- విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ సరికొత్త సంప్రదాయం
- పార్లమెంటువారీగా ప్రజాప్రతినిధులు, కుటుంబాలకు విందు
- మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధులు, కుటుంబాలతో ముచ్చట్లు
- ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టిన లోకేష్
- ప్రజాప్రతినిధుల వినతుల తాజాస్థితిపై నివేదిక అందచేత
అమరావతి (చైతన్య రథం): పార్లమెంటు నియోజకవర్గాలవారీగా కూటమి ప్రజా ప్రతినిధులను కుటుంబసభ్యులతో తన ఇంటికి ఆహ్వానించి, ఆహ్లాదకర వాతావరణంలో విందు ఏర్పాటుచేసి, మాటలు, ముచ్చట్లతో గడిపే సరికొత్త సంప్రదాయానికి విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో గురువారం రాత్రి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కుటుంబసభ్యులతో తన ఇంటికి విందుకు ఆహ్వానించారు లోకేష్. ఈ సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. అంతా ఒకేచోట కూర్చుని భోజనం చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులందరినీ పేరుపేరునా పలకరించిన లోకేష్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని ఆత్మీయంగా మాటలు కలిపారు. ఎటువంటి రాజకీయ చర్చలకు తావులేకుండా పూర్తిగా కుటుంబంలో జరిగే శుభకార్యంలా నిర్వహించారు. తన ఇంటికి వచ్చిన ఆడపడుచులకు లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి చేనేత కళాకారులు నేసిన పట్టుచీరలు బహుకరించారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల అభివృద్ధి, వివిధ సమస్యలపై తనకు ఇచ్చిన వినతులు తాజా స్థితి ఏమిటో తెలియజేస్తూ మంత్రి నారా లోకేష్ వారికే నివేదిక రూపంలో అందించారు.
ఇందులో తాను పరిష్కరించినవి, పరిష్కార దశలో ఉన్నవి, చేయలేకపోయినవి.. కారణాలు పేర్కొంటూ ఇచ్చిన నివేదికను చూసి ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఇంత ట్రాన్సపరెన్సీ రాజకీయాల్లో చూడటం ఇదే మొదటిసారి అంటూ తమ సహచరులకు చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్తనుంచి నాయకుడి వరకూ అందరినీ కుటుంబసభ్యులుగా భావిస్తుంది. ఎన్టీఆర్‌నుంచి మొదలైన ఈ సంప్రదాయం, చంద్రబాబు మరోస్థాయికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ప్రజాప్రతినిధుల కుటుంబాలను ఇంటికి పిలిచి గౌరవించి పంపించే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
పార్లమెంటు సమావేశాల్లో ఉండటంతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (జనసేన), అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆత్మీయ కలయికకు హాజరు కాలేదు. మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ (జనసేన), పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కుటుంబసభ్యులతో తరలివచ్చి ఆత్మీయ కలయికలో ఆనందంగా గడిపారు.












