన్య రథం): ఇంధన కొరతతో ఏపీలో పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, ఇబ్బందులపై అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు. బంకుల యజమానులు, ఇంధన కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. తక్షణం స్టాక్‌ని బంకుల వివరాలు అందించాలని ఆదేశించారు. స్టాక్ సమస్య ఉంటే తక్షణం టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోరారు. గత ఏప్రిల్‌కంటే పదిశాతం అదనపు సరఫరాకు ఆయిల్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. సీఎం ఆదేశాలతో పెట్రోల్ డీలర్ల నుంచి ఏపీఎఫ్‌పీటీ ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ వివరాలు సేకరిస్తున్నారు.















